వంకాయకూర రుచి చూడని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ‘వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భామామణియున్‌, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైరి వంటి రాజును, భారతం వంటి కథ ఉండవ’ని ఒక నానుడు ఉంది. అలాగే వంకాయతో వెయ్యి రకాలు అనే నానుడి కూడా పూర్వకాలం నుంచీ ఉంది. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు, కీలకమైన పోషకాలు బాగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్‌ ఫైటో న్యూట్రియెంట్‌ ను న్యాసునిన్‌ అంటారు. వంకాయను ఆహారంగా తిన్నవారికి వంకాయ పొట్టులోని ఆంథోసియానిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తుందని వైద్యులు చెబుతారు. మన శరీరంలో ఎక్కువై ఇనుమును వంకాయ తొలగిస్తుందని, ఫ్రీరాడికల్స్‌ ను నిరోధిస్తుందని, రక్తంలో కొలెస్ట్రాల్‌ కణాలు దెబ్బతినకుండా నిరోధించడం ద్వారా క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుందని, కీళ్లు దెబ్బతినకుండా రక్షిస్తుందని, కొలెస్ట్రాల్ నిల్వలను  తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతారు. అంతే కాకుండా పర్పుల్‌ కలర్‌ లో ఉండే వంకాయల్నిఆహారంగా తీసుకుంటే.. మధుమేహ రోగులకు మేలు చేస్తుందని డాక్టర్‌ సీఎల్‌ నరసింహారావు వివరించారు.

ఇన్ని విశేషాలతో నిండి ఉన్న వంకాయలు మన తోటలు, టెర్రస్‌ మీద మొక్కలకు మరింత ఎక్కువగా కాయాలంటే కొన్ని పద్ధతులు అవలంబించాలని వంగపంటలో మంచి అనుభవం సంపాదించిన యువరైతు సంపత్‌ వివరిస్తున్నారు. అన్ని సీజన్లలోనూ పండించుకునేందుకు వీలైనది వంకాయ. అయితే.. ఎండాకాలంలో కొంచెం దిగుబడి తగ్గుతుందని ఆయన చెబుతున్నారు.వంగపంట పండించాలనుకునేవారు ముందుగా నారు పోసుకోవాలి. వంగవిత్తనాలు నేలలో వేయొచ్చు. చిన్న, లేదా పెద్ద కుండీల్లో కూడా చల్లి వంగనారును పెంచుకోవచ్చని సంపత్‌ తెలిపారు. కుండీల్లో కాస్త మట్టి, మరికాస్త కొబ్బరిపొట్టు కలిపి వంగ విత్తనాలు చల్లుకుంటే ఏడు నుంచి పది రోజుల్లో మొలకలు వస్తాయి. కొన్ని రకాల వంగ విత్తనాలు మొలకెత్తడానికి పదిహేను రోజులు కూడా పట్టొచ్చని ఇప్పటికే వంగపంటలో మంచి అనుభవం ఉన్న సంపత్‌ వివరిస్తున్నారు. అయితే.. వంగ విత్తనాలు మొలకెత్తాలంటే ఎండలో పెట్టాలని, నీడలో పెడితే మొలకలు రావని చెబుతున్నారు. మొలక కనిపించినప్పటి నుంచి వంగనారును ఎండలో పెట్టాలి. అప్పుడే వంగనారు ఎదుగుదల బాగా ఉంటుందని అంటున్నారు. కొంచెం పెద్ద కుండీలో వంగనారును నాటుకుంటే మొక్క బాగా ఎదుగుతుందని, పంట దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఒక కుండీలో ఒక మొక్కను నాటుకుంటే మొక్క బాగా పెరుగుతుందని, పంట కూడా మరింత బాగా ఉంటుందంటున్నారు. చిన్న కుండీలో వేసిన వంగమొక్కలు కొద్దికాలమే ఉంటుందని, కాయలు కూడా తక్కువ కాస్తాయంటున్నారు. పెద్ద కుండీలో వేస్తే.. ఏడాదికి మించి కూడా మొక్క బతుకుతుందని, పెద్దగా ఎదిగి ఎక్కువ కాపు కాసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వంగమొక్కను నాటుకునే ముందే పోషకాలతో కూడిన మట్టిని బాగా కలిపి ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మట్టిలో ఉండే ఎరువు, కొబ్బరి పొట్టు పాటు వేపపిండి, ఆవాల పిండి, బోన్ మీల్‌ సమాన పాళ్లలో కలిపితే వంగమొక్కలు మరింత ఎత్తుగా, ఏపుగా ఎదుతాయి. పంట దిగుబడి కూడా అంతే ఎక్కువగా వస్తుంది. రెండు మూడు రకాల వంగమొక్కల్ని పక్కపక్కనే పెంచితే వాటికి క్రాస్ పాలినేషన్‌ జరిగిపోయి కాయలు వాటి అసలు రూపం కోల్పోయి సంకరజాతి కాయలు కాస్తాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అందుకే వేర్వేరు రకాల వంగమొక్కల కుండీల్నీ వేర్వేరుగా ఉంచి పెంచుకుంటే మంచిదని అంటున్నారు. లేదంటే.. వాటి డీఎన్‌ఏ మారిపోయి, మనం వేసుకున్న రకం వంకాయలు కాకుండా సంకరజాతి వంకాయలు కాస్తాయని, అవి ఏ రకానికి చెందినవో చెప్పడం కష్టం అవుతుందని చెబుతున్నారు.వంగమొక్కలకు ప్రూనింగ్‌ ఎక్కువగా చేయకూడదనే సూచన ఒకటి నిపుణులు చేస్తున్నారు. వంగమొక్క కుండీ అంచుల్ని తాకుతూ ఉంటే కింది భాగంలోని కొమ్మలను కొద్దిగా కత్తిరించుకుంటే.. గాలి, వెలుతురు మొక్కకు బాగా వస్తుందని, మొక్కకు కాయలు వచ్చిన తర్వాత పెద్ద ఆకులను కట్‌ చేసుకుంటే దాని కాయలకు కూడా గాలి వెలుతురు సమృద్ధిగా అంది మరింత పెద్దగా కాయ తయారవుతుందని చెబుతున్నారు. పెన్నాడ వంకాయ రకం మొక్కకు కాయలు చాలా ఎక్కువగా కాస్తాయి. దాంతో వాటి బరువుకి మొక్క కిందికి వంగిపోతుంది. అందుకే పెన్నాడ రకం వంగమొక్కకు ఆధారంగా ఏదైనా ఒక కర్రను మొక్కకు దగ్గరగా మట్టిలో గుచ్చి, దానికి కట్టి ఉంచాలి.ఇక వంగమొక్కకు పూత రాలిపోవడం అనేది చాలా మంది నుంచి వస్తున్న ఫిర్యాదు. మొక్కకు నీటి సదుపాయం తక్కువ చేయడం లేదా ఎక్కువ కావడం వల్ల వంగపూత రాలిపోతుంది. సాధారణంగా పాటింగ్‌ మిక్చర్‌ లో కలిపి పెట్టే పోషకాలే వంగమొక్కకు సరిపోతాయి. ఆ పోషకాలతో రెండు మూడు సార్లు కాయదిగుబడి వస్తుంది. వంగమొక్క మూడు నాలుగు కాపులు కాసిన తర్వాత మొదట వచ్చినంత ఎక్కువ దిగుబడి రాదు. అలాంటప్పుడు కుండీలోని మట్టిని కదిపి, వర్మీ కంపోస్ట్‌, ఆవు పేడ, జిప్సమ్‌ సాల్ట్‌, ఆవాల పిండి అన్నీ కలిపి, చెట్టుకు గుప్పెడు చొప్పున వేస్తే పోషకాలు బాగా అందుతాయి. మొక్కలు మళ్లీ యధావిధిగా ఎదుగుతాయి. పూత కూడా ఎంతో బాగా వస్తుంది. దాంతో పాటు పూత కూడా రాలిపోకుండా ఉంటుంది. వంగ పూత రాలిపోకుండా చేయాలంటే మన ఇంట్లో నిల్వ ఉండి, పురుగులు వచ్చిన గుప్పెడు బియ్యం ఒక్కో కుండీలో మట్టిపైన పోయాలి. కుండీలో నీరు పోసినప్పుడు బియ్యం నాని దాని సారం మెల్లిమెల్లిగా కుండీలోని మట్టిలో ఇంకుతుంది. బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకు పోస్తే ఎంతబలంగా ఎదుగుతాయో చాలా మందికి తెలిసే ఉంటుంది.వంగమొక్కలు, కాయలకు పురుగుల బెడద ఎక్కువనే చెప్పాలి. అందుకే మట్టిలో ఆవాల పిండి వేసిన వంగ మొక్కలను పురుగులు ఎక్కువగా పట్టవు. వంగమొక్కలకు ఆవాల పిండి అత్యుత్తమమైన ఎరువు అని నిపుణులు చెబుతారు. ఆవాల పిండిని వంగమొక్కకు నేరుగా వాడవచ్చు. లేదా ద్రవరూపంలో కూడా వేయొచ్చు. ఆవపిండి నేరుగా మొక్క మొదట్లో కాకుండా కుండీ అంచు దగ్గరలో చిన్న గాడిలా పెట్టి దాంట్లో వేసి, మట్టితో కప్పెట్టాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఆవపిండి ఉపయోగం ఉంటుంది. ద్రవరూపంలో వేస్తే వెంటనే దాని ఫలితం కనిపిస్తుంది. వంగపూత రాలిపోవడం చాలావరకు తగ్గిపోతుంది.వంగమొక్కకు కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగులు సాధారణంగా వస్తుంటాయి. ఇవి వానాకాలం, చలికాలంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని రకాల సీతాకోక చిలుకలు, రెక్కల పురుగులు వంగమొక్కల ఆకులపై గుడ్లు పెడుతుంటాయి. అవి లార్వాలుగా మారి, రోజంతా మట్టిలో ఉండి రాత్రయ్యేసరికి మొక్కపైకి వచ్చి ఆకులు, కాయలను తింటూ ఉంటాయి. అయితే.. ఆవాల పిండి వేసిన వంగ చెట్లకు కాయ, కాండం తొలిచే పురుగు బెడద అంతగా ఉండదనే చెప్పాలి. ఆవాల పిండిని ఒక బకెట్‌ లో వేసి, నీళ్లు కలిపి నాలుగు రోజులు అలాగే ఉంచి, తర్వాత దాన్ని ఒక లీటర్‌ ద్రావణంలో నాలుగు లీటర్ల నీరు కలిపి వంగమొక్కకు పిచికారి చేసుకోవచ్చు. లేదా ముందు చెప్పుకున్నట్లు కుండీ అంచు దగ్గరగా వేసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. అప్పటికీ రాత్రిపూట ఇంకా కొన్ని పురుగులు ఆకులు, కాయలపై కనిపిస్తుంటే.. చేత్తో ఏరి పారేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. వంగమొక్కకు మరో ఇబ్బంది ఏంటంటే మీలిబగ్స్‌. అవి వచ్చినప్పుడు పుల్ల మజ్జిగ మొక్కకు స్ప్రే చేసుకోవాలి. మొక్కను ఆశించే అన్ని రకాల పురుగులకు ఆయిల్ ఎమర్సన్ ఉత్తమమైన కీటక నాశనిగా పనిచేస్తుంది. దాన్ని కూడా అప్పుడప్పుడూ స్ప్రే చేస్తూ ఉంటే పంట దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వంగమొక్క మొదట్లో మొలిచే కలుపును ఎప్పటికప్పుడు తీసేయాలి. అప్పుడే వంగ పంట మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here