కోటి ఔషధాల పెట్టు కొబ్బరిచెట్టు అంటారు. కొడుకును నమ్మితే ఏముంది? కొబ్బరిచెట్టును నమ్ముకుంటే జీవితం సాగిపోతుందని పూర్వపు సామెత. కొబ్బరిచెట్లు కోస్తా జిల్లాలలోనూ ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి. వందేళ్లు వచ్చే వరకు కొబ్బరిచెట్టు నెలనెలా ఆదాయం ఇస్తూనే ఉంటుంది.బలహీనంగా ఉన్న వారికి కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి కొబ్బరి నీళ్లు. దాహం తీర్చే ద్రవాలలో కొబ్బరినీటికి ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్‌, పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలు లభిస్తాయి. సులభంగా జీర్ణం అయ్యే కొబ్బరినీళ్లను నెల రోజుల శిశువులకు కూడా పట్టించవచ్చు. కొబ్బరినీటిలో ఎలక్ట్రోలిటిక్‌ ఉంటుంది. మూత్రం ధారాళంగా వెళ్లేందుకు కొబ్బరినీళ్లు చక్కగా పనిచేస్తాయి. చీమురక్తం, శూలవల్ల కలిగే పేగు మంటలను ఇది చల్లారుస్తుంది. వాంతులు, తలతిరుగుడును కొబ్బరినీళ్లు ఆపుచేస్తాయి. కలరా వ్యాధికి కొబ్బరినీరు మంచి విరుగుడు అంటారు వైద్యులు. కొబ్బరిని బెల్లంతో కలిపి తింటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని అనుభవజ్ఞులు చెబుతారు.కొబ్బరినీరు రోగనిరోధక శక్తి పెంచుతుంది. లివర్‌ను కొబ్బరినీరు ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇలా ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాల గనిగా కొబ్బరి ప్రసిద్ధి. కొబ్బరిని పూజా ద్రవ్యాలలో బెస్ట్‌ అని చెబుతారు. ఆహారంలో కొబ్బరి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ బాగా ముదిరిన తర్వాత దాన్నుంచి నూనె వస్తుంది. అయితే.. కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉన్నవారు కొబ్బరిని తినకూడదని అంటారు. ఎన్నో ఉపయోగాలున్న కొబ్బరిని సాగు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ముందుకు రాకపోవడం విచిత్రం.తెలంగాణలో కూడా కొబ్బరి పంట సాగు చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చారు హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం చౌళ్లపల్లి ఔత్సాహిక రైతు గట్టు రవీందర్‌రెడ్డి. పత్తి, మొక్కజొన్న ఇతర ఏ పంటలకైనా కూలీల కొరత ఇబ్బందిగా మారిందన్నారాయ. అందుకే కొబ్బరి సాగువైపు మొగ్గుచూపినట్లు రవీందర్‌రెడ్డి చెప్పారు. కూలీల సమస్య నుంచి తప్పించునేందుకు దీర్ఘకాలిక పంటగా కొబ్బరి సాగుచేస్తున్న పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసినప్పుడు డీజయ్‌ సంపూర్ణ రకం కొబ్బరి సాగు అనుకూలంగా ఉంటుందని భావించినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ దగ్గర డీజయ్‌ సంపూర్ణ రకం కొబ్బరిమొక్కలు నర్సరీ చేస్తున్న మదర్‌ ఫార్మ్‌ను సందర్శించినట్లు తెలిపారు. అక్కడ డీజయ్‌ సంపూర్ణ సాగు విధానం నచ్చి తాను 2023 జులైలో మొక్కలను తమ క్షేత్రంలో నాటినట్లు తెలిపారు.డీజయ్‌ సంపూర్ణ రకం కొబ్బరికాయలను వాటర్‌ కోసం అమ్మవచ్చని రవీందర్‌రెడ్డి చెప్పారు. ఈ రకం కొబ్బరికాయలో 500 నుంచి 750 మిల్లీ లీటర్ల నీరు ఉంటుంది. కొబ్బరి నీటికి డిమాండ్ లేకపోతే ముదిరిన తర్వాత కొబ్బరి కాయగా విక్రయించవచ్చన్నారు. కొబ్బరి కాయకు కూడా డిమాండ్ లేదంటే ఎండిన తర్వాత నూనె ఎక్కువగా వస్తుంది కాబట్టి అలా కూడా సేల్  చేసుకోవచ్చన్నారు. డీజయ్‌ సంపూర్ణ కొబ్బరి చెట్టు ఏడాదికి 200 నుంచి 250 కాయలు దిగుబడి ఇస్తుందని నర్సరీ నిర్వాహకులు చెప్పారన్నారు. ఏడాదికి 200 కాయలు వచ్చినా లాభసాటిగా ఉంటుందన్నారు రవీందర్‌రెడ్డి.మొక్కల మధ్య, వరసల మధ్య 25X25 అడుగుల దూరంలో కొబ్బరి మొక్కలు నాటితే ఎకరంలో 75 మొక్కలు వేయొచ్చన్నారు. అంతకంటే దగ్గరగా మొక్కల్సి నాటితే చెట్టు ఎదిగినప్పుడు ఒకదాని ఆకులు మరొక చెట్టు ఆకుతో రాసుకుని, ఫ్లవరింగ్ తగ్గుతుందని చెప్పారు. మొక్కలు నాటే సమయంలో కంపెనీ వ్యక్తి వచ్చి పర్యవేక్షిస్తారని రవీందర్‌రెడ్డి అన్నారు. ఎకరంలో పెట్టిన 75 మొక్కలు ఒక్కో మొక్క నుంచి 200 కాయలు వేసుకుంటే 15 వేల కాయలు ఏడాదికి దిగుబడి వస్తుందనే తాను కొబ్బరి సాగుకు ముందుకు వచ్చానన్నారు. పొలం వద్దే ఒక్కో కొబ్బరి బొండాన్ని రూ.20కి అమ్మితే చెట్టుకు రూ. 4 వేలు వస్తుందని, 75 చెట్ల నుంచి ఏడాదికి రూ.3 లక్షలు వస్తుందన్నారు. ఏడాదిలో లక్ష నుంచి లక్షా 50 వేలు పెట్టుబడిగా తీసేసినా లక్షన్నర మిగలడం ఖాయం అన్నారు. ఎకరానికి 75 ప్రకారం 8 ఎకరాల్లో రవీందర్‌రెడ్డి కొబ్బరిమొక్కలు నాటారు.నర్సరీలో ఒక్కో డీజయ్‌ సంపూర్ణ కొబ్బరి మొక్క రూ.750 రూపాయలకు వచ్చిందని రవీందర్రెడ్డి తెలిపారు. కొబ్బరి మొక్కలను వైరస్ నుంచి కాపాడేందుకు, మొక్క బాగా ఎదిగేందుకు కల్పారామం అనే కిట్‌ను నర్సరీ వారు ఇస్తారన్నారు. ఒక కిట్‌ 20 మొక్కలకు వస్తుందన్నారు. ఒక్కో చెట్టుకు కిట్ ఖరీదు రూ.50 ఉంటుందని చెప్పారు. కొబ్బరి మొక్క నాటేందుకు 3X3 అడుగుల లోతు, వెడల్పు గుంత తప్పకుండా తీయాలి. మొక్కను నాటే ముందు పశువుల ఎరువు, వేపపిండి, కొద్దిగా సూపర్ ఫాస్పేట్‌ కలిపి గుంతను నింపాలన్నారు. గుంతలో మొక్క ఆకు మొదలు కొద్దిగా పైకి కనిపించేలా నాటుకోవాలి. గుంతలో మొక్క ఆకుల మొదలు కప్పేసేలా నాటితే కుళ్లిపోయే ప్రమాదం ఉందని, చెట్టు ఎదుగుదల మందగిస్తుందన్నారు. ఒక్కో గుంతను జేసీబీతో తీయిస్తే దానికో రూ.50 అవుతుంది. అంటే మొక్క ఖరీదు రూ.750+ కిట్‌కు మరో రూ.50, గుంత తీసే ఖర్చు మరో రూ.50, దుక్కి దున్నడం అంతా కలిపి రూ.900 నుంచి రూ.950 పెట్టుబడి అవుతుందన్నారు. మొక్కల రవానా సహా మొక్కకు ఎక్కువలో ఎక్కువగా వెయ్యి రూపాయలు అనుకున్నా ఎకరానికి రూ.75 వేలు ఖర్చు వస్తుంది.ఒక్కో మొక్కకు ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ కోసం నర్సరీ వాళ్లే యూరియా, పొటాష్‌, సూపర్ ఫాస్పేట్‌ ఇస్తారన్నారు. దానికి ఏడాదికి ఒక చెట్టుకు రూ.75 అవుతుందని చెప్పారు. మెగ్నీషియం, సల్ఫేట్‌, జింక్‌, బోరాన్‌ లాంటి మైక్రో ఆర్గానిక్స్‌నూ వారే సరఫరా చేస్తారన్నారు. ఏ నెలలో ఏది వాడాలో నర్సరీ వాళ్లే క్రమం తప్పకుండా మెసేజ్‌ ద్వారా సూచిస్తారన్నారు. అప్పుడప్పుడు కంపెనీ వారు వచ్చి క్షేత్రాన్ని పరిశీలించి, బీటిల్‌ పురుగులాంటి సమస్య ఏదైనా కనిపిస్తే తగిన సూచనలు ఇస్తారని రవీందర్రెడ్డి చెప్పారు. ఒకవేళ వాళ్లు రాలేకపోతే.. ఫొటో తీసి పంపించినా ఏమి చేయాలో చెబుతారు. కొబ్బరి మొక్కను బీటిల్ పురుగు ఆశించకుండా ఉండాలంటే ఆకు మొదళ్లలో కొద్దిగా గడ్డ ఉప్పు వేసినా లేదా నాప్తాలిన్‌ ఉండలను చిన్న వస్త్రంలో చుట్టి ఆకుకు కట్టినా రాకుండా ఉంటాయి. బీటిల్ పురుగులు కొబ్బరిమొక్కకు చేసిన రంధ్రంలో మోనోక్రోటోఫాస్‌ కానీ, క్లోరోఫైరిపాస్‌ గానీ పోసి, రంధ్రం మూసేస్తే సరిపోతుంది.రవీందర్‌రెడ్డి సాగు చేస్తున్న డీజయ్‌ సంపూర్ణ కొబ్బరి చెట్టు 35 ఏళ్ల వరకు నెలనెలా దిగుబడి ఇస్తూనే ఉంటుంది. దీని మొదలు మూడు అడుగుల ఎత్తు పెరిగినప్పటి నుండే కాయలు కాస్తుంది. పదేళ్ల వరకు ఒక స్టూల్ వేసుకుని కొబ్బరికాయలు తెంపుకునేలా చెట్టు ఉంటుంది. కొబ్బరి చెట్టు బాగా పొడవు అయితే కాయలు దింపేందుకు ఇంత అని రేటు ఉంటుంది. డీజయ్‌ సంపూర్ణ రకానికి అలా అయ్యే ఖర్చు కూడా మిగులుతుందని రవీందర్‌రెడ్డి వివరించారు.కొబ్బరి మొక్కలు నాటిన తర్వాత అంతర పంటగా మొక్కజొన్న వేశారు రవీందర్‌రెడ్డి. అందుకు నీరు నేల అంతా తడిసేలా సరఫరా చేయాలి. ఇలా నీటిని పారించినప్పుడు కొన్ని కొబ్బరి మొక్కల మొదళ్ల వద్ద మట్టి పోగుపడి కొన్నింటి మొవ్వు కుళ్లినట్లు చెప్పారు. నర్సరీ వారికి ఈ విషయం చెబితే అరలీటర్‌ బ్లైటాక్స్ కలిపి మొక్క మొదళ్లకు పోయమన్నారని అన్నారు. తర్వాత ఆ చెట్లు మళ్లీ చిగురించాయన్నారు. పూర్తిగా చనిపోయిన మొక్కలను తీసేసి కొత్త వాటిని పెట్టినట్లు చెప్పారు. డీజయ్‌ సంపూర్ణ కొబ్బరి మొక్కలకు మూడేళ్ల నుంచి పూత మొదలవుతుంది. చెట్లకు తొలిసారి వచ్చిన పూతను తీసేయాలని నర్సరీ వారు సలహా ఇచ్చారన్నారు. పూతను అలాగే ఉంచేస్తే చెట్టు పెరుగుదల తగ్గుతుందని చెప్పారన్నారు.. పూత వచ్చిన ఆరు నెలల్లో కాయ తయారవుతుంది.తెలంగాణలో కొబ్బరి సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదు. అయితే.. పనికి ఆహారం పథకం కింద కూలీలను పంపి మొక్కలకు గుంతలు తీయిస్తుందని రవీందర్‌రెడ్డి చెప్పారు. కొబ్బరితోటకు డ్రిప్‌ వేసుకుంటే రూ.75 వేలు వరకు ఖర్చవుతుంది. డ్రిప్‌ ఇరిగేషన్ వల్ల కొబ్బరి మొక్క మొదలు చుట్టూ భూమి మెత్తబడి ఎరువులు, పోషకాలను సులువుగా గ్రహిస్తుంది. అదే.. నీటిని తోట మొత్తం పారిస్తే.. మొత్తం భూమి అంతా నానుతుంది. డ్రిప్‌ ద్వారా ఒక్కో మొక్కకు రోజుకు 56 లీటర్ల నీరు ఇస్తే సరిపోతుంది. కొబ్బరి కాపు మొదలైనప్పుడు 75 లీటర్ల దాకా నీరు ఇవ్వాల్సి ఉంటుంది.

కొబ్బరి మొక్కలు నాటిన భూమిలో రెయిన్ డ్రిప్‌ వేసుకుని ఉల్లి కానీ పల్లీ గానీ అంతర పంటగా వేసుకుంటే మధ్య మధ్యలో ఆదాయం వస్తుంది. ఉల్లి, పల్లీ తక్కువ ఎత్తు పెరుగుతాయి కాబట్టి ప్రధాన పంటకు ఇబ్బంది ఉండదు. ఉల్లి, పల్లి సాగుతో అనవసర గడ్డి పెరిగే ఛాన్స్‌ ఉండదు. మరో అంతర పంటగా పెసర వేయొచ్చు. పెసర పంట కోసిన తర్వాత పచ్చిరొట్టగా ఉండగానే దున్నేస్తే.. కొబ్బరి తోటకు బలంగా పనికొస్తుంది.

కొబ్బరితోట ప్రారంభంలో పెట్టుబడి కాస్త ఎక్కువే ఉంటుంది. ఎకరానికి లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడేళ్ల వరకు రాబడి కోసం వేచి ఉండాలి. అయితే.. అంతర పంటలు సాగుచేసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. సొంత డబ్బులతో కొబ్బరి సాగుచేస్తే మంచిదే అన్నారు రవీందర్‌రెడ్డి. అప్పు చేసి, కొబ్బరి సాగు చేస్తే కాస్త ఇబ్బంది తప్పదు. ప్రభుత్వం మొక్కలు సరఫరాచేసి, సబ్సిడీ ఇస్తే.. సన్న చిన్నకారు రైతులు కూడా తెలంగాణలో కొబ్బరి సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.