ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్‌ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్ అరటి కాయను ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించకముందు ఆయన ఒక ఐటీ ఇంజనీర్. బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో మంచి వేతనం అందుకునే ఉద్యోగం చేసేవారు. ఆయన సొంతూరు మదానూర్ సమీపంలోని బలూర్. ఇది వెల్లూర్-తిరుపత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఉండే ప్రాంతం. సేంద్రియంగా సాగు చేసే కూరగాయలను ఇంత చౌకగా ఎలా అమ్మగలుగుతున్నారనిని అడిగినప్పుడు తిరుమల్ (పై ఫోటో) ఇచ్చే సమాధానం ఆసక్తికరంగా ఉంటుంది.
“నేను నా టమాటా లోడ్‌ను అంబర్ హోల్‌సేల్ మార్కెట్‌కు తీసుకెళ్లినప్పుడు నాకు కిలోకు 3 రూపాయల చొప్పున లెక్కగట్టి ఇచ్చారు. రవాణా చార్జీలకు, ఏజెంట్ కమిషన్‌కు ఒక్కో రూపాయి పోగా, నా లాభం కింద నాకు మిగిలింది ఒక రూపాయి మాత్రమే. కానీ, అదే టమాటాను వారు 10 రూపాయలకు మార్కెట్‌లో అమ్మడం గమనించాను. అలా కాకుండా కూరగాయలను నేనే నేరుగా వినియోగదారులకు అమ్మినట్లయితే మరింత ఎక్కువ సంపాదించగలనని గ్రహించాను” అని తిరుమల్ వివరిస్తారు. ఆ సమయంలోనే నాకు “వివాసాయి మండి” (vivasayi mundy) అనే యాప్‌ను క్రియేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈ పద్ధతి పని చేస్తుందో లేదో తెలియదు. కాస్త భయపడుతూనే తిరుమల్ మొత్తానికి ఆ యాప్ తయారు చేశారు. యాప్ విడుదల చేయగానే మొదటి రోజునే ఒక్కసారిగా 65 ఆర్డర్లు రావడంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. తన రోజువారీ పంట దిగుబడి 500 కిలోల టమాటాలను సులువుగా విక్రయించడానికి అలా వీలు కలిగింది. తిరుమల్ కూరగాయల సాగు కోసం 5 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. తిరుమల్ తండ్రి రాజమణికంతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి ఈ భూమిలో సేద్యం చేస్తారు. మిరప, వంకాయ, ఆకుకూరలు, మునగ వంటి కూరగాయలను వారు సాగు చేస్తారు. “నేను మరికొంత భూమిని సమకూర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను. 60 ఎకరాల విస్తీర్ణంలో ఆర్గానిక్ విధానంలో కూరగాయలు పండించాలన్నది నా ఆలోచన” అని తిరుమల్ చెబుతారు.
తిరుమల్ యాప్ అంచనాలకు మించి విజయవంతం కావడంతో కొంతమంది స్థానిక రైతులు కూడా తమ ఉత్పత్తులను ఆయనకు విక్రయించడం మొదలుపెట్టారు. “నేను స్థానికంగా, సేంద్రియంగా సాగు చేసే పంటలను మాత్రమే తీసుకుంటాను” అని తిరుమల్ చెప్పారు. నేరుగా వినియోగదారులకు కూరగాయలను విక్రయిస్తున్నప్పుడు ప్రతి రూపాయీ తనకు లాభమే. తన కుటుంబం శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతోంది. తిరుమల్ ఇప్పుడు మరొక పెద్ద సేంద్రియ రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వెల్లూరులోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్ చెయిన్‌కు ప్రతిరోజూ వారు కూరగాయలు సరఫరా చేస్తున్నారు. కొత్తగా ఆలోచిస్తే రైతు నష్టపోకుండా ఉండడమేగాక వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందని తిరుమల్ నిరూపించారు.

(DT NEXT సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here