పది ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న రైతు కూడా ఏడాదికి పది లక్షల ఆదాయం పొందలేని పరిస్థితి ఉంది. సాగుబడికి ఆర్థిక అంశాలు కూడా జతపరిచి, పంటలు పండించే ఆలోచన, విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని, సరిగా మార్కెటింగ్ చేసుకుంటే ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం, లాభం కూడా పొందవచ్చు. కాస్త తెలివిగా, మరి కాస్త భిన్నంగా వ్యవసాయ విధానంలో దూసుకెళ్తుననారు రంగారెడ్డి జిల్లా కేశంపేటలో శివ ల్యాండ్ ఫార్మ్ శివ. చక్కని పలితాలు పొందుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సుభాష్ పాలేకర్ విధానంలో శివ చేస్తున్న సరికొత్త సహజసిద్ధ వ్యవసాయ విధానంలో నెలకు లక్ష రూపాయలు ఎలా సాధివచ్చో వివరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి సేద్యం చేసే రైతులు వచ్చి అవగాహన కల్పించుకుంటున్నారు. ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చో ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్న విధానాన్ని తెలుసుకుంటున్నారు. ఈ వ్యవసాయ విధానం ఏంటో తెలుసుకుందాం.వృత్తిరీత్యా శివ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతవ్యవసాయాన్ని ఆయన తన ప్రవృత్తిగా మార్చుకున్నారు. కర్ణాటకలో ‘ఆర్గానిక్ మాండ్యా’ పేరిట ప్రకృతి వ్యవసాయంలో సరికొత్త విధాన్ని అభివృద్ధి చేశారు. ఎకరం నుంచి నెలలో లక్ష రూపాయలు ఎలా సంపాదించ వచ్చు అనేది ఆ విధానం. ఆర్గానిక్ మాండ్యాలో రెండు వేల మంది రైతులు ఉన్నారు. ఒక నేలలో ఒకేసారి బహుళ పంటల సాగుకు కొత్త విధానం జోడించి, అన్నదాతలు విజయాలు సాధించేలా చేస్తోంది ఆర్గానిక్ మాండ్యా.లేబర్ కొరత వ్యవసాయంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ ఉంది. ఆర్గానిక్ మాండ్యా విధానంలో వ్యవసాయం చేయడానికి భార్య, భర్త మాత్రమే సరిపోతారు. వారిద్దరూ ఇష్టంగా కష్టపడితే చాలు కాసుల రాసులు పడతాయి. ఈ విధానంలో ఉద్యోగుల మాదిరిగా రైతు దంపతులు కూడా వారం రోజులు పనిచేసి, వారాంతంలో సెలవు తీసుకోవచ్చు. వారంలో ఒక రోజు సెలవు..ఈ విధానంలో 100 రోజులు పని ఉంటుంది ఒక జంటకు. ఎకరం పొలంలో 100 బెడ్లు చేసుకుని పంటలు సులువుగా పండించవచ్చు, ఆదాయమూ సంపాదించవచ్చు.
రెండేళ్ల క్రితం ఆర్గానిక్ మాండ్యా విధానంలో సాగు ప్రారంభించారు శివ. అంతకు ముందు రెండేళ్లు దీనిపై అవగాహన పెంచుకున్నారు. ఆర్గానిక్ మాండ్యా విధానంలో ఎలా చేయాలి? మందులు లేకుండా పంట పండుతుందా? పండదా? అని నిర్ధారించుకోవడానికి ముందుగా రెండు గుంటల్లో వ్యవసాయం ప్రారంభించారు. ఆ రెండు గుంటల్లోనే 26 రకాల కూరగాయలు, కొన్ని అరటి, మునగ మొక్కలు పెట్టారు. తాను క్షేత్రస్థాయిలో నేర్చుకోకపోవడంతో అరటి చెట్లు ఫలితం ఇవ్వలేదు. కూరగాయలు, మునగ నుంచి ఆదాయం బాగానే వచ్చింది. జీవామృతం చాలా తక్కువ మోతాదులు ఇచ్చినా కూడా పంట బాగా పండుతుందని శివ అనుభవంతో చెప్పారు. పురుగుల నియంత్రణకు 20 రోజులకోసారి నీమాస్త్రం వాడారు.ఆర్గానిక్ మాండ్యా విధానంలో ముందుగా భూమిని సిద్ధం చేసుకోవాలి. నాటు అంటే దేశీయ విత్తనాలు మాత్రమే వాడారు. మనం పండించిన పంట నుంచి విత్తనాలు తయారు చేసుకొని, మరుసటి పంటకు వాటినే వాడుకోడానికి పనికి రావడం దేశీ విత్తనాల ప్రత్యేకత. ఒక గంపకు పేడ రుద్ది, కొన్ని వేప ఆకులు దాంట్లో వేసి, విత్తనాలు పోసి ఉంచుకుంటే మరుసటి పంటకు అవి సిద్ధం అవుతాయి. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కోసం రైతులు మార్కెట్లో ఇబ్బందులు పడి, కొని తెచ్చుకోవాల్సిన కష్టం జీవామృతం, నీమాస్త్రం, విత్తనాలు మనమే సిద్ధం చేసుకోవడం ద్వారా తొలగిపోతాయి. కెమికల్ వ్యవసాయంలో పెట్టుడి ఎక్కువ ఉంటుంది. కానీ.. అంతే స్థాయిలో ఆదాయం రాకపోవచ్చు.ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలు సహా అన్నీ రైతే తయారు చేసుకుంటాడు కనుక చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడే రైతుకు సగం లాభం మిగులుతుంది. రసాయనాలు వాడిన వ్యవసాయంలో తమకు నెలకు రూ.1,500 నుంచి రూ.2,000 మాత్రమే వచ్చేదని శివ చెప్పారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం గురించి యూట్యూబ్‌లో 200 గంటలు తాను విన్నానని అన్నారు. ఈ విధానంలో వికారాబాద్‌లో విజయరాం చేస్తున్న వ్యవసాయాన్ని స్వయంగా సందర్శించి, మరింత అవగాహన పెంచుకున్నానన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో అన్నిచోట్లా తాను వెళ్లి తెలుసుకున్నానని చెప్పారు.ఆర్గానిక్ మాండ్యా విధానంలో భూమిని సిద్దం చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వర్షాకాలానికి ముందుగా వేసవిలో భూమిని రెడీ చేసుకోవాలి. భూమిని సిద్ధంగా ఉంచుకుంటే వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు నాటుకోవచ్చు. ఆ వర్షాలతోనే పంటలు పండుతాయి. పంటకు నీరు సరఫరా చేసే ఖర్చు తగ్గుతుంది. నువ్వులు, పల్లీలు, పప్పు ధాన్యాలు, జీలుగు లాంటి ధాన్యాలన్నీ కలిపి 40 కిలోల విత్తనాలు ఎకరం భూమిలో ముందుగా చల్లాలి. అవి అన్నీ 45 రోజుల తర్వాత పూతకు వస్తాయి. పూత దశలో ఉండగా ఆ మొక్కలతో కలిపి భూమిని దున్నుకోవాలి.దీంతో భూమికి అవసరమైన మేక్రో, మైక్రో పోషకాలన్నీ అందుతాయి. అంతకు ముందు రెండు అడుగుల లోతు భూమిని తవ్వుకుని బెడ్లు వేసుకోవాలి. ఆర్గానిక్ మాండ్యా విధానంలో బెడ్లు ఒక్కసారే వేస్తాం. ఆ తర్వాత పంటలు సాగు చేసిన ప్రతిసారీ బెడ్లు ఏర్పాటు చేసుకునే పనే ఉండదు. కేవలం నూనె, పప్పులు, జీలుగు విత్తనాలు మాత్రం వేసి, దున్ని పోషకాలు అందించుకుంటే సరిపోతుంది. ఒకసారి బెడ్ వేశాక మళ్లీ మళ్లీ దున్నే పని ఉండదు. నిజానికి ఎంత ఎక్కువ దున్నితే.. అంత ఎక్కువ కలుపు మొలుస్తుంది. ఒక కలుపుమొక్క దాని చుట్టుపక్కల వంద మొక్కల్సి తయారు చేస్తుంది. అందుకనే బెడ్లను దున్నకూడదు.దేశీ ఆవు పేడ, మూత్రం ఈ విధానంలో ప్రధానం. దేశీ ఆవుల మూత్రం, పేడ సరిపడినంత లేనప్పుడు దేశీ ఎద్దు, ఆవుల మూత్రం, పేడ సమానంగా వేసి జీవామృతం చేసుకోవచ్చు. మీద మూపురం, కింద గంగడోలు ఉన్న ఆవులు మాత్రమే దేశీ లేదా నాటు ఆవులని గుర్తుపెట్టుకోవాలి. ఒంగోలు జాతి ఆవులు కూడా దేశీ ఆవులే.
మల్తీ క్రాపింగ్ విధానంలో ఒక్కసారే బెడ్లు వేసుకుని, వాటిల్లోనే అన్ని రకాల కూరగాయలు పండించవచ్చు. ఆ పంట అయిపోయిన తర్వాత దాని వ్యర్థాలే బెడ్‌కు కంపోస్టులా మారి భూమికి బలాన్నిస్తాయి. పంట కోసిన తర్వాత మొక్కల్ని పీకేయకుండా డీ కంపోజర్ లాంటిది స్ప్రే చేస్తే అవే కుళ్లిపోయి మట్టిలో కలిసిపోయి, ఎరువుగా మారుతుంది. దానిపైనే మళ్లీ కొత్త పంటకు కావాల్సిన మొక్కలు నాటుకోవచ్చు.సుభాష్ పాలేకర్ పద్ధతిలో ఆర్గానిక్ మాండ్యా చేస్తున్నది ఐదు అంచెల వ్యవసాయం. భూమిని 3 అడుగుల వెడల్పు 100 అడుగుల పొడవు బెడ్లు తయారు చేసుకోవాలి. ఎకరం భూమిలో నాలుగు మూలలా మామిడి, సపోటా, పనస, నేరేడు లాంటి పెద్ద చెట్ల జాతులు నాటుకోవాలి. మధ్యలో నాలుగు వైపులా అంత కంటే కొంచెం చిన్నవి ఉసిరి, బత్తాయి, నిమ్మ, జామ, దానిమ్మ, వెలగ, అంజీర, కమలా లాంటి మొక్కలు వేసుకోవాలి. వీటి వల్ల పొలంలోకి అన్ని రకాల పక్షులు, జీవరాశులు వస్తాయి. మహా వృక్షాలకు చిన్న చెట్లకు మధ్యలో 36 మునగ మొక్కలు నాటుకోవాలి.
మునగనే ఎందుకు పెంచాలనే సందేహం రావచ్చు. మునగ నైట్రోజన్‌ను భూమిలో నిల్వ చేస్తుంది. తద్వారా నైట్రోజన్ ఎరువులు కొని వేసే ఖర్చు ఉండదు. మునగ చెట్టు వల్లే మన పంటలకు కావాల్సిన నైట్రోజన్ సహా అన్ని రకాల పోషకాలు అందుతాయి. అడవిలో ఉండే చెట్లకు ఎరువులు వేయం. అయినా అవి చాలా చక్కగా, ఏపుగా ఎదగడం చూస్తుంటాం. అంటే ఒక చెట్టుకు మరో చెట్టు ఉపయోగపడుతుంది. ఆర్గానిక్ మాండ్యా విధానం అంటే అడవి మోడల్ అన్నమాట. మునగతో పాటు బొప్పాయి, అరటి కామన్‌గా పెంచుకోవాలి.ఈ విధానంలో ఎకరం భూమిలో 3X100 అడుగుల బెడ్లు పది వస్తాయి. దీన్నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తుందని శివ తెలిపారు. ఈ పద్ధతి సాగులో మన ప్రాంతాన్ని బట్టి, సీజన్‌కు అవసరమయ్యే పండ్ల జాతులను పెంచుకుంటే అన్ని కాలాల్లోనూ పండ్ల దిగుబడి వస్తుంది. తద్వారా ఆదాయమూ ఉంటుంది. ఒక్కో బెడ్ మధ్యలో ఒక్కో కొబ్బరి చెట్టు పెంచుకుంటే దాన్నుంచి నెలనెలా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇదే బెడ్ల చివరిలో కంది, మిర్చి, అల్లం, పసుపు, అవిశెలు పెట్టుకోవచ్చు. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఇది పూర్తిగా ఫైవ్ లేయర్ మోడల్. ఇలా మూడేళ్లు సాగు చేస్తే.. ఆ భూమి పూర్తిస్థాయిలో పోషకాలతో నిండిపోతుంది. అప్పటి నుంచి ఎలాంటి పంట వేసినా అధిక దిగుబడి ఇస్తుంది. మూడేళ్ల నుంచి అసలైన పంట దిగుబడి, ఆదాయమూ రావడం మొదలవుతాయి.
వ్యవసాయం అంటే.. వ్యాపారం కాదు. అందుకే రైతుకు బిజినెస్ అంటే తెలియదు. అందుకే మధ్యవర్తిని ఆశ్రయిస్తాడు. దళారుల మోసాల ముందు రైతు నిలబడలేకపోతున్నారు. రైతు నష్టపోవడానికి ముఖ్య కారణం మధ్య దళారి వల్లే అని గుర్తుంచుకోవాలి. ఇందుకు ఏ రైతు అయినా.. లోకల్ మార్కెట్‌ను వాడుకుంటే సరిపోతుంది. లోకల్ మార్కెట్ రైతుకు బెస్ట్ మార్కెట్ అంటారు శివ. ఎవరో కొంటారనో, ఎక్కువ లాభం వస్తుందనో ఆశకు పోతే.. వాళ్లు కొనకపోతే మొదలుకే నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి కుటుంబానికి కూరగాయల అవసరం తప్పకుండా ఉంటుంది. అలాంటి ప్రతి కుటుంబానికి రైతే తాజా కూరగాయలు ఇచ్చేలా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని శివ సలహా. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు. నాటు కూరగాయలు పండించిన రైతులు తమ ఉత్పత్తులను సోషల్ మీడియాలో పెట్టి అమ్ముకోవచ్చు. మనం ఇచ్చే ఆరోగ్యవంతమైన పంటకు న్యాయమైన రేటు ఇచ్చి కొనమని కోరవచ్చు.
రైతులు ముందుగా కాలాలను అర్థం చేసుకోవాలి. వర్షాకాలంలో వరి పంట వస్తే.. తాలు ఎక్కువ వస్తుంది. ఏ కాలంలో ఏ పంట దిగుబడి వస్తే.. అదాయం బాగుంటుందో దాన్ని అర్థం చేసుకుని సాగు చేస్తే.. ఆర్గానిక్ మాండ్యా విధానంలో నెలకు లక్షకు పైగా ఆదాయం తీసుకోవచ్చని శివ వివరించారు. న్యాయమైన రేటుతో, ప్రజలకు మంచి ఆరోగ్యాన్నిచ్చే ప్రకృతిసిద్ధమైన పంటలు అమ్మితే రైతుకూ లాభం, ప్రజలకు ఆరోగ్యం.