అన్ని రకాల కూరలకు చక్కని రుచిని ఇచ్చే మంచి కాంబినేషన్‌ కూరగాయ ఏదంటే ఎవ్వరి నుంచి అయినా టక్కున వచ్చే సమాధానం ఒకటే. అదే టమాటా. టమాటా పండ్లలో యాంటీ కార్సినోజెనిక్‌ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్‌, ఊపిరితిత్తులను రక్షిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం బాగుచేస్తాయి. టమాటా నుంచి ఫైబర్‌ ఉంటుంది. విటమిన్‌ సీ, విటమిన్ ఏ, లైకోపీస్‌, పొటాషియం, ఫోలేట్‌, పొటాషియం లాంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. రక్తపోటును టమటాల అదుపు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. టమాటాలోని విటమిన్ ఏ కంటిచూపును కాపాడుతుంది. బీపీ స్థాయిలను నియంత్రించడంలో టమాటాలోని పొటాషియం చక్కగా పనిచేస్తుంది. ప్రోస్టేట్‌, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలావరకు తగ్గిస్తుంది. టమాటా ఆహారంగా తీసుకున్న వారికి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీంట్లోని ఫైబర్‌ మలబద్ధకాన్ని, విరేచనాలను నివారిస్తుంది. రోజువారీ ఆహారంలో టమాటా తీసుకుంటే చర్మం, జుటటు సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్న టమాట పంట సాగులో రైతులు కాస్త మెళకువలు పాటిస్తే.. మంచి దిగుబడులు వస్తాయి. లాభాలు కూడా దండిగా వస్తాయి. ముందుగా టమాటా మొక్కలు నాటుకునే విధానం గురించి తెలుసుకుందాం. పొలాన్ని దుక్కి దున్ని, సాళ్లుగా బెడ్‌లు వేసుకుని వాటిపై టమాటా మొక్కలు నాటుకోవాలి. విత్తనం తయారైన తర్వాత వచ్చే మొక్కలు చాలా ఆరోగ్యంగా, పచ్చగా ఉంటాయి. ఎలాంటి చీడ పీడలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. టమాటా కాయలన్నీ సైజు ఎక్కువ వస్తుంది. క్వాలిటీగా ఉంటాయి. మొక్క మొదట్లోనే ఆరోగ్యంగా లేకపోతే చీడ పీడలను తట్టుకునే శక్తి ఉండదు. దిగుబడి కూడా సరిగా రాదు. మొక్కలు దగ్గర దగ్గరగా నాటితే కాయల సైజు తగ్గిపోతుంద. 60 శాతం కూడా కాయలు పెద్దగా రావు. గోళీకాయల సైజులో మాత్రమే పెరుగుతాయి.ఎకరం నేలలో సుమారు నాలుగు నుంచి నాలుగున్నర వేల టమాటా మొక్కలు నాటుకుంటే పైరు ఆరోగ్యంగా ఉంటుంది. భూమికి సమాంతరంగా గుబురుగా పెరుగుతుంది. టమాటా మొక్కలు నాటుకునే సాలుకు సాలుకు మధ్య దూరం 5X5 అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య రెండున్నర అడుగుల దూరం పెట్టుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. అంతకన్నా దగ్గరగా టమాటా మొక్కలు నాటితే ఎత్తు ఎదుగుతాయి. పంట కోతకు ఇబ్బంది ఉంటుంది. ఒక మొక్క కొమ్మలు మరో మొక్క కొమ్మలు తగులుతూ ఉండకూడదు. ఒకవేళ పక్కన ఉన్న మొక్కకు చీడ పీడలు ఆశిస్తే.. అవి ఆరోగ్యంగా ఉన్న మొక్కకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. మొక్కలకు గాలి, వెలుతురు సరిగా సోకదు. చిక్కగా ఉన్న తోటలో కాయలు ఆకుల కింద కుళ్లిపోతాయి. ఇలా కూడా దిగుబడి తగ్గుతుంది. మొక్కలు దగ్గర దగ్గరగా నాటుకుంటే కాయలు ఎక్కువ వస్తాయని రైతులు సాధారణంగా అనుకుంటారు. కానీ ఆ ఆలోచన చాలా తప్పు అని టమాటా సాగులో ఎంతో అనుభవం సాధించిన రైతు రాజారెడ్డి చెప్పారు.టమాటా మొక్కల మధ్య దూరం ఎక్కువయ్యే కొద్దీ దాని మొదట్లో తెల్లవేర్లు అంత ఎక్కువగా భూమిలో అల్లుకుపోతాయి. అవే మొక్కకు భూమి నుంచి పోషకాలను సమృద్ధిగా అందజేస్తాయి. అదే దగ్గరగా మొక్కలను నాటిటే వేరు వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందదు. దాంతో మొక్కకు పోషకాల సరఫరా ఆ మేరకు తగ్గిపోతుంది. మంచి కాయల దిగుబడి 60 శాతమే వచ్చి, మిగతా 40 శాతం గోళికాయ మాదిరి టమాటాలు వస్తే ఆదాయం తగ్గుతుంది. తద్వారా ఎరువులు, పురుగు మందులు ఖర్చు వృథా అవుతుంది. కాయలు కోసేందుకు కూలీల ఖర్చు కూడా దండ. దాంతో పాటు కాయల గ్రేడింగ్‌ చేయడానికి కూడా కూలీల ఖర్చు వస్తుందని రాజారెడ్డి అనుభవ పూర్వకంగా వివరించారు. మొక్కలు ఎక్కువ పెడితే వాటిని కొనుగోలు చేసేందుకు నర్సరీకి ఎక్కువ డబ్బులు చెల్లించాలి. పోషకాలు కూడా అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలు ఎక్కువ పెడితే ఎక్కువ కాపు వస్తుందనే భావన తప్పు అంటారు రాజారెడ్డి.టమాటా మొక్కలు బాగా ఆరోగ్యంగా, పచ్చగా ఎదగాలంటే వాతావరణంలో 23 నుంచి 28 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటే మంచిగా ఉంటుంది. అందుకే ఎండాకాలం కన్నా శీతాకాలంలో టమాటా పైరు అనుకూలంగా ఉంటుంది. వేసవి కాలంలో అయితే.. టమాటా మొక్కలను రసం పీల్చే పురుగులు ఎక్కువ ఆశిస్తాయి. అందు వల్ల మొక్క అంత ఆరోగ్యంగా ఉండదు. ఎండాకాలంలో టమాటా పంటకు చుట్టుపక్కల పచ్చని పైర్లు కూడా ఉండవు కాబట్టి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఈ పైరునే ఆశిస్తాయి.శీతాకాలంలో చుట్టుపక్కల అంతా పచ్చగా ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులు వాటన్నింటినీ ఆశించడం వల్ల టమాటా మొక్కలకు వాటి బెడద తగ్గుతుంది.వేసవికాలంలో భూమిలోని ఫంగిసైడ్‌ బయటికి వచ్చి టమాటా మొక్కల వేర్లకు కుళ్లు తెగులు సోకే అవకావం ఉంటుంది. టమాటా మొక్కలు నాటిన తర్వాత 40 నుంచి 50 రోజుల మధ్య విల్ట్‌ తెగులు సోకే ఛాన్స్‌ ఉంది. అంతకు ముందే అంటే 3 నుంచి నాలుగైదు రోజుల మధ్యలో వేరుకుళ్లు తెగులు మొదలై పది నుంచి పదిహేను రోజుల వరకు వచ్చే అవకాశం ఉంది. టమాటా మొక్క వేసవిలో నీరు ఎక్కువ లేకపోతే చచ్చిపోతుందని రైతులు భావించి, ఎక్కువ నీరు పెడతారని రాజారెడ్డి అన్నారు. అయితే.. టమాటా పంటకు నీరు చాలా తక్కువగానే అందించాలంటారాయన. టమాటా మొక్క మొదట్లో మాత్రమే తడిసేలా నీరు పెడితే సరిపోతుంది. అలా కాకుండా మొత్తం నేలంతా తడిసిపోయేలా కొందరు రైతులు నీరు సరఫరా చేస్తారని అది తప్పు అంటారు రాజారెడ్డి. మార్చి, ఏప్రిల్ నెలల్లో భూమి ఎండకు కాలిపోయి ఉంటుంది.ఎండలు ముదరగానే ఎక్కువ నీరు పెడితే భూమిలోని ఫంగస్‌ అంతా పైకి వచ్చి మొక్కలపై దాడి చేస్తుంది.

టమాటా మేల్, ఫిమేల్‌ను ఎక్కువసార్లు క్రాస్ చేసిన కొద్దీ దానిలో స్వచ్ఛత తగ్గుతూ వస్తుంది. ఆరోగ్యంగా ఉంటే టమాటా మొక్కల నుంచి 140 నుంచి 150 రోజుల వరకూ దిగుబడిని తీసుకోవచ్చు. మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయి. అదే స్థాయిలో దిగుబడి కూడా ఇస్తాయి. ఏ విత్తనానికైనా మూడు నాలుగేళ్లు మాత్రమే జీవితకాలం ఉంటుంది. ఆ తర్వాతి నుంచి ఆ విత్తనంలోని సహజత్వం తగ్గిపోతుంది. అందుకే కొత్తగా వచ్చిన రైతులకు నచ్చిన బ్రాండ్ విత్తనాలను రెండు మూడేళ్ల వరకు మాత్రమే వినియోగించాలన్నది రాజారెడ్డి సలహా.