‘అతిథి దేవో భవ’! మన సమాజంలో ఇది ఓ సెంటిమెంట్‌.. ప్రకృతి విధానంలో పంటలు పండించే ఆ రైతు ఈ సెంటిమెంట్‌నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పదుగురికీ చూపించి, అవగాహన కల్పిస్తున్నాడు. తద్వారా దేశా విదేశాల నుంచి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులను ఆకర్షిస్తున్నాడు. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. సుమారు 10 దేశాల నుంచి అతిథులు ఆ రైతు వ్యవసాయ క్షేత్రానికి వస్తున్నారు. కొద్ది రోజుల పాటు ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే బసచేసి, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా తన ఐడియాను అమలు చేసేందుకు ఆ రైతు ఖర్చు చేయడంలేదంటే నమ్మండి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానంలో ఆ రైతు ఇచ్చే ఆత్మీయ ఆతిథ్యమే ఆయన విఉయ రహస్యం.పురుషోత్తం సిధ్‌పారా.. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేసే అనేక మందిలో ఒకరు. దేశ విదేశాల అతిథులను పురుషోత్తం సిధ్‌పారా ఆకర్షించడానికి కారణం ఉంది. ఐదు పదుల వయసున్న పురుషోత్తం పండించే పంటలు ప్రకృతి సిద్ధంగా, నాణ్యంగా ఉండడం. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన జమ్‌కా గ్రామంలో పురుషోత్తం సిధ్‌పారా నివసిస్తున్నాడు. పురుషోత్తం 18 వయసు నుంచి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఆ క్షేత్రంలో పురుషోత్తం ఆహార ధాన్యాలు, పప్పు జాతి పంటలు, సుగంధ ద్రవ్యాలు, కాయగూరలు, పండ్లు పండిస్తున్నాదు. పురుషోత్తం పండించిన మొత్తం పంటల్ని మన దేశంతో పాటుగా మరో 10 దేశాల్లో అమ్ముతుంటాడు.పురుషోత్తం సిధ్‌పారా మార్కెటింగ్‌ విధానం చూస్తే ముచ్చటేస్తుంది. ‘అతిథి దేవో భవ’ విధానాన్ని ఆయన తన మార్కెటింగ్‌ విజయానికి మెట్టుగా వాడుకుంటున్నాడు. తన ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసే డీలర్లను, వినియోగదారులను పురుషోత్తం తన క్షేత్ర సందర్శనకు ఆహ్వానిస్తుంటాడు. పురుషోత్తం తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అలా ఆహ్వానించిన అతిథులకు తనతో పాటే కొద్ది రోజులపాటు చక్కని ఆతిథ్యం ఇస్తాడు. తన క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన వాటితోనే వారికి రుచికరమైన ఆహారం అందిస్తుంటాడు. పురుషోత్తం అందించే ప్రకృతి సిద్ధ ఆహారం నచ్చినవారు ఆనందంగా తింటారు. ఆపైన పురుషోత్తం పండించే పంటల్ని కొనేందుకు ఆర్డర్లు కూడా ఇస్తుంటారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా దగ్గరుండి చూపిస్తాడు. తాను అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను వారికి సవివరంగా వివరిస్తుంటాడు. దేశ విదేశాల నుంచి తన క్షేత్రానికి వచ్చిన అతిథుల అనుమాలను వారికి అర్థమయ్యే రీతిలో ఎంతో ఓపికగా తీరుస్తుంటాడు. అలాగే పంటలు పండించే విధానంపై క్రమం తప్పకుండా వాట్సాప్‌లో వివరాలు వెల్లడిస్తుంటాడు. ఇలా దేశ విదేశాల అతిథుల విశ్వాసాన్ని, విధేయతను పురుషోత్తం పొందుతాడు. ‘అతిథి దేవో భవ’ ఆలోచన తనకు రావడానికి 20 ఏళ్ల క్రితం తమ ప్రాంతంలో కరువు సంభవించినప్పుడు తమ గ్రామస్థులు ఐకమత్యంతో చేసిన పనే కారణం అంటాడు పురుషోత్తం.జునాగఢ్‌ ప్రాంతం కరువు కాటకాలకు పెట్టింది పేరు. వర్షాలు సరిగా లేక సరైన పంటలు పండేవి కావు. దీంతో వర్షపునీటిని నిల్వ చేసుకునేందుకు 1999లో జమ్‌కా గ్రామస్తులంతా ఏకమై విరాళాలు వేసుకుని చిన్న చిన్న డ్యామ్‌లు, రిజర్వాయర్‌ నిర్మించుకున్నారు. ఆ సమయంలో గ్రామస్థులు విరాళాల ద్వారా 45 లక్షల రూపాయలు సమకూర్చుకుని 55 చిన్న డ్యామ్‌లు, ఐదు చెరువుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వర్షం కురిసినప్పుడు వారు ఏర్పాటు చేసిన రిజర్వాయర్లలో లక్షలాది లీటర్ల నీరు చేరేది. తద్వారా భూగర్భ జలమట్టం కూడా 500 అడుగుల నుంచి 50 అడుగుల పై వరకు వచ్చేది. అప్పటి నుంచి అనావృష్టి కారణంగా తమ ప్రాంతం ఏనాడూ ఇబ్బంది పడలేదంటాడు పురుషోత్తం సిధ్‌పారా. తమ గ్రామస్థులు అనుసరించిన విధానాన్ని గుజరాత్ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుందని, అనేక అనావృష్టి ప్రాంతాల్లో తమ పద్ధతినే అమలు చేస్తోందని గర్వంగా చెబుతాడు పురుషోత్తం. తమ గ్రామస్తులు చేసిన ప్రయోగం ద్వారా వచ్చే ఫలితాల్ని అధ్యయనం చేసేందుకు నిపుణులు, విద్యార్థులు, వాటర్ యాక్టివిస్టులు, మీడియా ప్రతినిధులు తమ గ్రామానికి ఏడాది పాటు నిత్యం వచ్చేవారన్నాడు. జమ్‌కా గ్రామస్తులు తమ ఊరికి బయటివారు వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మాదిరిగా ఆతిత్యమిచ్చేవారని, తమ ఇంటికి, వ్యవసాయ క్షేత్రాలకు వారిని తీసుకెళ్లి చక్కని ఆతిథ్యం ఇచ్చేవారని పురుషోత్తం గుర్తుచేసుకున్నాడు.తాను వడ్డించిన ఆహారం తిన్న తర్వాత అతిథులు తమ పంటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను తమ నుంచి కొనుక్కోవాలని ఆసక్తి చూపుతారని పురుషోత్తం చెప్పాడు. ‘అతిథి దేవో భవ’ విధానం అమలు చేసిన తొలి రోజుల్లో వినియోగదారులతో తానే స్వయంగా సంప్రదించేవాడినని అన్నాడు. ఒకసారి తన ఆతిథ్యం స్వీకరించిన అతిథులు తిరిగి వెళ్లి తమ మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా తన వ్యవసాయ విధానం, ఆతిథ్యంపై చెప్పేవారన్నాడు. అలా తన వ్యాపారం ఆ నోటా ఈ నోటా బాగా ప్రచారం అయిందన్నాడు. ఇదే తన జీవితంలో పెద్ద అనుభవం అని, అందుకే ‘అతిథి దేవో భవ’ కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు పురుషోత్తం వెల్లడించాడు.పురుషోత్తం సిధ్‌పారా ప్రస్తుత వార్షిక టర్నోవర్‌ 2 కోట్ల రూపాయలు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌, నార్వే, జర్మనీ, దుబాయ్‌, ఇథియోపియా సహా వివిధ దేశాల నుంచి కస్టమర్లు వస్తున్నారు. సహజసిద్ధ విధానంలో వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయానికి మారిన తర్వాత తనకు పెరిగిన లాభాలు, తక్కువ నీటితో పంటలు పండించడం, అధిక పోషకాలతో కూడిన ఆహార ఉత్పత్తులు చేయడంపై అతిథులకు పురుషోత్తం వివరించే తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది.పురుషోత్తం తండ్రి రసాయనాలు వినియోగించి కొంత వ్యవసాయం, ఆవు పేడ వాడి మరి కొంత భూమిలో పంటలు పండించేవాడని గుర్తుచేసుకున్నాడు. అయితే.. తాను వ్యవసాయంలోకి వచ్చాక రసాయనాలను వదిలిపెట్టాలని, ప్రకృతి వ్యవసాయమే చేయాలని నిర్ణయించుకున్నానని పురుషోత్తం తెలిపాడు. ప్రకృతి సిద్ధ వ్యవసాయం చేస్తానని తాను చెప్పినప్పుడు పలువురు తనను వెక్కిరించారని పురుషోత్తం గుర్తు చేసుకున్నాడు. ఆవు పేడతో తాను తమ 15 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత ఎలాంటి పంట నష్టాన్నీ తాము చవిచూడలేదన్నాడు. పురుషోత్తం ముందుగా తమ పొలంలో సీతాఫలం, మామిడి, కొబ్బరి, బొప్పాయి మొక్కలు నాటాడు. ఆ మొక్కల మధ్య అంతర పంటలుగా జొన్న, సజ్జలు, మొక్కజొన్న, కొత్తిమీర లాంటి సుగంధ ద్రవ్యాలు, మిర్చి, జీలకర్ర తదితర పంటలు వేశాడు. ఇలా అంతర పంటలు వేయడం ద్వారా భూసారం మరింతగా పెరుగుతుంది.

చూశారుగా రైతన్నలూ.. పురుషోత్తం సిధ్‌పారా ‘అతిథి దేవో భవ’ విధానం.. ప్రకృతి వ్యవసాయ విధానంతో లాభాలకు లాభాలు, పేరుకు పేరు, ప్రతిష్టకు ప్రతిష్ట ఎలా వస్తుందో! మనందరం కూడా ఇప్పుడే ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మారిపోదామా మరి!

You can get in touch with Sidhpara at 94272 28975

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here