తరతరాల నుండి తాత ముత్తాతల ద్వారా మనకు లభించిన వంగడాలను కాపాడుకోవాలన్న తపన క్రమంగా బలపడుతోంది. కర్ణాటక రైతులు అలా వందలాది వరి వంగడాలను సంరక్షించారు. దేశీ రకాలనే కాకుండా విదేశీ రకాలకు చెందిన విత్తనాలను వారు సేకరించి కాపాడుతూ వస్తున్నారు.తత్ఫలితంగా, కర్ణాటకలోని వరి పొలాలు పంటల కాలంలో విభిన్నమైన వర్ణాలతో అలరారుతుంటాయి.వాటిలో ప్రధానమైంది నలుపు వరి బియ్యం.
శివమొగ్గనే తీసుకుందాం.అక్కడి సేంద్రియ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (OFRC) నల్ల బియ్యం పునరుజ్జీవనానికి విశేషంగా కృషి చేస్తోంది. ఈశాన్య భారతదేశానికి చెందిన నల్ల బియ్యం ఇతర ప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందుతోంది. ఇది ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లలో విస్తృతంగా సాగు చేయబడుతోంది. ఏపీ, తెలంగాణల్లో కూడా కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా నల్ల బియ్యం సాగు జరుగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో ఈ బియ్యం ప్రధాన ఆహారంగా వినియోగించబడుతోంది. ఈ రకం వరి వంగడం చైనా సామ్రాజ్యం కొనసాగిన రోజుల్లో ఉద్భవించిందని భావిస్తున్నారు. పూర్వం రాజ కుటుంబాలు మాత్రమే దీనిని వినియోగించాయని చరిత్ర ద్వారా తెలుస్తోంది. నిజానికి ఈ నల్లబియ్యం రకాలు ఇండియా నుండే బౌద్ధభిక్షువుల ద్వారా చైనాకు చేరి ఉండవచ్చు.
కరి ముండుగా, కరింగెల్లు, కరి జెడ్డూ, నవరాదంత అన్నవి నల్ల బియ్యానికి చెందిన ముఖ్యమైన రకాలు. ఈ రకాల బియ్యం ఒకింత ఎక్కువ బరువు ఉంటుంది. దీని ఊక నల్లగా ఉండగా, బియ్యం మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. కరిగజోవోలి, కగిసాలే, కాలాజీరదంత వరిరకాలకి చెందిన ఊక లేదా పొట్టు ముదురు నలుపు, కాగా బియ్యం మాత్రం తెల్లగా ఉంటాయి. ఇవి సువాసనతోనూ కూడి ఉంటాయి.

ఊదారంగు రకం వరి

OFRC మొత్తం 248 స్థానిక వరి వంగడాలను మడులలో సాగు చేస్తోంది.వాటిలో 20 రకాలు నల్ల బియ్యానికి చెందినవి. దంబరసాలి, నజరాబాద్ రకాల ఆకులు వరి పొలాల్లో అగ్నిజ్వాలల్లా ముదురు గోధుమ రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. ధాన్యం బంగారు రంగులో ఉంటుంది. వరిని పోలి ఉండే గండుభట్ట అనేది వరి పొలాలలో పెరిగే ఒకానొక కలుపు మొక్క. ఇది వరి చేలలో పెరిగి పంటను దెబ్బతీస్తుంది. అయితే పువ్వులు వచ్చే వరకు దీని ఉనికిని గమనించడం కష్టం. ఈ సమస్యకు పరిష్కారంగా సోరాబ్, సాగర్ చుట్టుపక్కల రైతులు ఒక పద్ధతిని అనుసరిస్తారు. వారు నైరెమిడా అనే నల్ల బియ్యం రకాన్ని పెంచుతారు. గండుభట్ట రంగు ఆకుపచ్చగా ఉంటే నైరెమిడా నలుపు రంగులో ఉంటుంది..దీంతో రైతులకు గండు భట్టాను గుర్తించి కలుపు తొలగించడం తేలిక అవుతుంది.ఇక కొన్ని రకాల నల్ల బియ్యం యొక్క విశిష్టత ఏమిటంటే, దాని మూలాలు, కాండం, ఆకులు అన్నీ నల్ల రంగులోనే ఉంటాయి. మణిపూర్‌లోని చక్-హవో, తమిళనాడులో కరాపు కవాని, మహారాష్ట్రలోని కాలాబట్, మహారాష్ట్రలోని కాలాభటి, ఒడిశాలోని కాలాబటి ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లోని బర్మా బ్లాక్ నల్లబియ్యానికి చెందిన ప్రముఖ రకాలు. ఈ రకాలు అన్నీ కర్ణాటక OFRC వరి మడులలో లభిస్తాయి. ఇవన్నీ ఇక్కడ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయబడుతున్నాయి. వీటిలో కాలబటి రకానికి చెందిన ఊక ఊదా రంగులో ఉండగా, బియ్యం నల్లగా ఉంటుంది. చక్-హావో ఆకులు, ఉక లేత నలుపు రంగులో ఉంటాయి. ఈ రకానికి చెందిన బియ్యం రంగులో ముదురు నలుపు. కాగా, బర్మా బ్లాక్ రకం మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి, బియ్యం నల్లగా ఉంటుంది. ఈ రకమైన బియ్యం జిగురుతో ఉండి మంచి వాసన కలిగి ఉంటుంది. ఈ రకాలను ఉపయోగించి తయారు చేసే తీపి వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రకాలు ఎంతో సుగంధమైనవి కాబట్టి వంటలలో ఏలకులు జోడించాల్సిన అవసరం ఉండదు.
నల్ల బియ్యానికి మంచి డిమాండ్ ఉందని రైతు ఉత్పత్తి సంస్థ సహజ ఆర్గానిక్స్ (Sahaja Organics) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమేశ్ చెప్పారు. బెంగళూరు సేంద్రియ దుకాణాల్లో ఒక కిలో నల్ల బియ్యం రూ. 200 కు అమ్ముతున్నారు. దీంతో రైతులకు మంచి ధర లభిస్తోంది.. మాండ్యాలోని సేంద్రియ రైతు కృష్ణ గత కొన్నేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా నల్ల బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. బెలగావిలో శంకర్ లంగాటి గత రెండు దశాబ్దాలుగా నల్ల రకాలను సాగు చేస్తున్నారు. పంట ఏపుగా పెరిగినప్పుడు పొలం కళాత్మకంగా కనబడే విధంగా విత్తనాలను విత్తడం ఆయన ప్రత్యేకత.

ఇక నల్ల బియ్యంలో అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. నల్ల బియ్యంలో విటమిన్ బి, ఇ,, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలలో తేలింది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. నల్ల ధాన్యాలు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. ఇవి ఎంజైమ్‌లను నిర్విషీకరణ చేస్తాయి. నల్ల రకాలను ప్రత్యేకించి తీపి వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. నల్ల బియ్యం క్యాన్సర్ కణాలను (apoptosis) నిర్మూలిస్తుంది. ఇది శోథ లేదా వాపు నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. యాంటీ యాంజియో జెనిసిస్ ప్రభావాలను సైతం కలిగి ఉంటుంది.
నిజానికి నల్ల బియ్యంలోని anthocyanins లక్షణం వల్ల ఈ రకాలు ముదురు నలుపు లేదా ఊదా రంగును సంతరించుకుంటాయని OFRC డైరెక్టర్ ఎస్ ప్రదీప్ చెబుతున్నారు. శక్తిమతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆంథోసైనిన్స్ సమృద్ధిగా ఉండడం వల్లనే ఇవి ఆ రంగులో ఉంటాయని ఆయన వివరించారు. వాటిలోని ఔషధ గుణాల వల్ల, ఈ రకానికి మంచి డిమాండ్ ఉందనీ,. అందువల్ల, నల్ల రకాలపై పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి సారించామనీ ఆయన చెప్పారు. ప్రధానంగా కాలాబటి (Kalabati) అనే రకం నల్ల బియ్యాన్ని ఒడిశాలో పండిస్తారు. ఇది 5 నుండి 6.5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రతి వారం దాని రంగును అది మారుస్తూ ఉంటుంది. ఈ రకం వరి పంట కాలం 150 రోజులుగా ఉంటుంది.
విత్తనాలను (వడ్లను) పంపిణీ చేయడం, అవసరమైన మార్గదర్శకాలను అందించడం ద్వారా OFRC ఈ రకాలను వ్యాప్తి చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తోందని యువ శాస్త్రవేత్తలు ఎం వై ఉల్లాస్, కీర్తన్ చెప్పారు. ప్రత్యేకించి వరదలు, కరువులు సంభవించే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణాన్ని సైతం నల్ల వరి రకాలు తట్టుకుని నిలుస్తాయని శివమొగ్గ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఎం కె నాయక్ తెలిపారు. ఈ ప్రత్యేక రకాల వర్గీకరణ, పోషక విశ్లేషణలను విశ్వవిద్యాలయం చేపట్టిందని ఆయన వెల్లడించారు. వివిధ వరి రకాలలో ఉండే పోషక విలువలను గుర్తించేందుకు OFRC హైదరాబాద్‌లోని National Institute of Nutrition సహకారం కూడా తీసుకుంటోంది. కాగా, OFRCలో మంచి వరి మ్యూజియం కూడా ఉంది, ఇక్కడ సంప్రదాయ వరి రకాలు, వాటి మూలాలు, వాటి సాగు గురించిన సమస్త సమాచారం లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here