అరటిపండ్లు తినేవారికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండ్లలో సహజంగా ఉండే షుగర్‌ తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి అరటిపండ్లు. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును, గుండెజబ్బులను రక్షిస్తుంది. ఎక్కువ ఫైబర్‌ వల్ల కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండి తక్కువ ఆహారం తినేలా చేస్తుంది. తద్వారా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. అరటిపండ్లలోని విటమిన్‌ సీ, ఇతర పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ‘ఏ’ కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అరటిపండ్లలోని కాల్షియం, ఇతర ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న అరటిపంట సాగు ఎలా చేస్తే లాభదాయకంగా ఉంటుందో పరిశీలిద్దాం.

అరటిచెట్టు చుట్టూ పిలకలు (అరటి మొదలు నుంచి పుట్టేవి) ఉంటే ప్రధాన చెట్టు నుంచి పంట తక్కువ వస్తుందని, అరటి గెలలు చిన్నగా, కాయలు సన్నగా వస్తాయని చాల మంది రైతులు అపోహ పడుతుంటారు. అయితే.. అరటిచెట్టుకు రెండు, మూడు పిలకలు ఉంటేనే తల్లి చెట్టుకు గెలలు పొడవుగా, కాయలు పుష్టిగా తయావుతాయని, ఎక్కువ కాయలు కాస్తాయంటారు సంగారెడ్డి జిల్లాలో అరటిసాగు చేస్తున్న పొన్నుస్వామి అనే తమిళనాడు రైతు. అరటిచెట్టు ఆకులు ముదిరిన తర్వాత సూర్యరశ్మి ద్వారా ఆహారం తయారుచేసి చెట్టుకు ఆహారం అందించలేవని ఆయన అధ్యయనంలో తెలుసుకున్నారు. చెట్టుకు పైన ఉండే మూడు, నాలుగు లేత ఆకులు మాత్రమే కాయలు కాసే సమయానికి చెట్టుకు ఆహారం అందిస్తాయంటారు. నిజానికి చెట్టు కాండంలో దాచుకున్న వగరు నీటితో చాలవరకు పూత, కాయలు కాస్తుంది. అయితే.. కాయలు కాసే సమయానికి అరటిచెట్టుకు తగినంత ఆహారం అందించాలంటే చుట్టూ పిలకలు ఉండాలంటారు. పిలకలకు ఉండే లేత ఆకులు కూడా ఆహారం తయారుచేసి, కాయలు కాసే సమయంలో తల్లికి అస్తాయని ఆయన గమనించారు. కనీసం రెండు, మూడు పిలకలు ఉన్నప్పుడు తల్లిచెట్టుకు కాసే గెలలు సుమారు 60 కిలోల వరకు ఉన్నట్లు పొన్నుస్వామి నిర్ధారించారు. అదే పిలకలు తీసేసిన చెట్టు గెలలు చాలా బరువుతో, అరటి పండ్లు సన్నగా ఉన్నట్లు చెప్పారు.అరటితోటలో ఆయన ప్రయోగాత్మకంగా కొన్ని వరసలలో పిలకలన్నింటినీ తీసేశారు. మరికొన్ని వరసలలో రెండు పిలకలు, ఇంకొన్ని వరసలలో మూడు పిలకలు ఉంచారు. ఈ మూడు వరుసలలో తల్లి అరటిచెట్ల నుంచి వచ్చిన అరటి గెలల మధ్య ఉన్న తేడాను గమనించారు. మూడు కంటే మించి పిలకలు ఉంటే నేలకు, చెట్ల మొదలుకు సూర్యరశ్మి, గాలి తగలక పంట దిగుబడి తగ్గడం కూడా పొన్నుస్వామి గుర్తించారు. వరి, చెరకు పంటకు వచ్చిన పిలకలు భూమిలోని పోషకాలను తామే తీసుకొని, అవి చక్కగా ఎదుగుతాయి. కానీ అరటి పిలకలు మాత్రం తల్లిచెట్టు కాపుకాసే సమయంలో తాము తయారు చేసిన ఆహారాన్ని అందిస్తాయన్నారు. చెరకు, వరికి వచ్చే పిలకలు మనకు ఎక్కువ దిగుబడి ఇచ్చేందుకు వస్తాయి. కానీ అరటిచెట్టు కాయలు కాసే సమయానికి తనను తాను కాపాడుకునేందుకు పిలకలను పుట్టిస్తుందని చెప్పారు.అరటిమొక్కలకు చీడ, పీడలను తట్టుకునే శక్తి ఉంటుంది. అందువల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడతాయి. పట్టవు. నాటుకున్న తర్వాత వాటంతట అవే చక్కగా ఎదిగిపోతాయి. వాటి కోసం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే.. మొక్కలను జాగ్రత్తగా గమనిస్తూ.. సరిపడినంత పోషకాలు అందిస్తే సరిపోతుంది.అరటిమొక్క నాటినప్పటి నుంచి గెల తయారయ్యేందుకు 10 నుంచి 11 నెలల సమయం తీసుకుంటుంది.  అప్పటి వరకు రైతుల సూచనలతో ముందు రోజుల్లో పక్క పిలకలను తీసేశారు. ఒక పంట కోసం 11 నెలల పాటు వేచి చూడడం అంటే కాస్త ఇబ్బంది అవుతుందన్నారు పొన్నుస్వామి. అందుకే వంగ, టమోటా మొక్కల మాదిరిగా త్వరత్వరగా పంట వస్తే లాభదాయకం అవుతుందనే ఉద్దేశంతో తల్లి అరటి మొక్కల చుట్టూ ఉండే పిలకలను వదిలేసినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తల్లిచెట్టు గెల బలంగా, అధిక బరువుతో, ఎక్కువ కాయలతో వచ్చినట్లు గమనించామన్నారు. అరటిచెట్టు పిలకలను వదిలితే.. గెలలు బరువు తగ్గిపోతాయనేది ఒక అపోహ మాత్రమే అని పొన్నస్వామి స్సష్టం చేశారు.మనం అరటిచెట్లకు పోషకాలు అందించే స్థాయిని బట్టి ఎన్ని పిలకైనా ఉంచుకోవచ్చు. కాకపోతే తల్లి అరటిమొక్కలను వేసే సమయంలోనే కాస్త ఎక్కువ దూరం ఉండేలా నాటుకోవాలి. లేదంటే పిలకల గుబురు ఎక్కువైపోయి నేలకు గాలి, వెలుతురు సరిగా అందవు. దాంతో పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. అరటి మొక్కలను నాటే సమయంలో వాటి మధ్య 5 అడుగుల దూరం, వరసకు వరసకు మద్య 6 అడుగులు ఉంచాలని వ్యవసాయసాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా నాటుకుంటే ఎకరం నేలలో 1450 మొక్కలు నాటవచ్చు. వాటిలో 300 నుంచి 350 మొక్కలు నిరుపయోగం అయినప్పటికీ తోటను చక్కగా మెయింటెయిన్ చేసుకుంటే 1000 లేదా 1100 గెలల దిగుబడి తీసుకోవచ్చు. ఎకరం భూమిలో 300 నుంచి 350 మొక్కలు లాస్‌ అవకుండా ఉండాలంటే.. వరసల మధ్య 9 అడుగుల దూరం, మొక్కల మధ్య 6 అడుగుల దూరం పెట్టామని చెప్పారు పొన్నుస్వామి.  జీ9 అనే అరటి రకం మొక్కలు ఎక్కువ ఎత్తు ఎదగవు కాబట్టి 8X8 అడుగుల దూరం పెట్టామన్నారు. 6X6 కొలతల ప్రకారం రెండు మొక్కలు నాటిటే చెట్టు పైకి ఎదిగింది కానీ గెలలు సరిగా రాలేదన్నారు. అందుకే 8X8 దూరంలో నాటినట్లు చెప్పారు. మరిన్ని ఎక్కువ పిలకలను చెట్టుకు ఉంచి, వాటి ద్వారా మరింత ఎక్కువ గెలలు తీసుకోవాలంటే నాటినప్పుడు 10X10 దూరం పాటిస్తే మంచిది.అరటిచెట్లకు సరైన మొతాదులో పోషకాలు అందించి, నీటి సదుపాయం చక్కగా చూస్తే.. చెట్టు ఆకు మొదలులో ఎక్కువగా తెల్లరంగు కనిపిస్తుంది. తెలుపు రంగు అరటిచెట్టు స్వభావమే అయినా.. ఎక్కువ తెలుపురంగు కనిపిస్తే మనం దాన్ని సరైన పద్ధతితో పెంచుతున్నామని గుర్తు అన్నారు. దూరం దూరంగా మొక్కలు నాటిన తర్వాత ఆరేడు నెలల అనంతరం తొలిసారి దిగుబడి తక్కువే వస్తుంది. అయితే.. తర్వాత దాని నుంచి పుట్టే పిలకల ద్వారా తర్వాత రోజుల్లో ప్రతి 10 నుంచి 15 రోజులకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి. ఒకసారి అరటి మొక్కను నాటుకుంటే దానికి పుట్టే పిలకలు, వాటి పిలకల ద్వారా మన జీవితకాల పర్యంతమూ ఫలసాయం అందిస్తూనే ఉంటుంది. కాకపోతే తల్లి మొక్కకు ఎంత మొత్తంలో పోషకాలు అందించామో పిల్ల మొక్కలకు కూడా అదే మోతాదులో పోషకాలు అందించాల్సి ఉంటుంది. తల్లిమొక్కకు  అందించిన మోతాదు మాత్రమే అందిస్తే.. తల్లీ సరిగా పెరగదు, పిలకలు కూడా ఎదగవని గ్రహించాలన్నారు పొన్నుస్వామి.అరటిమొక్కలకు తొలిసారి చేసినట్లు భూమి దున్నే ఖర్చు, మొక్కలు కొనే ఖర్చు, కలుపు తీసే ఖర్చు కూడా తగ్గిపోతుంది. అరటి పిలకలను ఎక్కువ వదులుకుంటే గెలలు ఎక్కువ బరువు వస్తాయి. కాయలు పుష్టిగా పెరుగుతాయి. ఎక్కువ ఆదాయమూ లభిస్తుంది.

(పొన్నూస్‌ సౌజన్యంతో..)