ఆయనో మాజీ టీచర్‌.. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి.. సహజసిద్ధ వ్యవసాయం చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎకరం నర తోటలో 70 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆయన ఆ పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు. తన తోటలోని పండ్ల మొక్కల్ని కన్నబిడ్డల మాదిరిగా చూసుకుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర పనుల్లో ఎంత బిజీగా ఉన్నా రాత్రికైనా ఓసారి తన తోటలోని మొక్కల్ని పలకరించకుండా నిద్రపోరంటే అతిశయోక్తి కాదు. పండ్ల మొక్కలతో ఆయన అనుబంధం అలాంటిది మరి! ఆయనే.. తెలుగుదేశం హయాంలో ఎక్సైజ్‌ మంత్రిగా పనిచేసిన కే.ఎస్‌. జవహర్‌. సహజసిద్ధ పద్ధతిలో పండించే పండ్లను జవహర్‌ కుటుంబ సభ్యులు కొన్ని వినియోగించుకుని.. అతిథులకు, బంధు మిత్రులకు, చుట్టుపక్కల వారికి కూడా పంచిపెడుతుంటారు.పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని తమ రెండెకరాల 60 సెంట్ల తోటలో జవహర్‌ ఎకరం నర పొలంలో 70 రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. నేరేడులో మూడు రకాలు, ఐదు రకాల జామ, పది రకాల మామిడి, బత్తాయి, దానిమ్మలో నాలుగు రకాల మొక్కలు, కూర అరటి, పండు అరిటిలో ఐదారు రకాలు, నేరేడు, పాల సపోటా, గేదె సపోటా, వాటర్ యాపిల్‌, కొబ్బరిలో పది రకాలను తమ తోటలో జవహర్‌ పండిస్తున్నారు. మూడు రకాల రేగు పండ్ల మొక్కలు నాటారు. ఖర్జూర, అంజీర, పనస, పంపర పనస, వెలక్కాయ, రామఫలం, లక్ష్మణ ఫలం మొక్కలు పెంచుతున్నారు. వీటితో పాటు కూరగాయలు కూడా సహజసిద్ధంగా పండిస్తున్నారు. తమ పెరటితోటలో పెంచే మొక్కలకు రసాయన ఎరువులు కాకుండా కేవలం సేంద్రీయ ఎరువులనే వాడుతున్నారు జవహర్‌.దాల్చినచెక్క, యాలకులు, పలావ్‌ ఆకు లాంటి సుగంధ ద్రవ్య మొక్కలు కూడా జవహర్‌ పెంచుతున్నారు. తమ తోటలో కొబ్బరి మొక్కలు పెద్దవి అయ్యాక.. మిరియాల మొక్కలు కూడా నాటారు. తన ఇంట్రెస్ట్‌ కోసమే ఇలా వివిధ రకాల మొక్కలను ప్రకృతి వ్యవసాయ విధానంలో నాటి పెంచుతున్నారు జవహర్‌. గ్రామాల్లో తగ్గిపోయిన పెరటిసాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాను ఇదంతా చేస్తున్నానంటున్నారు. రసాయనాలు వినియోగించని పండ్లు, కాయగూరలు, దొండ తదితర పాదు రకాలు, వివిధ రకాల ఆకు కూరలు తింటే ఆరోగ్యం బాగవుతుందని, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడకుండా కాపాడుకోగలమనే సందేశాన్ని నలుగురికి తెలిపేందుకు కూడా తాను ప్రకృతి వ్యవసాయ విధానం అనుసరిస్తున్నానంటారు జవహర్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీ విటమిన్‌ అధికంగా ఉండే వాక్కాయ పంట కూడా జవహర్‌ పండిస్తుండడం విశేషం. వాక్కాయలను పప్పులో వేసి కూర వండుకుంటారని, చెర్రీ పండ్ల మాదిరిగా కూడా తినవచ్చని చెబుతున్నారు. వాక్కాయలు పండినప్పుడు కొద్దిగా పులుపు తగ్గుతుందని, దానిలోని గింజలు తీసేసి, చక్కెర ద్రవంలో వేసుకుని తింటే మరింత రుచిగా ఉంటాయంటున్నారు.తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలు తీసుకొచ్చి తమ తోటలో నాటామని, మూడో సంవత్సరానికే అవి కాతకు వచ్చాయని జవహర్‌ చెప్పారు. సపోటా కూడా మూడేళ్లకే కాతకు వస్తుందన్నారు. వేప లాంటి ఎక్కువ నీడ, ఆరోగ్యాన్నిచ్చే చెట్లను కూడా జవహర్‌ తన పెరటి తోటలో పెంచుతున్నారు. బజారులో డ్రైఫ్రూట్స్‌ కొనుక్కొని తినే అవసరం లేకుండా.. రసాయనాలు లేని పండ్లను సొంతంగా పండించుకుని తినాలనే ఉద్దేశంతో అంజీర మొక్కలు వేశామంటున్నారు. దాల్చినచెక్క మొక్కకు నీడ అవసరమని, అందుకే జామచెట్టు కింద దాల్చినచెక్క మొక్క పెంచుతున్నామని తెలిపారు. ఎండ ఎక్కువ తగిలితే మొక్క ఎదుగుదల అంతగా ఉండదని అన్నారు. పలావ్‌ ఆకు మొక్కకు కూడా ఎక్కువగా ఎండ తగలకూడదని, అందుకే మామిడిచెట్టు పక్కనే వేశామన్నారు. బత్తాయి చెట్లకు తమ నేల బాగా సూటయిందని, మూడేళ్లకే కాతకు వచ్చే ఒక్కో బత్తాయి చెట్టుకు వంద కాయలకు పైగా కాస్తున్నాయని చెబుతున్నారు.తమ తోటలో ప్రకృతిసిద్ధంగా పండిస్తున్న ఒక్కో పంపర పనసకాయ రెండు మూడు కిలోల బరువు ఉంటున్నాయని అన్నారు. దానిమ్మకు కూడా తమ నేల బాగా సూటయిందన్నారు. పచ్చళ్లు పెట్టుకునే రాతి ఉసిరి చెట్లు, తినే ఉసిరి చెట్లు కూడా జవహర్‌ తమ తోటలో పెంచుతున్నారు. వాటర్‌ యాపిల్‌ ఉపయోగాల గురించి జనాలకు అంతగా తెలియదని, దాంట్లో ఫైబర్‌, వాటర్‌ ఎక్కువగా ఉంటాయని, బీపీ లాంటి వాటిని కంట్రోల్ చేసే గుణం వాటర్ యాపిల్‌లో ఉంటుందన్నారు. కిడ్నీల వైద్యంలో వాడే కొండపిండి ఆకును కూడా జవహర్‌ తమ తోటలో పెంచుతున్నారు. జవహర్‌ తోటలో తీపి చింతచెట్టు కూడా పెంచుతున్నారు. రేగు జాతికి చెందిన గ్రీన్ యాపిల్‌ పంట కూడా జవహర్ వేశారు. తమ తోటలోని రేగుచెట్టు 365 రోజులూ పంట ఇస్తుందని చెప్పారు. వారానికి 10 నుంచి 20 కిలోల రేగు కాయలు దిగుబడి వస్తున్నదని చెప్పారు.కేవలం పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, సుగంధ ద్రవ్యాలే కాకుండా సరదా కోసం నాటు కోళ్లను కూడా ఈ మాజీ మంత్రి జవహర్ పెంచుతున్నారు. ఆరు నెలల్లో ఒక్కో నాటు కోడి కేజీ నర నుంచి రెండు కేజీల వరకు బరువు వస్తుందన్నారు. గ్రామాల్లోని నాటు కోళ్లు సహజసిద్ధంగా పెరిగినట్టే తమ తోటలో స్వేచ్ఛగా తిరిగేలా కోళ్లను జవహర్‌ పెంచుతున్నారు. ఒక్కో కోడిపిల్ల 55 రూపాయలకు దొరుకుతుందని, ఆరు నెలలు పెంచిన తర్వాత ఒక్కో దాని మీద రూ.500 వరకు ఆదాయం వస్తుందన్నారు. పెట్టిన పెట్టుబడికి నష్టం ఉండని, చేసిన కష్టానికీ ఫలితం ఉంటుందని, లైవ్‌ స్టాక్‌ పెంచాలనే సరదా కొద్దీ తాను నాటుకోళ్లు పెంచుతున్నట్లు జవహర్‌ చెప్పారు. వారానికి 400 కోళ్లు మార్కెట్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే నెలకు రెండు మూడు లక్షల ఆదాయం వస్తుందన్నారు. రాజకీయంగా ఎదురయ్యే వత్తిడుల నుంచి మైండ్‌ ఫ్రీ అవడం కోసమే తాను పశువులు, పక్షులను పెంచుతున్నానని చెప్పారు. నాటుకోళ్ల పెంపకాన్నే ఆదాయ వనరుగా చేసుకుంటే ఆదాయం బాగా వస్తుందని చెప్పారు. రెండు వందల కోడిపిల్లల్ని కొనేందుకు, ఆరు నెలల పాటు మేత వేసేందుకు సుమారు రూ.20 వేలు ఖర్చవుతుందని, అప్పటికి ఆ కోళ్లు 400 కిలోల బరువు వరకు వస్తాయన్నారు.సీ విటమిన్‌ ఎక్కువగా లభించే నిమ్మజాతి మొక్కలను జవహర్‌ తమ తోటలో ఎక్కువగా పెంచుతున్నారు. మల్బరీ పండ్ల మొక్కలు కూడా జవహర్ వేశారు. తియ్యగా ఉండే సీడ్‌లెస్ నేరేడు కూడా ఆయన తోటలో ఉంది. దేశవాళీ మునగ చెట్లు నాటారు జవహర్‌. హైబ్రీడ్‌లా కాకుండా రకరకాల సైజుల్లో దేశవాళీ మునగకాయలు పెరుగుతాయన్నారు. ఆరోగ్య పరంగా మునగాకులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని, ప్రకృతి వైద్యుల సలహా మేరకు తాను ప్రతి రోజూ మునగాకు, కరివేపాకు కలిపి రసం తీసుకుని తాగుతున్నట్లు చెప్పారాయన. సీజన్‌తో సంబంధం లేకుండా 365 రోజులూ కాసే మామిడి రకాన్ని కూడా జవహర్ పెంచారు. మలేషియన్ యాపిల్‌ పంట కూడా ఆయన పండిస్తున్నారు.నేచర్‌తో అనుబంధం కోసమే ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు జవహర్ పేర్కొన్నారు. గోదావరి జిల్లాలో కూడా ఖర్జూర పండుతుందని ఎవరో చెప్పడంతో ఆరు రకాల ఖర్జూర మొక్కలు తెప్పించి పెంచుతున్నారు జవహర్‌. తమ తోటలో ఖర్జూర పంట వచ్చాక తమ ప్రాంతంలోని రైతులను కూడా ఖర్జూర పంటపై అవగాహన కల్పించాలనుకుంటున్నానని చెప్పారు. సరదా కోసం ఎర్రచందనం మొక్కలు కూడా వేసినట్లు చెప్పారు. మొక్కల పెంపకంలో శ్రద్ధ ఉండాలని, వాటి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని మాజీ మంత్రి జవహర్‌ సలహా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here