అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి ఏటా దేశంలోని సుమారు 44 మిలియన్ల హెక్టార్లలో 90 మిలియన్ టన్నుల ధాన్యం పండుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్‌గఢ్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ధాన్యం పంట సాగులో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.
తాత ముత్తాతల కాలం నుంచి సాంప్రదాయం పద్ధతిలో వరిధాన్యం పండిస్తున్నాం కదా? వరి సాగు అంటేనే ఎక్కువ నీరు అవసరమయ్యే పంట. మానవాళికి నీరు అత్యంత విలువైన వనరు అని అందరికీ తెలిసిందే. ఎంతో విలువైన నీరు కిలో వరిధాన్యం పండించడానికి సుమారు 5 వేల లీటర్ల వరకు అవసరం అవుతుంది. కానీ డ్రిప్ పద్ధతిలో అయితే.. కేవలం 15 నుంచి 16 వందల లీటర్ల నీరు మాత్రమే సరిపోతుందని ప్రయోగాత్మకంగా తేలింది. దాంతో పాటు డ్రిప్ విధానంలో పండించిన ధాన్యం క్వాలిటీ, దిగుబడి కూడా పెరిగినట్లు పరిశోధనల్లో స్పష్టం అయింది. వర్షపాతం, సాగునీటి లభ్యత తక్కువ ఉండి, ఏడాది పొడవునా తేమ వాతావరణం ఉండే ప్రాంతాల్లో డ్రిప్ విధానంలో కొద్దిపాటి నీటితోనే వరి సాగు చేయవచ్చు.ఇలాంటి డ్రిప్ విధానంలో కొందరు తమిళనాడు రైతులు వరిపంట సాగుచేస్తున్నారు. వారిలో తిరుప్పూర్ జిల్లాలోని ధారాపురం తాలూకా గోవిందపురానికి చెందిన రైతు పార్థసారథిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వినూత్నంగా డ్రిప్ పద్ధతిలో వరిసాగు సాగు చేస్తూ.. ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచారు పార్థసారథిని. అందుకే ఆయనను 2015లో ‘ఇన్నోవేటివ్ రైస్ ఫార్మర్ అవార్డు’ వరించింది. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో ఆయన చేస్తున్న సాగు ద్వారా ధాన్యం దిగుబడి, నాణ్యత పెరగడంతో ఆదాయమూ బాగా పెరిగింది. తిరుప్పూర్ జిల్లాలో ఏటికేడాది వర్షపాతం తగ్గుతూ వస్తోంది. ఒక్కోసారి అంచనాలకు అందని విధంగా వాతావరణం భయంకరంగా మారిపోతుంది. దాంతో పాటు ఏడాది పొడవునా తేమ వాతావరణ ఉంటుంది. దీనితో వరి సాగులో అక్కడ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్థసారథి డ్రిప్ విధానం ద్వారా వరిసాగు చేస్తున్నారు. దిగుబడి ఏమాత్రం తగ్గకుండా పంట పండిస్తున్నారు. ఈ విధానంలో పార్థసారథికి ముందుగా నెటాఫిమ్ సంస్థ, తమిళనాడు అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం మార్గదర్శనం చేశాయి.
డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా ధాన్యం పంట ఎందుకు సాగు చేయాలనే ప్రశ్నకు అనేక లాభాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే మామూలు కన్నా అతి తక్కువ నీటితోనే నాణ్యమైన ఎక్కువ వరిధాన్యం పండించవచ్చు. మరో లాభం ఏమిటంటే డ్రిప్ సిస్టంలో వరిధాన్యం పంట పండించి, కోత కోసిన తర్వాత మళ్లీ వరి సాగు చేయడానికి మధ్యలో పంట మార్పిడి విధానంలో అదే భూమిలో మరోరకం పంట ఏదైనా పండించుకోవచ్చు. తద్వారా భూసారం పెరుగుతుంది. తెగుళ్ల నియంత్రణకు పనికి వస్తుంది. మొత్తానికి పంట దిగుబడి పెరుగుతుంది. డ్రిప్ విధానంలో పండిన నాణ్యమైన ధాన్యం లేదా బియ్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. వరిమొక్కల వేళ్లు కూడా త్వరగా మట్టిలో కలిసిపోతాయి. ఎక్కువ దిగుబడి సాధించేందుకు రైతులు వినియోగించే హెవీ మెటల్స్ వల్ల భూమిలో ఏర్పడే విష రసాయనాల స్థాయిని 90% వరకు తగ్గిస్తుంది. వరిమొక్కల వేర్ల సముదాయానికి నేరుగా నీటిని సరఫరా చేస్తుంది.
డ్రిప్ ఇరిగేషన్ విధానం వల్ల వరిసాగులో కూలీలు, పంటసాగుకు ముందు భూమిని సిద్ధం చేయడానికి, నీటి కోసం, రసాయన ఎరువుల కోసం పెట్టే ఖర్చు బాగా తగ్గిపోతుంది. అలాగే పంట సాగు కోసం పెట్టే పెట్టుబడి తగ్గడం ద్వారా లాభాలు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. డ్రిప్ సిస్టంలో వరిసాగు చేస్తే.. వాతావరణంలోకి గ్రీన్ హౌస్ మిథేన్ వాయువుల విడుదల తగ్గుతుంది. దీంతో వాతావరణంలో మంచి మార్పులు వస్తాయి. నీటి పారుదల విధానం వల్ల నేలలోని పోషకాలు చాల వరకు కొట్టుకుపోతాయి. దీంతో వరిమొక్కలు పూర్తిగా వినియోగించుకోలేవు. డ్రిప్ సిస్టంలో ఇలాంటి నష్టం జరగదు. భూమిలోని పోషకాలు మొక్కలకు సమృద్ధిగా అందుతాయి.
వరిసాగులో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలు చేస్తూ.. పార్థసారథితో పాటు మరో 11 మంది రైతులు ఎంతో మంది ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తక్కువ నీటి వనరులతో నాణ్యమైన, ఎక్కువ పంట పండిస్తూ.. సాంప్రదాయ సాగు విధానం కంటే అధిక లాభాలు సాధిస్తున్నారు.