పంట పొలాలైనా.. పెరటి తోటలైనా.. మిద్దెపై చేసే ఔత్సాహిక సేద్యమైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది విష రసాయనం కాదు.. ఖర్చు కూడా తక్కువే. తయారు చేయడం చాలా సులువు. ప్రయోజనం చాలా ఎక్కువ. అలాంటి ఓ చక్కని ద్రావణం ఎగ్ అమైనో యాసిడ్ తయారీ విధానం, దాని ప్రయెజనాలు తెలుసుకుందాం. మొక్కలు మంచి ఆరోగ్య వంతమైన పుష్పాలను పుష్పించేలా తోడ్పడుతుంది ఎగ్ అమైనో యాసిడ్. పండ్లు, కూరగాయలు నాణ్యంగా తయారయ్యేలా చేస్తుంది. కోడిగుడ్లు, నిమ్మకాయల రసం, నల్లబెల్లంతో ఈ ఎగ్ అమైనో యాసిడ్ తయారు చేసుకోవచ్చు.ఎగ్ అమైనో యాసిడ్ తయారీకి కావలసిన వస్తువులు: గుడ్లు, నిమ్మరసం, నల్లబెల్లం, గాలి చొరబడని మూడు లీటర్ల లిక్విడ్ పట్టే ప్లాస్టిక్ సీసా. రెండు లీటర్ల ఎగ్ అమైనో ద్రావణం తయారీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎలాంటి పగుళ్లు, డ్యామేజ్ లేని ఓ డజను తాజా కోడిగుడ్లను వస్త్రంతో శుభ్రంగా తుడిచి, సీసాలో ఒకదానిపై ఒకటి పేర్చాలి. రెండు కిలోల బాగా పండిన నిమ్మకాయల రసాన్ని తీసి, వడకట్టి సీసాలోని గుడ్లు పూర్తిగా మునిగేలా పోసుకోవాలి. తర్వాత జార్ మూత మూసివేసి, ఎండ, వేడిమి తగలని నీడ ప్రదేశంలో 10 నుంచి 15 రోజులు ఉంచాలి. జార్ మూతను రోజూ ఉదయం, సాయంత్రం తీసి, రెండు నిమిషాల తర్వాత మళ్లీ మూసేయాలి. నిమ్మరసం కారణంగా జార్‌లో గ్యాస్‌లు వెలువడి సీసా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రోజుకు రెండుసార్లు మూత తీసి పెడుతూ ఉండాలి.
ఇలా పదిహేను రోజులయ్యే సరికి కోడిగుడ్ల పెంకులు సహా నిమ్మరసంలో కరిగిపోతాయి. ఒక రకమైన కెమికల్ రియాక్షన్‌తో గుడ్లు నిమ్మరసంలో కలిసిపోయి, చిక్కని ద్రవంలా తయారవుతుంది. ఆ ద్రవాణాన్ని ఒక కర్రతో బాగా కలుపుకోవాలి. ఇలా మరో 15 రోజులు ఇలాగే సీసా మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు అది బాదంపాలు మాదిరిగా చిక్కని ద్రవంగా మారుతుంది. తర్వాత మన పొలంలోని లేదా పెరటితోటలోని, లేదంటే టెర్రస్ గార్డెన్‌లోని పుష్పించే దశకు వచ్చిన మొక్కలపై అరకిలో నల్లబెల్లంను గోరువెచ్చని నీటిలో కలిపి, చల్లబరిచి, వడకట్టి మొక్కల మొదళ్లకు డ్రిప్ ద్వారా సరఫరా చేయాలి. లేదంటే పిచికారి చేసినా ఫలితం బాగా ఉంటుంది.
ఎగ్ అమైనో ద్రావణాన్ని డైరెక్ట్‌గా మొక్కల మొదళ్లలో లేదా ఆకులపై చల్లకూడదు. లీటరు నీటిలో 2 లేదా 3 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి మొక్కలకు లేదా అన్ని రకాల పంటలకు సరఫరా చేసుకోవాలి. మొక్కలకు సరఫరా చేసే, లేదా స్ప్రే చేసే రోజు మాత్రమే బెల్లం ద్రావణానికి కలుపుకోవాలి. ఇలా ఒక పంట కాలంలో మొక్కలకు ఎగ్ అమైనో ద్రావణాన్ని రెండు మూడు సార్లు పిచికారీ చేసినా, మొదళ్లకు సరఫరా చేసినా మంచి దిగుబడులు ఇస్తుంది. అయితే.. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ ఎగ్ అమైనో ఆమ్లం గడువు రెండు నెలలు మాత్రమే. ఈ ద్రావణానికి ఒక్క నీటి చుక్క కూడా తగలకుండా ఆరు నెలలు కూడా నిల్వ ఉంచుకోవచ్చని నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్నారు.
మొక్కలకు పూత రాక ముందు ఎగ్ అమైనో ద్రావణం పిచికారి చేయాలనుకుంటే.. ఒక లీటర్ నీటిలో సుమారు 5 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకోవాలి. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత పిందె, కాయ తయారయ్యే దశలో ఉన్నప్పుడైతే.. లీటర్ నీటిలో మూడు మిల్లీ లీటర్ల ఎగ్ అమైనో ఆమ్లం కలిపి పిచికారి చేసుకోవాలి. చిన్న చిన్న మొక్కలు లేదా మిద్దెతోటలోని మొక్కలకు పిచికారీ చేసేందుకు లీటర్ నీటిలో ఒకటి నుంచి 1.5 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకుంటే సరిపోతుంది.
ఈ ఎగ్ అమైనో ద్రావణం మొక్కలకు చక్కని పోషకంగా పనిచేస్తుంది. మొక్కలు బాగా ఎదిగేలా చేస్తుంది. మొక్కల నుండి పువ్వులు రాలిపోకుండా కాపాడుతుంది. పిందెలు, కాయల మొదళ్లను పటిష్టంగా ఉంచుతుంది. మొక్కలు, పూలు, పిందె, కాయలను పీడించే తెగుళ్లను నియంత్రిస్తుంది. కాయల సైజ్ పెద్దగా అయ్యేలా చేస్తుంది. కోడిగుడ్ల పెంకుల్లో ఉండే కాల్షియం మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎగ్ అమైనో ద్రావణాన్ని పూత దశకు ముందు పిచికారి చేస్తే.. నాణ్యమైన వస్తుంది. పిందెలు రాలిపోకుండా మొక్కను గట్టిగా పట్టుకుని ఉండేలా చేస్తుంది. ఎగ్ అమైనో ద్రావణంలో యాసిడ్లు, ప్రొటీన్లు, మైక్రో, మ్యాక్రో న్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. మొక్కలకు ఏమాత్రం కాల్షియం లోపం ఉన్నా పోతుంది.
ముప్పై రోజులకు తయారయ్యే ఈ ద్రావణం కుళ్లిపోయిన గుడ్ల వాసన వస్తుంది. కాబట్టి పంటకు హాని కలిగించే కొన్ని క్రిమి కీటకాలు దరిచేరవు. అంటే క్రిమి కీటకాలను నివారించేందుకు పనిచేస్తుంది. అన్ని రకాల పంటలు, పూలు, పండ్లు, మిరప మొక్కలకు ఈ ద్రావణాన్ని వాడవచ్చు. మిరప తోటలో వచ్చే బింగి తెగులును కూడా ఎగ్ అమైనో ద్రావణం నివారిస్తుంది. ఈ ఎగ్ అమైనో ఆమ్లాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.