వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఏదైనా లాభదాయకంగా ఉంటే కుటుంబంలోని కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా అదే వ్యాపార నిర్వహణలో భాగస్వాములు కావడం కద్దు. కానీ ఇప్పుడు యువతరం ఆలోచనలు క్రమేపి మారుతూ కొత్తపంథాలో సాగుతున్నాయి. తమిళనాడులో తండ్రి శ్రీ అంజయ్య నిర్వహణలోని భవన నిర్మాణ సంస్థ విజయవంతంగా నడుస్తున్నా ఆయన కుమారుడు అమర్ నాథ్ తనదైన దారిని ఎంచుకున్నారు. అది కూడా ఆర్గానిక్ వ్యవసాయం కావడం, ఆయన భార్య స్నేహ కూడా అదే దారిన నడుస్తుండడం విశేషం.
తండ్రి నిర్వహిస్తున్న కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో ప్రవేశించకుండా కుమారుడు అమర్‌నాథ్ మదురై సమీపంలో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సుమారు 300 ఎకరాల్లోని సువిశాల వ్యవసాయక్షేత్రం ఇప్పుడు తనని తాను రుజువు చేసుకునే కార్యక్షేత్రం. ప్రస్తుతం ఇందులోని 52 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం సాగుతోంది. ఈ వ్యవసాయక్షేత్రంలో ఆయన వాడే ఎరువు గోమయంతో తయారయ్యే జీవామృతమే. అది కూడా ఆయన సొంతంగానే తయారుచేసుకుంటారు. ఇందుకోసం అమర్‌నాథ్ ప్రత్యేకంగా 70 వరకూ దేశీ ఆవులను పెంచుతున్నారు. తన పొలంలో ఆయన రసాయన ఎరువులు వాడరు. కెమికల్ క్రిమిసంహారక మందులూ ఉపయోగించరు. అమర్‌నాథ్, స్నేహ యువదంపతులు ఇక్కడ కూరగాయలు కూడా సాగు చేస్తున్నా, ప్రధానంగా పండ్ల తోటలపైనే వారు దృష్టి కేంద్రీకరించారు. జామ, సీతాఫలం, మామిడి వంటి రకాలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ వంటి ఎక్జోటిక్ ఫ్రూట్ల్ సైతం వారు పండిస్తున్నారు. సాధారణంగా మామిడి, జామ వంటి పండ్లను స్థానిక మార్కెట్లకు తరలిస్తారు. డ్రాగన్ ఫ్రూట్ వంటి విదేశీ పండ్ల వెరైటీలను మెట్రో నగరాల మార్కెట్లలో విక్రయిస్తారు. ఆర్గానిక్ కావడం వల్ల తమ పండ్లకు మంచి ధరే లభిస్తోందని చెబుతున్నారు అమర్‌నాథ్.

ప్రకృతి వ్యవసాయంలో అమర్‌నాథ్

మన రైతులు సీజనల్ దేశవాళీ పంటలు వేసుకోవాలనీ, అప్పుడే ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరగకుండా ఉంటుందనీ ఆయన సలహా ఇస్తున్నారు. తనకు బాల్యం నుంచీ వ్యవసాయమంటే ఇష్టమనీ, అందుకే సేద్యాన్ని ఎంచుకున్నాననీ చెబుతారు అమర్‌నాథ్. తాతగారితో సహా తన బంధువుల్లో చాలా మంది ఇప్పటికీ వ్యవసాయదారులేనని ఆయన వివరిస్తారు. అలా తాను వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడం ఎంతో సహజంగా జరిగిందేనంటారు అమర్‌నాథ్.
అమర్ నాథ్ ప్రకృతి వ్యవసాయంలో ఆయన భార్య స్నేహ కూడా చురుకుగా భాగం పంచుకుంటున్నారు. మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తిచేసిన స్నేహ పెళ్లయ్యాక భర్తతో కలిసి ప్రకృతి సేద్యంలో నిమగ్నమయ్యారు. ఆర్గానిక్ వ్యవసాయంతో మంచి దిగుబడి రావడమే కాదు, అది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుందని స్నేహ చెబుతారు.

అమర్ నాథ్ వ్యవసాయక్షేత్రంలోని గోశాల

అమర్‌నాథ్-స్నేహ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలను సాగు చేయడమే కాకుండా గోఆధారిత సేద్యం విశిష్టతను పదుగురికీ వివరిస్తున్నారు. తమ ప్రకృతి వ్యవసాయాన్ని ముందు ముందు మరింత విస్తరించాలని వీరు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ ANI అమర్ నాథ్, స్నేహ జంట ప్రకృతి సేద్యంపై ఒక ప్రత్యేక కథనాన్ని అందించడం విశేషం.

అమర్‌నాథ్-స్నేహ జంట వ్యవసాయక్షేత్రంపై ANI వీడియో:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here