అత్యధిక పోషకాలు గల పండ్లలో ఆపిల్ ఒకటి. డయాబెటిక్‌ రోజులకు ఆపిల్ పండు మంచి ఆహారం అంటారు.  ఆపిల్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే పెక్టిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్‌ మొత్తాన్ని 35 శాతం వరకు తగ్గించి, సుగర్‌ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆపిల్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆపిల్‌ తొక్కలో రిబోఫ్లావిన్, థయామిన్, B6, విటమిన్ K, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ ఒక ఆరోగ్యకరమైన పండు, అందుకే రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్‌ని దూరంగా ఉంచవచ్చనే మాట ప్రసిద్ధి చెందింది.ఆపిల్ పండ్లు రోసేసి కుటుంబానికి చెందినవి. దీని సైంటిఫిక్ నేమ్‌ మలస్ డొమెస్టికా బోర్ఖ్. నిజానికి ఆపిల్‌ పండ్లు ముఖ్యంగా ఆసియా, ఐరోపా దేశాల్లో పెరుగుతాయి, సమశీతోష్ణ ప్రాంతంలో మాత్రమే ఆపిల్‌ సాగు అవుతుందని ఇప్పటి వరకు మనకు తెలుసు. మన దేశంలోని హిమాలయ ప్రాంతం, పాకిస్తాన్, చైనా, ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాలలో మాలుస్ జాతి ఆపిల్‌ జాతులు మొదట ఉన్నాయి. అయితే.. తెలంగాణలో కూడా ఆపిల్ పంట పండించవచ్చని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఉన్న శ్రీ నిఖిల్‌ చేతన కేంద్రంలో విజయవంతంగా చేసినట్లు అక్కడ పనిచేసే గజేంద్ర చెప్పారు. సాధారణంగా ఆపిల్ కాశ్మీర్‌ లాంటి చలి వాతావరణం ఉన్న చోట మాత్రమే సాగవుతుందనుకుంటాం కదా. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే తెలంగాణలోనూ ఈ పంట సాగు సాధ్యం అని గజేంద్ర తెలిపారు.హిమాచల్ ప్రాదేశ్ నుంచి 2020లో నాలుగు హరిమాన్‌ 99, అన్నా అనే రెండు రకాల మొక్కలు తెప్పించి ఆశ్రమ కేంద్రంలో సరదా కోసం నాటారు. అడుగు, అడుగున్నర ఎత్తు ఉన్న ఒక్కో మొక్లను రూ.200కు కొని తీసుకొచ్చి నాటారు. అవి నాటిన 8 నెలలకే పూత పూశాయని గజేంద్ర చెప్పారు. మొదటి ఏడాది ఒక్కో మొక్క 50 ఆపిల్ పండ్లు ఇచ్చిందని అన్నారు. దీంతో తమ ఆశ్రయ కేంద్రంలో పావు ఎకరంలో 125 మొక్కల వరకు నాటినట్లు చెప్పారు. అవి కూడా మొదటి ఏడాది 50 పండ్లు, రెండో ఏడాదిలో మొత్తం చెట్లన్నీ 500 వరకు కాశాయని, మూడో సంవత్సరం మాత్రం ఒక్కో చెట్టు 200 వరకు పండ్ల దిగుబడి ఇచ్చిందన్నారు.ఆపిల్‌ మొక్కల మధ్య 11 అడుగుల దూరంలోనూ, సాలుకు సాలుకు మధ్య 15 అడుగుల దూరంలో నాటారు. హిమాచల్ ప్రదేశ్‌ నుంచి గ్రాఫ్టింగ్ చేసిన హరిమాన్‌ 99, అన్నా రకం మొక్కలు తెప్పించినట్లు గజేంద్ర వెల్లడించారు. 2020 జనవరిలో మొక్కలు నాటితే.. ఏడు నెలలకు పూత వచ్చిందన్నారు. నాటిన ఏడాది లోపే మొక్క మూడు నుంచి నాలుగు అడుగులు ఎదిగిందని, తొలి పంట చేతికి వచ్చిందని చెప్పారు.ఆపిల్ మొక్కలకు సరిపడినంత నీటి సదుపాయం కల్పించాలి. గో ఆధారిత ఎరువు అంటే సహజసిద్ధమైన జీవామృతం మొక్కలకు వేసుకుంటే సరిపోతుంది. ఆశ్రమంలో ఉండే ఆవుల పేడ నుంచి తయారు చేసిన జీవామృతం వేసినట్లు గజేంద్ర తెలిపారు. చెట్లకు చీడ పీడలు, దోమలు రాకుండా ముందు జాగ్రత్తగా నీమ్‌ ఆయిల్‌ను స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నాలుగేళ్లుగా ఆపిల్ చెట్లకు ఎలాంటి పురుగు పట్టలేదన్నారు. చలి ప్రదేశంలో పండే పంట కాబట్టి మన ప్రాంతంలో ఆపిల్ మొక్కలకు నీడ కల్పించాలని, నీడ కోసం ఆచ్ఛాదనలు వేయాల్సిన అవసరం కూడా ఉండదని ఉన్న శ్రీ నిఖిల్‌ చేతన కేంద్రంలో మొక్కల్ని చూస్తే అర్థం అవుతుంది.శ్రీ నిఖిల్‌ చేతన కేంద్రంలో మట్టి ఎర్ర బంకమట్టిలో ఆపిల్ సాగుచేస్తున్నారు. హరిమాన్‌ 99, అన్నా రకం ఆపిల్ పండ్లు కాస్త పింక్‌ రంగులో ఉంటాయి. మన నేలను బట్టి పులుపు, తీపి కలగలిపినట్లు రుచి ఉంటుంది. ఆర్గానిక్‌ విధానంలో పండించి ఈ రకం ఆపిల్‌ పండ్లు మరింత రుచిగా ఉంటాయి. ఆపిల్ మొక్కలకు డిసెంబర్‌లో పూత మొదలవుతుంది. ఏప్రిల్ ఆఖరికి పండ్లు చేతికి వస్తాయి. పూత నుంచి పండు తయారయ్యేందుకు దాదాపు ఐదు నెలల సమయం పడుతుంది. పండు పూర్తిగా తయారయినప్పుడు కిలోకు నాలుగు లేదా ఐదు తూగుతాయి.ఆపిల్ పంట కాపు పూర్తయిన తర్వాత మొక్కల మొదలులో మట్టిని తవ్వి, మళ్లీ జీవామృతం వేసుకుని, వర్షం లేని కాలంలో నీరు రెండు రోజులకు ఒకసారి అందిస్తే సరిపోతుందని గజేంద్ర వివరించారు. వర్షాలు పడితే నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. తమ ఆశ్రమ కేంద్రంలో డ్రిప్‌ ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఆర్గానిక్ విధానంలో పంట సాగుచేయడం వల్ల ఆపిల్ చెట్లు ఎప్పుడు చూసినా తాజా, ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఆపిల్ పండ్లు కూడా ఆరోగ్యం, చక్కగా ఉన్నాయని చెప్పారు.చల్లని వాతావరణంలో సాగయ్య ఆపిల్‌ పంట 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కాయలు కొద్దిగా ఖరాబు అయినట్లు గమనించామని గజేంద్ర వెల్లడించారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు తెలంగాణలో ఎలాగూ చలి వాతావరణమే ఉంటుంది. ఏప్రిల్ నెల కాపాడుకుంటే మంచి పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.