బయోచార్! అంటే కట్టెబొగ్గు. లేదా గడ్డితో తయారైన బొగ్గు. బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు. ‘జీవం ఉన్న బొగ్గు’ అని దీని అర్థం. పొడిపొడిగా ఉండే కట్టెల బొగ్గు. వందల సంవత్సరాల పాటు బయోచార్ మట్టిలో కలిసిపోయి ఉంటుంది. భూసారానికి మేలు చేసే సూక్ష్మజీవులకు పోషకాలు నిల్వ ఉంచి వాటికి అందిస్తుంది. మరీ ముఖ్యంగా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సాగునీటిలో, భూమిలోని కలిసి ఉన్న విషాలను బయోచార్ నివారిస్తుంది. చిన్న బొగ్గు ముక్కలో కూడా లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. చార్‌కోల్‌ను మట్టిలో నేరుగా వేస్తే పోషకాలను ఎక్కువగా పీల్చుకుంటుంది. అందు వల్ల బయోచార్ కంపోస్టును పొలంలో వేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. చాలాకాలం పాటు పోషకాలను మొక్కలకు అందిస్తుంది. తద్వారా పంటల నుంచి దిగుబడి బాగా పెరుగుతుంది.భూసారాన్ని పెంచే సేంద్రీయ కర్బనం మట్టిలో స్థిరంగా ఉండదు. నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచేందుకు బయోచార్ బాగా ఉపయోగపడుతుంది. రసాయనాలతో విషతుల్యంగా మారిన భూమికి మళ్లీ జీవం పోస్తుంది. పత్తి, కంది మొక్కలు, వరిపొట్టు, వరిగడ్డిని వృథాగా తగలబెట్టే బదులు వాటితో బయోచార్‌ను సులువుగా తయారు చేసి, వినియోగించే విధానాలపై స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్‌రెడ్డి పరిశోధనలు చేశారు. బయోచార్ విధానంలో 20 ఏళ్లుగా ఆయన పరిశోధనలు చేస్తున్నారు. సహజ సిద్ధంగా పెరిగే తుమ్మ లాంటి కంపచెట్లు, జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేయవచ్చని చెప్పారాయన. ఔత్సాహిక రైతులకు బయోచార్ తయారీ, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.
పూర్తిగా గాలి సోకకుండా, పొగ ఎక్కువగా రాకుండా 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడితో కట్టెలను కాలిస్తే బయోచార్ బొగ్గు తయారవుతుంది. ఈ ప్రక్రియను ‘ఫైరోలిసిస్’ అంటారు. ఇనుప డబ్బాల్లో, భూమిలో గొయ్యి తవ్వి కూడా బయోచార్ తయారు చేయొచ్చు. ఈ విధానంలో కట్టెలు, గడ్డి నుంచి బూడిద తక్కువ వచ్చి, ఎక్కువ బొగ్గు తయారవుతుంది. దీనికి బాగా నిల్వచేసిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ గానీ లేదా జీవామృతం కానీ పంచగవ్య లాంటి వాటిని సమపాళ్లలో కలిపితే పంటలకు మరింత మేలు చేస్తుంది. కంపోస్టును కుప్పగా పోసి బెల్లం నీళ్లు చిలకరిస్తూ రోజూ కలిపాలి. కంపోస్ట్ కుప్పపై పచ్చటి ఆకులు ఆచ్ఛాదనగా వేసి ఉంచితే 15 రోజుల్లో చక్కని బయోచార్ కంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్‌ను పొలంలో వేస్తే.. పంట దిగుబడులు బాగా పెరుగుతాయి. మట్టి గుణాన్ని బట్టి సరైన మోతాదులో బయోచార్ కంపోస్ట్ వేసుకోవాలి. బయోచార్ వంద నుంచి వెయ్యేళ్ల దాకా నేలలో అలాగే ఉండి దాని సూక్ష్మరంధ్రాలలో నిల్వచేసిన పోషకాలను ఎక్కువ కాలంపాటు భూమికి వాటిని అందిస్తుందంటారు సాయిభాస్కర్‌రెడ్డి.
పొలంలో గడ్డిని కాని, అడవులలోని చెట్లను కాని వృథాగా కాలిస్తే బూడిద ఎక్కువ వస్తుంది. బొగ్గు తక్కువ అవుతుంది. బూడిద భూసారానికి మేలు చేయదు. వాతావరణ కాలుష్యానికి కారణం అవుతుంది. అదే ‘ఫైరోలిసిస్’ విధానంలో అంటే ఒక్కొక్క లేయర్‌ను కాలబెడుతూ దానిపై మరో లేయర్ గడ్డి వేస్తూ కాలిస్తే బొగ్గు తయారవుతుంది. ఈ తరహాలో గడ్డిని కాలిస్తే బూడిద తక్కువ ఉంటుంది. బొగ్గు అధికంగా వస్తుంది. కర్రలు కానీ, గడ్డి కానీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కాల్చుకోవడం ఈ విధానంలో ముఖ్యం. కర్రలను కూడా అంచెలంచెలుగా పేర్చి, పైన కాస్త గడ్డి కానీ, లేదా ఎండిన ఆకులు కానీ వేసి పైనే నిప్పు ముట్టించాలి. అలా కాల్చినప్పుడు పై నుంచి కిందకి మంట వెళ్లి బొగ్గులు ఎక్కువ తయారవుతాయి. అలా కాకుండా కింద ఉన్న కర్రలను ముందుగా కాల్చితే బొగ్గు తక్కువ బూడిద ఎక్కువ అవుతుంది.
యూరియా, ఫాస్పేట్ లాంటి రసాయన ఎరువులు వాడే రైతులు కూడా బయోచార్ కంపోస్ట్‌ను కలిపి వాడవచ్చు. రసాయన ఎరువులను నేరుగా వేస్తే పంటకు 20 నుంచి 30 శాతం కంటే మించి ఉపయోగం ఉండదు. బయోచార్‌తో కలిపి వాటిని వాడితే 30 నుంచి 40 శాతం అధికంగా ప్రయోజనం ఉంటుందని సాయిభాస్కర్‌రెడ్డి వివరించారు. బొగ్గులోని సూక్ష్మరంధ్రాల్లో రసాయన ఎరువులను దాచిపెట్టి, మొక్కల వేర్లకు నెమ్మది నెమ్మదిగా అది అందిస్తుంది. రసాయనాలు వాడే పొలాల్లో బయోచార్ వేసుకుంటే నీటి అడుగున మట్టి ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. మిథేన్ లాంటి వాయువులను చార్‌కోల్ పీల్చుకుని వాతావరణానికి హానిని తగ్గిస్తుంది.
వరి పంటలు కోసిన తర్వాత ధాన్యం పొట్టు కుప్పలను రైతులు పోలాల్లోనే దగ్ధం చేస్తారు. ఆ తర్వాత వేసే పైరు పొట్టును కాల్చిన చోట బలిష్టంగా, ఏపుగా వస్తుంది. దిగుబడి కూడా అక్కడ రావడం రైతులకు తెలిసిన విషయమే. పంట వ్యర్థాలతో రైతులు స్వయంగా బయోచార్ తయారు చేసుకోవచ్చు. పొలాల్లో వేసుకుని తద్వారా దిగుబడులు, ఆదాయం అధికంగా పొందవచ్చు.
బయోచార్ చానల్ సాయి భాస్కర్‌రెడ్డి సౌజన్యంతో..