ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పండు ‘డ్రాగన్‌ ఫ్రూట్’. కరోనా అనంతర రోజుల్లో మన దేశంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ లేదా పిటాయ పండుకు మంచి గిరాకీ వచ్చింది. గతంలో మనం అంతగా చూడని, పట్టించుకోని ఈ డ్రాగన్ ఫ్రూట్‌ ఇప్పుడు హైదరాబాద్‌ లాంటి అనేక నగరాల్లో రోడ్డు పక్కన రాసులుగా పోసి అమ్ముతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పేరే విచిత్రం. దీన్ని సూపర్ ఫ్రూట్ అని కూడా అంటుంటారు. తెలుగులో దీనికి సిరిజెముడు అని పేరు. డ్రాగన్‌ అనేది చైనాలో ఓ పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు కురిపిస్తూ శత్రువులను చంపేస్తుందని చెబుతారు. దీనికి ఉండే ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల వల్ల డ్రాగన్ ఫ్రూట్‌ అనే పేరు పెట్టారు. గులాబీ రంగులో ఉండే డ్రాగన్‌ ఫ్రూట్‌ చుట్టూ ఉండే రేకులు పసుపుపచ్చ రంగులో ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లోపల తెల్లటి గుజ్జు, అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌ దక్షిణ అమెరికాలో పుట్టింది. తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయ్‌లాండ్‌, వియత్నాం జనం డ్రాగన్‌ ఫ్రూట్లంటే చెవికోసుకుంటారంటారు.డ్రాగన్‌ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువ ఉంటాయి. ఖనిజాలు ఎక్కువ. పీచు పదార్థమూ అధికమే. ఐరన్‌, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమన్‌ సి, విటమిన్‌ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్‌ లాంటి పోషకాలు డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా ఉంటాయి. కరోనా అనంతర కాలంలో మనిషిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతోందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో సహజసిద్ధంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్‌, చక్కెర వ్యాధి లాంటి దీర్ఘరోగాలను నయం చేస్తాయని తేలింది.

మనిషికి ఎన్నెన్నో ఆరోగ్య లాభాలు అందించే డ్రాగన్ ఫ్రూట్‌ సాగును ప్రభుత్వాలు కూడా బాగా ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి సేంద్రీయ విధానంలో పండించే డ్రాగన్ ఫ్రూట్‌కు ఆరోగ్యాభిలాషులైన వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తున్న క్రమంలో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని రంజోల్‌ గ్రామానికి చెందిన యువ రైతు  బసంత్‌పూర్‌ రమేష్‌రెడ్డి ఆర్గానిక్‌ సాగు విధానంలో డ్రాగన్ ఫ్రూట్‌ పంట పండిస్తూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. గుర్తింపుతో పాటు మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు రమేష్‌ రెడ్డి.డ్రాగన్ ఫ్రూట్‌ మొక్కను ఒకసారి నాటితే 35 ఏళ్ల పాటు పండ్ల దిగుబడి ఇస్తుందని అనుభవజ్ఞులైన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌ మొక్క నాటినప్పటి నుంచి 25 ఏళ్ల పాటు అత్యధిక దిగుబడి ఇస్తుందంటున్నారు. డ్రాగన్ పంట తొలి ఏడాదిలో ఒక ఎకరాకు 2 టన్నులు, రెండో ఏడాది 5 టన్నులు, మూడో సంవత్సరం 8 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్కో డ్రాగన్‌ ఫ్రూట్‌ దాదాపు 400 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దాని రుచి కొద్దిగా పుల్లగా.. కొద్దిగా తీపిగా ఉంటాయి. మరీ ఎక్కువ తీపి ఉండకపోవడం, శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం డ్రాగన్‌ ఫ్రూట్‌కు ఉంది. ఒక్కో డ్రాగన్ ఫ్రూట్‌ ధర రూ.70 నుంచి 100 పలుకుతుంది. అందువల్ల అత్యధిక ఆదాయం వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ వల్ల వచ్చే లాభాలు తెలుసుకున్న వారు ధర కాస్త ఎక్కువైనా కొనుక్కుని తినేందుకు ఏ మాత్రం సందేహించరు.యువరైతు రమేష్‌ రెడ్డి 2014లో న్యూజిలాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అప్పటి నుంచి 2016 వరకు అక్కడే ఉద్యోగం చేశారు. అయతే.. తన తండ్రి డ్రాగన్‌ ఫ్రూట్‌ నర్సరీ ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తుండడంతో ఆయన న్యూజిలాండ్‌లో ఉద్యోగం వదిలేసి సొంత గ్రామానికి వచ్చేశారు. రమేష్‌రెడ్డి డ్రాగన్ ఫ్రూట్‌ సాగుబడిలోకి రాక ముందు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు కొనుగోలు చేయడానికి, డ్రాగన్ ఫ్రూట్ పంట వేసే రైతులకు సబ్సిడీ ఇస్తోంది. దాంతో రమేష్‌ రెడ్డి తండ్రి నర్సింగరెడ్డి డ్రాగన్ ఫ్రూట్‌ సాగులోకి అడుగుపెట్టారు. బంగ్లాదేశ్‌కి చెందిన 10 రకాల డ్రాగన్ ఫ్రూట్‌ మొక్కలు కొని 7 ఎకరాల్లో నర్సరీ పెంచడం ప్రారంభించారు. అనంతరం సరికొత్త సాగు విధానం ఆచరించి వాటిని 80 రకాల మొక్కలకు పెంచారు. ఇప్పుడు నర్సింగరెడ్డి నర్సరీలో 153 రకాల డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. తమ నర్సరీలో పెంచిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని నర్సింగరావు దేశంలోని వివిధ రాష్ట్రాలకు, పలు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.న్యూజిలాండ్‌లో ఎంబీఏ చేసి, ఉద్యోగం చేసిన రమేష్‌రెడ్డి స్వగ్రామానికి తిరిగి వచ్చాక డ్రాగన్ ఫ్రూట్‌ నర్సరీని నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా, బంగ్లాదేశ్‌ నుంచి రమేష్‌రెడ్డి వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని కొనుగోలు చేసి, సరికొత్త విధానంలో నర్సరీని సాగుచేస్తున్నారు. తమ నర్సరీలోని డ్రాగన్ ఫ్రూట్‌ మొక్కల్ని రమేష్‌రెడ్డి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెన్యా, ఐస్‌లాండ్‌, సింగపూర్‌, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా 4 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. రమేష్‌రెడ్డి నర్సరీలోని ఒక్కో డ్రాగన్ ఫ్రూట్‌ మొక్కకు రూ.60 నుంచి 2 వేలు వరకు ధర పలుకుతుంది.రమేష్‌ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ అసోసియేషన్‌ ద్వారా తెలంగాణలో 300 మంది రైతులకు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. దాంతో పాటుగా ఎండబెట్టిన డ్రాగన్ ఫ్రూట్ నుంచి వైన్ తయారు చేయాలనే ఆలోచన రమేష్‌ రెడ్డి వచ్చింది. దాంతో లైసెన్స్ కోసం ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఎండిన డ్రాగన్ ఫ్రూట్ నుంచి వైన్ తయారుచేయడంలో తాను ఇప్పటికే సఫలీకృతం అయ్యానని రమేష్‌ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ వచ్చిన వెంటనే వైన్ తయారు చేసి, మార్కెట్లో అమ్మడమే తరువాయి అంటున్నారాయన.

ఆరోగ్యాన్నిచ్చే, ఆర్థిక లాభాలు తెచ్చే డ్రాగన్ ఫ్రూట్‌తో పంటను సేంద్రీయ విధానంలో పండించేందుకు రైతన్నలూ మనం కూడా అడుగు ముందుకు వేద్దామా?!

వివరాలేవైనా కావాలంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో @ramesh_prince49 ద్వారా తెలుసుకోవచ్చు

 

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here