ఖర్జూరం బలమైన ఆహారం. రోజూ ఒక ఖర్జూరం తింటే ఆరోగ్యం మెరుగవుతుంది. రోగాలు దరిచేరకుండా రక్షిస్తుంది. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ-6, విటమిన్ డీ ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరం తింటే శరీరంలో ఐరన్ పెరిగి రక్షణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. ఖర్జూరం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఖర్జూరం అందిస్తుంది. ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. దంతాలను స్ట్‌రాంగ్‌గా ఉంచుతుంది. ఖర్జూరం ప్రీరాడికల్ కాబట్టి కణజాలానికి ఆక్సీకరణ మెరుగు పరుస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భిణులకు ఖర్జూరం సంపూర్ణ పోషకాహారం. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం కాబట్టి శరీరంలో మంట తగ్గిస్తుంది. కిడ్నీలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఖర్జూరంలో ఉండే అమైనో ఆమ్లాలు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను పెంచి సంతానోత్పత్తి వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఖర్జూరాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందిఖర్జూరం చెట్లు ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. వీటికి నీరు అంత ఎక్కువగా అవసరం ఉండదు. ఖర్జూరం పంటను మొక్క దశలోనే నాటుకుని నాలుగేళ్ల పాటు జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒకసారి అది పంట దిగుబడి ఇవ్వడం మొదలైతే 60 ఏళ్ల పాటు ఇస్తూనే ఉంటుంది. మొదట్లో పెట్టుబడి ఎక్కువే అయినా.. పంట రావడం మొదలైనప్పటి నుంచి లాభాల మీద లాభాలు అందిస్తూనే ఉంటుందిఖర్జూరం సాగుకు నల్లరేగడి నేల చాలా అనుకూలం అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోరు నుంచి అంగుళం నీటిధార వస్తే రెండు ఎకరాల్లో ఖర్జూరం పంట సాగు చేసుకోవచ్చు. ఖర్జూరం మొక్కలను 25 అడుగుల అడ్డం, 25 అడుగుల నిలువు దూరంలో నాటుకోవాలి. ఖర్జూరం మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా నీటి సరఫరా చేయకూడదని రైతులు గమనించాలని నిపుణులు చెబుతున్నారు. మొక్క సైజును బట్టి నీరు అందించాల్సి ఉంటుందిఖర్జూరంలో ఆడ, మగ మొక్కలు ఉంటాయి. దీని సాగులో పరాగ సంపర్కం అత్యంత ప్రధానం. మగ మొక్కలు పువ్వుల ద్వారా పుప్పొడిని ఉత్పత్తి చేస్తాయి. వాటితో ఆడ మొక్కలను పరాగ సంపర్కం చేయాల్సి ఉంటుంది. పరాగ సంపర్కం సరిగా చేయకపోతే ఆడ మొక్కలకు ఖర్జూరాలు విత్తనాలు లేకుండా కాస్తాయి. ఖర్జూరం చెట్టుకు పూత, పిందె, కాయ ఉన్న దశలో గెలలకు తప్పకుండా కవర్ కట్టుకోవాలి. లేదంటే.. కాయలు మచ్చలు ఏర్పడి పాడయ్యే అవకాశం ఉంది. ఒక చెట్టుకు ఆరు నుంచి 7 గెలలు మాత్రమే ఉంచాలి. అంతకు మించి గెలలు వస్తే కోసేయాలి. లేదంటే కర్జూర కాయల సైజు తగ్గుతుంది. దాని రుచి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.ఖర్జూరం మొక్కలు తమిళనాడులో విరివిగా లభిస్తాయి. చిన్న ఖర్జూర మొక్క ధర రూ.4,500 వరకు ఉంటుంది. రవాణా ఖర్చులతో కలిపి ఒక్కో మొక్కకు రూ.5000 వరకు పెట్టుబడి పెట్టాలి. ఖర్జూరం చిన్న మొక్కలను నాటినప్పుడు పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పశువులు వాటిని పీకేసే అవకాశం ఉంది. ఖర్జూర మొక్క నాటిన తర్వాత ఏదైనా పొరపాటు జరిగి భూమి నుంచి ఒకసారి బయటికి వస్తే.. ఇక అది బతికే అవకాశం ఉండదని గమనించాలి. అందుకే మొక్కలు పెరిగి పెద్ద అయ్యే వరకూ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఖర్జూరం మొక్కలకు మూడేళ్ల వరకు కేవలం మేకలు, గొర్రెల పెంట మాత్రమే ఎరువుగా వేయాలి. ఖర్జూరం మొక్కలకు వేడి ఎక్కువగా ఉండాలి కాబట్టి మేకలు, గొర్రెల పెంట వేయాలని నిపుణులు చెబుతున్నారు. మేకలు, గొర్రెల పెంట వేస్తేనే ఖర్జూరం మొక్కలకు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. పశువుల ఎరువు అస్పలు వేయకూడదు.ఖర్జూరం సాగుకు ముందుగా ఎకరానికి వచ్చి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఖర్జూరం పంట కాలంలో కలుపు మొక్కలు తీయడానికి, ఇతర ఖర్చులకు లక్షా 50 వేలు వరకు ఖర్చు వస్తుంది. ఇతరత్రా ఖర్చులతో కలుపుకొని సుమారు రూ.35 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అమ్మో… ఇంత పెట్టుబడా? అని అనుకోవద్దు. ఖర్జూరం పంట నుంచి లాభాలు కూడా అదే విధంగా వస్తాయి. పంట దిగుబడి చేతికి రావడానికి మొక్క నాటినప్పటి నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఖర్జూరం కాయలు పూర్తిగా పసుపురంగులోకి మారినప్పుడు అవి పక్వానికి వచ్చినట్లు గమనించాలి. అప్పుడే ఖర్జూరం కాయలో తీపిదనం వస్తుంది. పచ్చగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది.ఖర్జూరం మొక్కల చెత్తలో కొన్ని చీడపురుగులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆ పురుగులు చెట్టును లోపలి వరకు పొడిచి తింటాయి. పూర్తిగా నాశనం అయ్యే వరకు ఖర్జూర చెట్టు పచ్చగానే కనిపిస్తుంది. దానికి పురుగు పట్టినట్లు కూడా తెలియదు. అందుకే నెలకు ఒకసారి కీటక నాశనులను చెట్టు పైభాగం నుంచి మొదలు పూర్తిగా తడిసేలా స్ప్రే చేయాలి. డ్రిప్‌లో కూడా కీటక నాశనులను మొక్కలకు అందిచాల్సి ఉంటుంది. ఖర్జూరం మొక్కలకు పురుగు సమస్య తప్ప వైరస్‌లు సోకవు.
ఒక్కో ఖర్జూర చెట్టుకు సుమారు 250 కిలోల పండ్లు కాస్తాయి. కిలో ఖర్జూలకు రూ.100 పలికినా ఎకరానికి రూ.4 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ఖర్జూరం పండ్లను వ్యాపారులు కిలో రూ.250 నుండి 350 కి అమ్ముతారు. రైతుల నుండి వారు కిలో వంద రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఖర్జూరం చెట్ల నుంచి తొలి పంట కన్నా రెండో పంట నుంచి దిగుబడి ఎక్కువ వస్తుంది. చెట్టు నుంచి ఖర్జూరం గెలలను కోసిన తర్వాత పండ్లను గెలకే ఉంచితే ఐదు నుంచి 15 రోజుల వరకూ తాజాగా ఉంటాయి. అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచితే పండ్ల మీద ముడతలు వస్తాయి. ధర తగ్గుతుంది. రుచి కూడా మారిపోతుంది. ఖర్జూరం పంట రావడానికి నాలుగేళ్లు పడుతుంది కాబట్టి స్వల్ప కాలికంగా ఆదాయం ఇచ్చే కొన్ని రకాల పంటలను అంతర పంటగా ఖర్జూర తోటలో వేసుకోవచ్చు. ఖర్జూరం సాగుచేయాలనుకునే ఔత్సాహిక రైతులు వ్యవసాయ రంగ నిపుణుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుని సాగుచేస్తే.. ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.