వ్యవసాయ కుటుంబంలో మారుతి నాయుడు మూడో తరం రైతు. రసాయనాలతో చేసిన వ్యవసాయంతో మారుతి కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. రసాయనాలు ఎక్కువగా వాడిన కారణంగా వారి వ్యవసాయ భూమి పూర్తిగా నిస్సారమైపోయింది. అయితే.. సుభాష్ పాలేకర్‌ ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలోకి మారిన తర్వాత మారుతి నాయుడి కుటుంబం అప్పుల నుంచి బయటపడింది. ఆర్గానిక్‌ పంటల ద్వారా లక్షల రూపాయల ఆదాయమూ సంపాదిస్తోంది.

తరాల నుంచి సాంప్రదాయ వ్యవసాయం చేసే మారుతి నాయుడి కుటుంబం అనంతపురం జిల్లా ఓబులాయపల్లెలో స్థిరపడింది. ఆర్ట్స్‌ డిగ్రీ చేసిన మారుతి నాయుడు తాను వైవిధ్యంగా బ్రతకాలనుకుని, టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు మారుతి నాయుడు. కానీ.. మారుతి నాయుడి మూలాలు అతనిని వ్యవసాయం వైపే లాగాయి. దాంతో తండ్రికి వ్యవసాయం పనుల్లో చేదోడు వాదోడయ్యాడు. తమ 9 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వారు వేరుసెనగ, బత్తాయి పంటలు పండించేవారు. ముందు రోజుల్లో మారుతి నాయుడి తాత, తండ్రి కూడా ఆర్గానిక్ ఎరువులు, కంపోస్ట్ ఎరువులతోనే ఏడాదికి రెండు పంటలు పండించేవారు. ఆ పంటల ద్వారా వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబ అవసరాలు తీర్చుకునేవారు. వ్యవసాయం ద్వారా పెద్దగా ఆదాయం రాకపోయినా ఆ కుటుంబం డబ్బుల కోసం ఏనాడూ ఇబ్బంది పడిన దాఖాలాలు లేవు.తనకు 46 ఏళ్ల వయస్సు వచ్చాక మారుతి నాయుడు 1996లో ఆధునిక విధానంలో వ్యవసాయ చేయడం ప్రారంభించాడు. అంతర పంటలు వేశాడు. వాటికి రసాయ ఎరువులు వినియోగించాడు. ఆధునిక వ్యవసాయం ప్రారంభించిన తొలి సంవత్సరాలలో పంట దిగుబడులు పెరిగాయి. కానీ.. నేలలోని సారం తగ్గిపోవడం మొదలైంది. పొలంలో బోర్‌వెల్‌ తవ్వేందుకు, వ్యవసాయ ఉపకరణాలు కొనేందుకు 5 లక్షల రూపాయలు అప్పు చేశాడు. నేల నిస్సారం అవుతుండడంతో తర్వాత మారుతి నాయుడి పొలంలో పంట దిగుబడి తగ్గిపోయింది. చేసిన అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. రోజు రోజుకూ అప్పుల మీద వడ్డీ భారం పెరిగిపోయి తడిసి మోపెడైపోయింది. అప్పుల మీద అప్పులు చేశాడు. దాంతో మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.

2012లో మారుతి నాయుడు జీరో బడ్జెట్ నేచురల్‌ ఫార్మింగ్‌ (ZBNF) గురించి ఓ ఫార్మర్‌ గ్రూప్‌ ద్వారా తెలుసుకున్నాడు. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై ఐదు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. భూమి ఆరోగ్యం, దాని ప్రాధాన్యత గురించి ఆ శిక్షణ శిబిరంలో తెలుసుకున్నాడు. రసాయనాలు వాడిన ఆహారం ద్వారా మన శరీరంలోకి విషాలు చేరి ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తున్నాయో శిక్షణ శిబిరం ద్వారా తెలుసుకున్నాడు. రసాయనాలు వాడిన తన పంటలు వినియోగించే వారి ఆరోగ్యాన్ని పాడుచేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.శిక్షణ శిబిరం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌కు మారాలనే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు మారుతి నాయుడు చెప్పాడు. అయితే.. దానికి కుటుంబం ఒప్పుకోలేదు. మారుతి నాయుడి భార్య కంగారు పడిపోయింది. మారుతి తల్లి అయితే.. రసాయనాలతో వ్యవసాయం కొనసాగించాలని వత్తిడి చేసింది. ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలోకి మారేందుకు ముందు వారు ససేమిరా అన్నారు. ఆర్గానిక్‌ విధానంలో ఆదాయం తగ్గిపోతుందని, కొన్ని ఏళ్ల పాటు అయినా రసాయన వ్యవసాయమే చేయాలని కోరారు.

దీంతో మారుతి నాయుడు ఓ మధ్యే మార్గాన్ని తల్లి, భార్యకు వివరించాడు. రసాయన ఎరువులతో బత్తాయి పంట కొనసాగించేందుకు, కొంత పొలంలో టమాటా, మిర్చి, పుచ్చకాయలు, జామ, కర్బూజ పంటలు నేచురల్ ఫార్మింగ్‌ విధానంలో పండించాలని నిర్ణయించాడు. అలా కొద్ది స్థలంలో వేసిన నేచురల్‌ ఫార్మింగ్‌లో మంచి దిగుబడులు వచ్చాయి. 2015-16 నాటికి మారుతి నాయుడు బత్తాయి తోటను కూడా జీరో బడ్జెట్‌ నేచురల్‌ పార్మింగ్‌లోకి మార్చేశాడు. తద్వారా మిగులు ఆదాయం కళ్ల చూశాడు.ఇప్పుడు తన కుటుంబం తన విజయాన్ని చూసి ఎంతగానో అభినందిస్తోందని మారుతి నాయుడు ఆనందంగా చెప్పాడు. ఆ తర్వాత తన మొత్తం పొలంలో మారుతి నాయుడు ఆర్గానిక్ పంటలే పండిస్తున్నాడు. సంవత్సరానికి రూ.18 లక్షలు ఆదాయం సంపాదిస్తున్నాడు. పొలాన్ని ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంగా మార్చేందుకు మారుతి నాయుడు రూ.4 లక్షలు ఖర్చు చేశాడు. వ్యవసాయం చేసేందుకు మారుతి నాయుడు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టాడు. పండిన పంటల ద్వారా రూ.18 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చు రూ.4 లక్షలు పోగా మిగతాది అంతా లాభమే అని సంతోషంగా చెప్పాడు. ఆదాయం పెరగడంలో తాను గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేశానని వెల్లడించాడు. ఇప్పుడు మారుతి నాయుడి బ్యాంక్‌ ఖాతాలో కొంత మొత్తం డబ్బు నిల్వ ఉంది. ఆ డబ్బులతో తన పిల్లలకు మంచి చదువులు చెప్పేంచేందుకు, తమ కుటుంబం సౌకర్యంగా జీవించేందుకు సరిపోతుందన్నాడు.మారుతి నాయుడు తమ పొలంలో బత్తాయి, వేరుసెనగ పంటలతో పాటు అన్ని రకాల సీజనల్‌ కూరగాయలు పండిస్తున్నాడు. తన పంటలతో పాటు చుట్టుపక్కల రైతులు పండించిన ఆర్గానిక్ పంటల్ని ‘అనంత నేచురల్స్‌’ పేరుతో సమీప మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. ఆర్గానిక్‌ పంటల్లో తన సక్సెస్‌ గురించి తెలుసుకున్న అనేక మంది రైతులు తమ క్షేత్రానికి వస్తున్నారని, తాను అనుసరించే ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాలు అడిగి తెలుసుకుంటున్నారని చెప్పాడు. గుంటూరు, రాయలసీమ, కడప, తెలంగాణలోని అనేక మందికి మారుతి నాయుడు ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాలపై మార్గనిర్దేశనం చేస్తున్నాడు. ప్రతి నెలా తనకు సుమారు 30 మంది రైతుల నుంచి రకరకాల ప్రశ్నలు వస్తుంటాయని, సంవత్సరంలో దాదాపు 200 మందికి సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు వెల్లడించాడు.ఇక ఆర్గానిక్‌ వ్యవసాయం చేయడంలో తనకు పెద్దగా ఒత్తిడులు, సవాళ్లు ఎదురు కాలేదని మారుతి నాయుడు చెప్పాడు. ఒక వేళ ఏవైనా చిన్న చిన్న అనుమానాలేవైనా తలెత్తితే పలువురు నిపుణులను సంప్రదించేవాడినని తెలిపాడు. మార్కెట్‌కు వెళ్లి రసాయన ఎరువులు కొనడం కంటే ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండించడమే తనకు సులువు అని తన అనుభవంలో తెలిసిందన్నాడు. అయితే.. ఆర్గానిక్‌ ఎరువులు తయారు చేసేందుకు కావాల్సిన ఆవు పేడ, పచ్చి రొట్ట, వ్యర్థ పదార్థాలు సేకరణకు కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నాడు. ఆర్గానిక్‌ ఎరువుల తయారీకి ఒకోసారి కూలీలు దొరకరని చెప్పాడు. ఆర్గానిక్‌ ఎరువుల తయారీకి కావాల్సిన ప్రతీ దానికీ సమానమైన డిమాండ్ ఉంటుందన్నాడు. నేచురల్ ఫార్మింగ్‌లో ఏ పంటలు వేయాలి, వాటిని ఎలా పెంచి పోషించాలనే ప్రణాళిక వేసుకోవడంలోనే రైతన్న విజయం ఆధారపడి ఉందన్నాడు.రసాయనాలు వాడని వ్యవసాయ ఉత్పత్తులు కొనేందుకు వినియోగదారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మారుతి నాయుడు తెలిపాడు. ఆర్గానిక్‌ పంట ఉత్పత్తులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉందని చెప్పాడు. భూమిని ఆరోగ్యంగా, సారవంతంగా ఉంచడంతోనే ఆర్గానిక్‌ రైతు విజయంలో అత్యంత కీలకమైన అంశం అన్నాడు. మొదట్లో ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాలను తాను చాలా కష్టపడి నేర్చుకున్నానని, ఇప్పుడు ఔత్సాహిక రైతులకు తన అనుభవం నుంచి తేలిగ్గా అర్థమయ్యేలా అవగాహన కలిగిస్తున్నానని మారుతి నాయుడు వివరించాడు.చూశారుగా అన్నదాతలూ.. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా మారుతి నాయుడు అప్పుల ఊబి నుంచి బయట పడడమే కాకుండా లక్షలు సంపాదిస్తున్నాడు. కుటుంబాన్ని ఆనందంగా ఉంచగలుగుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేందుకు, ఆర్గానిక్‌ పంటలనే వినిగించేందుకు ముందుకు వస్తే.. ఇప్పటి తరంతో పాటు భవిష్యత్‌ తరాలు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here