ఆర్థికంగా అన్నదాత బాగుండాలి.. ఆరోగ్యంగా వినియోగదారుడు బాగుండాలి.. పూర్తి పోషకాలతో భూమి బాగుండాలి.. వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా ఉండాలి.. ఇదీ ప్రకృతి వ్యవసాయ విధానంలోని ప్రధాన అంశం. ఇవి అన్నీ సమగ్ర సుస్థిర వ్యవసాయ విధానంలో సుసాధ్యం. సన్నకారు, చిన్నకారు రైతులకు, పెద్ద పెద్ద కమతాలున్న రైతులకు కూడా చక్కగా పనికివచ్చేలా సుభాష్ పాలేకర్, విజయరామ్ చాలా ప్రతిష్టగా ఫైవ్ లేయర్ ఫార్మింగ్‌ను రూపొందించారు. తద్వారా పైన చెప్పుకున్న లాభాలన్నీ మనకు సమకూరతాయి. అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటే ఐదు అంచెల విధానం రూపకల్పన జరిగింది. సమగ్ర సుస్థిర వ్యవసాయ విధానంలో సహజసిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఇతర పంటలను రైతు తన కుటుంబానికి వాడుకోగా మిగిలిన పంటలను అమ్ముకోగా మిగిలిన వాటిని ఎలా వినియోగించుకోవచ్చో ధర్తీ SPKV ఫార్మ్ రైతు రాజవర్ధన్‌రెడ్డి వివరించారు. మిగిలిపోయిన కాయగూరలు, ఆకుకూరలు, లేదా పాడైపోయిన వాటిని కట్‌చేసి, కోళ్లు , మేకలకు వేసుకోవాలి. పంట తర్వాత వచ్చిన గడ్డిని ఆవులకు మేతగా ఇవ్వాలి. ఇలా ప్రతీదీ రైతన్నకు వినియోగంలోకి వస్తుంది. వాటిని తిన్న ఆవులు, కోళ్లు, మేకల వ్యర్థాలు మళ్లీ పంటలకు సహజ ఎరువుగా ఉపయోపడుతుంది. ఇదంతా ఓ రీ సైకిల్ మోడల్ అన్న మాట. ఇలాంటి విధానాన్నే మన పూర్వీకులు పాటించారు. ఆర్థికంగా.. ఆరోగ్యపరంగా కూడా వారు ‘రైతే రాజు’లా జీవించారు.రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి… వాడి భూమి సారాన్ని నాశనం చేసుకొని, మన ఆరోగ్యాలను చెడగొట్టుకొని ప్రస్తుత సమాజం చెప్పరాని ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి అవాంఛనీయ సమాజాన్ని మళ్లీ ఆరోగ్యవంతమైన, ఆనందదాయకమైన దారివైపు మళ్లించేందుకే రూపకల్పన జరిగింది సహజసిద్ధ వ్యవసాయానికి. ఐదంచెల వ్యవసాయ విధానంలో ఐదు అడుగుల బెడ్‌కు రెండు అంచుల్లో పసుపు లాంటి పంట పెట్టుకోవచ్చు. మధ్యలో చేమదుంపలు, ఆకుకూరలు లాంటివి సాగు చేయవచ్చు. సీజన్ ప్రకారం వచ్చే వెల్లుల్లి, ఉల్లి లాంటివి కూడా బెడ్‌కు రెండు చివరల్లో పెంచుకోవచ్చు. పొలం చుట్టూరా బంతి మొక్కలు నాటుకోవచ్చు. బంతి మొక్కల ద్వారా వాటి నుంచి పండగల సమయంలో ఆదాయంతో పాటు ప్రధాన పంటలకు పురుగుల బెడదను నివారించుకోవచ్చు. బంతిపూవు ఆకర్షణీయంగా ఉంటుంది. పొలం చుట్టూ దాన్ని పెంచుకుంటే పురుగులను ఆకర్షించి ఇతర పంటల జోలికి వాటిని రాకుండా చేస్తుంది. ఇక బీర, వంకాయ లాంటి వాటిలో సన్న పురుగు వస్తే.. నివారణ కోసం ద్రవ జీవామృతం కాని, పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపి గాని , నీమ్ ఆయిల్‌కు కుంకుడురసం కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.పండ్ల తోటలు పెంచుకుంటే మూడు నాలుగేళ్ల తర్వాత రైతన్నకు ఫలితం వస్తుంది. ఎలాంటి రైతు అయినా.. నెల నెలా ఆదాయం ఇస్తూ.. ఐదేళ్ల తర్వాత భూమి చక్కగా సారవంతం అయి, మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చేందుకు రూపొందించింది ఐదంచెల సాగు విధానం. ఈ విధానంలో ఎన్నో ప్రయత్నాల తర్వాత 60X60 అడుగుల మోడల్ తీసుకొచ్చారు. ఈ విధానంలో మొక్కలు ఎక్కువగా లేకుండా మంచి ఫలితాలు ఇస్తున్నదని రాజవర్ధన్‌రెడ్డి వివరించారు. రెండు మూడు ఎకరాలున్న రైతు వ్యవసాయంలో ఆర్థికంగా ఎదగలేకపోతున్నామనే భావనతో పట్టణాలు, నగరాలకు వెళ్లిపోయి, ఆత్మాభిమానం చంపుకొని కూలీలుగా, ఆటో డ్రైవర్లు గా, పెద్ద పెద్ద భవనాలకు వాచ్‌మెన్‌గా జీవితాలు వెళ్లదీస్తున్న వారు మళ్లీ గ్రామాలకు రావాలని, వ్యవసాయంలో లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఫైవ్ లేయర్ సహజసిద్ధ వ్యవసాయ విధానానికి రూపకల్పన జరిగింది. బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్లిన యువకులంతా పల్లెలకు రావాలి, పండించిన పంటలు స్థానికంగానే అమ్ముకోవాలి, పల్లెలు ఆర్థికంగా అభివృద్ది చెందాలనేది పకృతి వ్యవసాయ ఉద్యమ లక్ష్యం అంటారాయన. ఈ ఉద్యమం ద్వారా భారతదేశంలోని పల్లెలు నూటికి నూరు శాతం విజయం సాధించాలని సుభాష్ పాలేకర్, విజయరామ్ తపన అన్నారు.కెమికల్ ఫ్రీ వ్యవసాయ విధానంలో చిన్న రైతు మొదలు మధ్యస్థ రైతు, వందల ఎకరాలున్న పెద్ద రైతు కూడా ఎలా బాగుపడుతున్నారో గుజరాత్, ఔరంగాబాద్, ఉత్తరప్రదేశ్‌లో తాను స్వయంగా చూసి వచ్చినట్లు రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. 60X60 విధానంలో ప్రతి 60 అడుగుల దూరంలో ప్రధానం పంటకు సంబంధించిన మొక్కలు నాటినట్లు చెప్పారు. అరవై అడుగుల పొడవు వేసుకున్న బెడ్ల మధ్యలో అంటే 30 అడుగులకు ఒక చెట్టు, ఆ చెట్టుకు చెట్టుకు మధ్య ఏడున్నర అడుగులకు ఒక అరటి, ఒక బొప్పాయి, ఈ రెండింటికీ మధ్య భూమిలో నైట్రోజన్ నిల్వ చేసే మునగ మొక్క, అవిశె మొక్క నాటినట్లు తెలిపారు. ఈ విధానంలో ఒక 60X60 బెడ్‌కు 81 మొక్కలు నాటుకోవచ్చు. ఒక ఎకరంలో ఈ విధానంలో 640 మొక్కలు వస్తాయి. బెడ్లను కూడా దక్షిణం నుంచి ఉత్తరం వైపు పొడవు ఉండేలా బెడ్లు తయారు చేసుకోవాలంటారు. ఇలా బెడ్లు వేసుకుంటే తూర్పున సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సాయంత్ర సూర్యాస్తమయం వరకు ప్రతి మొక్కకు సూర్యరశ్మి సమృద్ధిగా తగులుతుంది. దీంతో మొక్కలు ఎదుగుదల చాలా బాగుంటుందని సైంటిపిక్‌గా నిర్ధారించినట్లు తెలిపారు.అంతే కాకుండా.. పండ్ల మొక్కల మధ్య ఖాళీలో ఆకుకూరలు పెంచుకుంటే 20 నుంచి 30 రోజుల్లో ఆదాయం వస్తుంది. ఆకు కూరల ద్వారా ప్రతి వారం డబ్బులు చేతికి అందుతూనే ఉంటాయి. ఒక బెడ్ మీద ఒకసారి వేసిన ఆకు కూరలు కాకుండా మరోసారి మరో రకం ఆకుకూరలు సాగుచేస్తే.. ఫలితం మరింత ఎక్కువ ఉంటుంది. ఐదంచెల విధానంలో ఆకు కూరలు, కూరగాయలు, తీగజాతికి చెందిన కాయగూరలు, అరటి, బొప్పాయి, నిమ్మ, మునగ, మామిడి చెట్ల నుంచి ఆదాయం వస్తుంది. నాలుగైదు సంవత్సరాల్లో ఎక్కడా ఆగకుండా ప్రతి నెలా ఆదాయం వచ్చేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు రాజవర్ధన్‌రెడ్డి చెప్పారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంపై ప్రతి శనివారం తమ క్షేత్రానికి వచ్చే ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.తీగజాతి మొక్కల పెంపకంలో రైతులు ఎక్కువ ఖర్చు కాకూడదని అందుబాటులో ఉండే, లేదా వాడేసిన తక్కువ ఖర్చు కర్రలతోనే లేదా నేపియర్ గడ్డిలో కాస్త లావు ఉన్న కర్రలతో పందిరి వేసుకోవచ్చు. ఆరు నెలలకు ఈ తీగజాతి మొక్కల పంట పూర్తయ్యాక పందిరి తీసేసి, మరో స్థలంలో పందిరి వేసి తీగజాతి మొక్కలు పెంచుకోవాలి. సిమెంట్ పోల్స్, ఇనుప తీగలతో పందిరి వేసి, ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దని రైతులకు రాజవర్ధన్‌రెడ్డి సలహా ఇచ్చారు. సహజసిద్ధ విధానంలో పండించే కూరగాయలు, ఆకుకూరలు నాటుగా కనిపిస్తాయి కానీ వాటిలో సహజంగా ఉండాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. హైబ్రీడ్ కాయలు నీటుగా కనిపిస్తాయి కానీ వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండడం లేదని రాజవర్ధన్రెడ్డి అన్నారు. నాటు కూరగాయలు, ఆకుకూరలో కొని వాడుతున్న వినియోగదారులు అవి ఎంతో రుచిగా ఉంటున్నాయని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారంటున్నారు. ఎనిమిదేళ్లుగా తాను ప్రకృతిసిద్ధంగా పండిస్తున్న అన్ని రకాల పప్పుధాన్యాలు, కాయగూరలు, ఆకు కూరలను స్థానికంగానే ఎంతోమంది వినియోగదారులు ఇష్టంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా ఇష్టంతో చేస్తే.. సహజ వ్యవసాయం అలవాటు పడితే ఎంతో తృప్తి ఇస్తుందన్నారు. వినియోగదారులకు ఆరోగ్యం, వ్యవసాయదారులకు ఆదాయం సమృద్ధిగా ఉంటాయన్నారు.పూర్వకాలంలో రైతులు వ్యవసాయంతో పాటుగా కొన్ని ఆవులు, కొన్ని ఎడ్లు, మేకలు, గొర్రెలు, కోళ్లను పెంచుకునేవారు. వ్యవసాయంలో ఒకే పంట కాకుండా అన్ని రకాల పంటలు పండించేవారు. ఒకసారి వేరుసెనగా వేస్తే.. మరోసారి ఆ పొలంలో జొన్నలు, ఇంకోసారి కందులు వేసేవారు. జొన్న, పల్లీల పొలంలో కందులు వేసేవారు. ఇలా అన్నీ కలగలిపి వ్యవసాయం చేసేవారు. తర్వాతి కాలంలో రైతులు కమర్షియల్‌గా మారిపోయి, కృత్రిమంగా తయారుచేసిన రసాయన ఎరువులతో పంటలు పండించడంతో జనం ఆరోగ్యాన్ని దెబ్బతిన్నది, భూమి సారం నశించిపోయింది. పర్యావరణం పాడైపోయింది. పెట్టుబడులు పెరిగిపోయి, ఆదాయం వచ్చినా లాభసాటి అనే మాటే లేకుండా పోయిందంటారు రాజవర్ధన్‌రెడ్డి. ఒక ఎలివేటెడ్ షెడ్ వేసి అందులో 50 మేకలను పెంచుతున్నారు. కోళ్లకోసం మరో షెడ్ వేసి 500 నాటుకోళ్లు పెంచుతున్నారు.ఒక నాటు ఆవు ఉంటే 30 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చని సుభాష్ పాలేకర్ చెప్పారు. రాజవర్ధన్‌రెడ్డి 2017లో ఎనిమిది ఆవులు, ఒక గిత్తను తెచ్చుకున్నారు. ఇప్పుడు తమ ఫార్మ్‌లో వాటి సంతతి పెరిగి డజన్ల కొద్దీ ఆవులు తయారయ్యాయి. ఆవు మూత్రం, ఆవు పేడతో ఘనజీవామృతం, ద్రవ జీవామృతాన్ని భారీ మొత్తంలో తయారు చేస్తున్నారు. ఆవు పాలు వాడుకొని, వెన్నను వాడుకొని, నెయ్యిని వినియోగించుకొని, ఆవు మజ్జిగను మాత్రం ఒక రాగిరేకు వేసి పులియబెట్టి, దానిలో ఇంగువ కలిపి పురుగుల నివారణ మందుగా వాడాలని చెప్పారు. కొంచెం ఇష్టంతో ఆలోచించి చేస్తే.. ప్రకృతి వ్యవసాయంలో ఏదీ వృథా కాదంటారాయన. సమగ్ర వ్యవసాయ విధానంలో రైతు అన్ని రకాలుగా ఆదాయం సమకూర్చుకోవాలని చెబుతారు రాజవర్ధన్‌రెడ్డి. రైతు బాగుపడాలి.. వినియోగదారుడు బాగుండాలని, తద్వారా మెరుగైన సమాజం.. ఆరోగ్యవంతమైన సమాజం.. ఆనందంతో నిండిన సమాజం కోసం సహజ పంటలను ఒక ఉద్యమంలా చేస్తున్నట్లు తెలిపారు.