కొబ్బరి పంట అధిక ఉత్పాదకతలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముందు స్థానంలో ఉంటుంది. అయితే.. కొబ్బరి సాగులో మాత్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. కొబ్బరి సాగులో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో కొబ్బరి సాగు క్షేత్రాల్లో అంతర పంటలు కూడా సాగుచేయడం ద్వారా రైతులు మరింత ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దరిమిలా ఏపీలో కొబ్బరి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ లోని కోస్తా జిల్లాల మెట్టభూముల్లో ప్రధాన వాణిజ్య పంటగా రైతులు కొబ్బరిని సాగుచేస్తారు. కోస్తా జిల్లాల్లోని రైతులు సుమారు లక్షా ఆరు వేలకు పైగా హెక్టార్లలో కొబ్బరి పంటను సాగుచేస్తున్నారు.దశాబ్దాలుగా ఏపీలో సాగులో ఉన్న కొబ్బరి రకాలతో పాటు ఆంధ్ర ప్రాంతానికి అనువుగా ఉండే కొత్త కొత్త రకాలను డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అంబాజీపేటలో ఉన్న ఉద్యాన పరిశోధనా స్థానం అభివృద్ధి చేస్తోంది. ఈ దిశగా పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నిరంతరం అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోను, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోను, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కొబ్బరిని వాణిజ్య పంటగా పండిస్తుంటారు. కొబ్బరి బొండం నీరు వినియోగం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవడం, డిమాండ్‌ కూడా అధికం కావడంతో కొబ్బరి సాగు చేయడం పట్ల రైతులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారనే చెప్పాలి. కొబ్బరి తోటలు అంతర పంటల సాగుకు కూడా అనువుగా ఉండడంతో రైతులకు మరింత లాభదాయకంగా ఉంటోంది.ఇప్పటికే రైతులు అనేక రకాల కొబ్బరి మొక్కలు, చెట్లను పెంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పొడుగు, పొట్టి రకాలతో పాటు సంకరజాతి కొబ్బరి రకాలను కూడా రైతులు విరివిగా సాగుచేస్తున్నారు. అయితే.. కొబ్బరి సాగు చేయాలనుకునే రైతులు తమ తమ ప్రాంతాల్లోని భూమి తీరును బట్టి ఏయే రకాలు మరింత ఎక్కువ దిగుబడి ఇస్తాయో ముందుగా నిపుణుల నుంచి సూచనలు సలహాలు తీసుకుని సాగుచేస్తే మరింత లాభదాయకమని అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కొబ్బరిని వాణిజ్య పరంగా సాగుచేసే రైతులు ప్రధానంగా పొడుగు రకాలనే సాగుచేస్తారని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.రామానందం చెబుతున్నారు. అలా ఆంధ్రప్రదేశ్‌ లోని కొబ్బరి సాగులో 85 శాతం పొడుగురకాలుగా పిలుచుకునే ఈస్ట్‌ కోస్ట్‌ టాల్‌, డబుల్ సెంచరీ, కీరబస్తారు, కల్ప ప్రతిభ రకాలను వేస్తున్నారని వివరించారు. ఈ పొడుగు రకాల కొబ్బరి చెట్టును నాటిన ఐదారు ఏళ్లలో కాపు కాయడం మొదలవుతుందని, అప్పటి నుంచి రెండేళ్లలో పంట దిగుబడి స్థిరీకరణ అవుతుందన్నారు. అలాగే పొడుగు రకం చెట్టు నుంచి సగటున 100 నుంచి 120 వరకు కొబ్బరికాయలు దిగుబడి వస్తుందని వెల్లడించారు. అంబాజీపేట పరిశోధనా స్థానం రూపొందించిన డబుల్‌ సెంచరీ రకం కూడా ఆంధ్ర ప్రాంతంలో సాగుకు అనువైన రకం అని చెప్పారు. అలాగే కీరబస్తారు, కల్ప ప్రతిభ రకాలు ఆంధ్రప్రదేశ్‌ లో పండించడానికి అనువైనవిగా గుర్తించామన్నారు.ఇక పొట్టి కొబ్బరి రకాల చెట్ట నుంచి వచ్చే కాయలను అధికంగా బొండాల కోసం వినియోగిస్తారని డాక్టర్‌ రామానందం వివరిస్తున్నారు. పొట్టి కొబ్బరిలో గంగా బొండం చాలా ప్రధానమైనది. అలాంటి గంగాబొండం రకంలోనే మరింత ఎక్కువ దిగుబడి ఇచ్చే విధంగా అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానంలో కొత్తగా ఎక్కువ దిగుబడి, అధిక పోషకాలు ఉండేలా ‘గౌతమి గంగా’ అనే రకాన్ని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. గౌతమి గంగా కొబ్బరి మొక్కను నాటిన మూడు నాలుగేళ్లలోనే కాపు కాస్తుందని ఆయన తెలిపారు. గౌతమి గంగా కొబ్బరి చెట్టు నుంచి ఏడాదికి సగటున 80 నుంచి 100 కాయల వరకు దిగుబది వస్తుందని చెప్పారు. గౌతమి గంగా బొండంతో పాటుగా చౌగట్‌ ఆరెంజ్‌ డ్వార్ఫ్‌ కూడా బొండంగానే ఎక్కువగా వినియోగం అవుతుందని డాక్టర్‌ రామానంద్‌ పేర్కొన్నారు. పొట్టి రకమైన చౌగట్‌ ఆరెంజ్‌ డ్వార్ఫ్‌ కొబ్బరి బొండం మన దృష్టిని ఆకర్షించేలా నారింజ రంగులో ఉంటుంది. మలియన్‌ ఎల్లో డ్వార్ఫ్‌ రకం కూడా పొట్టిదే అని ఇది కూడా బొండంగానే ఎక్కువగా పనికొస్తుందని చెప్పారు.తర్వాత పొడుగు- పొట్టి కొబ్బరి రకాలతో సంకరం చేసిన రకాలను కూడా తమ పరిశోధనా స్థానంలో రూపొందించామని డాక్టర్‌ రామానంద్‌ పేర్కొన్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ టాల్‌ ని తండ్రి చెట్టుగాను. గంగాబొండం రకాన్ని తల్లి చెట్టుగా ఉపయోగించి ‘గోదారి గంగ’ పేరుతో రూపొందించి, రైతులకు సాగు కోసం అందజేసినట్లు వెల్లడించారు. గోదారి గంగ కొబ్బరి మొక్క కూడా త్వరగా కాపు కాస్తుంది. ఈ మొక్క నుంచి ఏడాదికి 140 కాయల దాకా దిగుబడి ఇస్తుంది. గోదారి గంగ కొబ్బరి చెట్టు 20 నుంచి 40 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. త్వరగా కాపు రావడంతో పాటు అధిక దిగుబడి ఇచ్చే రకం కనుక గోదారి గంగ రకాన్ని సాగు చేసేందుకు రైతులు మరింత ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు.అయితే.. ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడి ఇచ్చే కొబ్బరి చెట్ల పెంపకంలో ముందుగా మొక్కలను ఎంపిక చేసుకోవడం అత్యంత ప్రధానం అని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షేత్రంలో మనం నాటుకునే మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంటే.. దిగుబడులు అంతే అధికంగా ఉంటాయని అంటున్నారు. తూర్పు కోస్తా తీరం వెంబడి గోదారి గంగా బొండం సాగుకు రైతుల నుంచి మంచి డిమాండ్ ఉందంటున్నారు. ఒకవేళ రైతులు ఎవరైనా సొంతంగా హైబ్రీడ్‌ రకాలను తయారు చేసుకోవాలని ముందుకు వస్తే.. వారికి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రామానంద్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here