ఇంగువలో సల్ఫర్‌ కంటెంట్‌ ఎక్కువ. పంటలకు పెస్టిసైడ్‌గా, ఫంగిసైడ్‌గా, గ్రోత్‌ప్రమోటర్‌గా కూడా ఇంగువ పనిచేస్తుంది. భూమిలోని నత్రజని, ఫాస్పరస్‌ను ఉత్తేజ పరుస్తుంది. మొక్కలు లేదా చెట్లకు నత్రజని, ఫాస్పరస్‌ను అందించే వాహకంగా ఉపయోగపడుతుంది. పూత, కాత బాగా రావడానికి ఇంగువ కారణం అవుతుంది. అసఫొటిడా అని ఇంగ్లీషులో పిలుచుకునే ఇంగువ ఫెరులా మొక్క జిగురు పదార్థం. ఇది భారతదేశ వాతావరణానికి అనుకూలమైన మొక్క కాదు. కజికిస్తాన్‌, తజికిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాల్లో మాత్రమే పండుతుంది. ఈ ఐదు దేశాల నుంచే ఇంగువ దిగుమతి అవుతుందని ప్రశాంత్ గుప్తా తెలిపారు. 2020లో ఫెరులా మొక్కలను పెంచేందుకు కశ్మీర్‌లో ప్రయత్నం చేశారు కానీ అవి సెట్ అవలేదు.

వంటలో వాడే ఇంగువ 5 శాతం మాత్రమే ఉండాలని ఫుడ్‌ సేఫ్టీ విభాగం నిబంధన ఉంది. ఐదు శాతం లోపు ఉండే ఇంగువను భూమికి ఇస్తే పనిచేయదు. అందుకే వ్యవసాయంలో వాడే ఇంగువ మోతాదు 25 శాతానికి మించి ఉండాలి. ఇంగువ పూర్తిగా ఆర్గానిక్ విధానంలో తయారవుతుంది. ఎలాంటి కల్తీ జరిగే అవకాశం ఉండదు. నిజానికి ఏడెనిమిది ఏళ్ల క్రితమే ఇంగువ ద్రావణాన్ని పంటలకు వాడుతున్నట్లు నేచర్ వాయిస్ అనే యూట్యూబ్‌ చానల్‌లో ఉందని, అందులో ఈ ద్రావణం గురించి ఒక అనుభవజ్ఞుడైన రైతు చెప్పారని ప్రశాంత్‌ గుప్తా తెలిపారు.ఇంగువను ప్రతి పంటకూ వాడుకోవచ్చు. కొబ్బరి, కోకాబీన్స్‌ లేదా చాకొలెట్ బీన్స్‌, మామిడి, టమాటా, వంకాయ, తీగజాతి కూరగాయ పంటలు సహా అన్ని పంటలకు ఇంగువ వాడవచ్చు. మామిడి చెట్లను జులై, ఆగస్టులో ప్రూనింగ్ చేసిన తర్వాత ఒకసారి ఇంగువ ద్రావణం స్ప్రే చేసుకోవాలి. తర్వాత మామిడి చెట్టుకు మొగ్గ దశలో ఉన్నప్పుడు మరోసారి స్ప్రే చేయాలి. గ్రీన్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఇంకోసారి ఇంగువ ద్రావణం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే.. పూత పసుపురంగులోకి మారినప్పుడు ఇంగువ ద్రావణం స్ప్రే చేస్తే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వకూడదని ప్రశాంత్ గుప్తా హెచ్చరించారు. ఆ తర్వాత మామిడి పిందె, కాత దశలో ఉన్నప్పుడు ఏ రకమైన మామిడిచెట్టుకైనా ఇంగువ ద్రావణం ఇవ్వవచ్చు. టమాటా నారు పెట్టిన పది రోజుల నుంచీ ఇంగువ ద్రావణం వాడుకోవచ్చు. వంగమొక్కలకు నాటిన 19 రోజుల తర్వాత దోమలు ఆశించే అవకాశం ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి ఇంగువ ద్రావణం వాడుకోవచ్చు. ఇంగువను మొక్కలకు స్ప్రే రూపంలో గానీ, నేలలో ఘన లేదా పౌడర్‌ రూపంలో కూడా వాసుకోవచ్చు.ఇంగువను దాని క్వాలిటీ ఆధారంగా మోతాదును మొక్కలు, చెట్లకు వాడుకోవాల్సి ఉంటుంది. ఇంగువలో ప్రాథమికంగా నోక్రా, పినాక్సి, హింగ్డా, తజాకి రకాల నుంచి కొంచెం కొంచెం తీసుకొని వాటిని పౌడర్‌గా లేదా ముద్ద రూపంలోకి మార్చుకోవాలి. ఎక్కువ వాసన ఉన్న ఇంగువను మంచి క్వాలిటీ అంటారు. పౌడర్‌ గానీ, ముద్ద ఇంగువ గానీ 25 శాతం ఉంటే ఒక గ్రాముకు ఒక లీటర్‌ నీరు చొప్పున కలుపుకొని స్ప్రే ద్వారా గానీ, డ్రిప్‌ ద్వారా లేదా మగ్గు ద్వారా మొక్కల మొదళ్లకు పోసుకోవచ్చు. అంటే 200 లీటర్ల నీటిలో 200 గ్రాముల ఇంగువ కలుపుకోవాలన్న మాట.ఇంగువ- పులిసిన మజ్జిగ కలిపి పంటకు వాడొచ్చని రైతు రామడుగు రాము తనకు చెప్పారని ప్రశాంత్ గుప్తా తెలిపారు. ఐదు లీటర్ల గోమూత్రం, 8 లీలర్ల పులిసిన మజ్జిగ, 200 గ్రాముల ఇంగువ కలుపుకోవాలని రాము తెలిపారన్నారు. మొక్కలకు పురుగు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ద్రావణం వాడుకోవచ్చు. రెండోది మృతజీవుల ద్రావణం. ఈ ఫార్ములాను సుందర్‌రామన్ చెప్పారు. మూడోది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసిన జింక్‌ ద్రావణం. దీంట్లో చింతాకు వాడతారు. నాలుగోది బోరాన్ ద్రావణం. తుమ్మెత్త ఆకు, జిల్లేడు ఆకులు ఈ ద్రావణంలో కలుపుకోవాలి. ఐదోది వేపనూనె, ఇంగువ ద్రావణం. వేపనూనె మొక్కలపై ఒత్తిడి పెంచుతుంది. ఇంగువ దాన్ని కూల్ చేస్తుంది. దాంతో మొక్కల పెరుగుదల బాగుంటుంది.ఆర్గానిక్ యూరియా గోల్డ్‌ అనేది ఆరో ద్రావణం. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన యూరియా గోల్డ్‌లో నత్రజని, సల్ఫర్‌ ఉంటుంది. వీటికి ఇంగువ, పులిసిన మజ్జిగ కలిపి తయారు చేస్తే దాన్ని ఆర్గానిక్‌ యూరియా గోల్డ్ అని చెప్పారు ప్రశాంత్ గుప్తా. వేరుశక్తి ద్రావణం అంటే హ్యూమిక్ యాసిడ్‌. ఈ విధానాన్ని రాజస్థాన్‌కు చెందిన యూట్యూబ్ చానల్‌లో తాను చూశానన్నారు. ఏ మొక్కలకైనా నెమటోడ్స్‌ ఎటాక్ అయితే.. మిగతా మొక్కలకు పాకక ముందే ఈ ఆర్గానిక్‌ యూరియా గోల్డ్‌ ద్రావణం వాడుకోవచ్చు. నెమటోడ్స్ ఎటాక్‌ అయిన తర్వాత మాత్రం ఈ రకం ద్రావణం పనిచేయదని రైతులు తెలుసుకోవాలి.చింతల వెంకటరెడ్డి సూచించిన మహా అద్భుత ద్రావణం. వెంకటరెడ్డి చెప్పిన ప్రకారం మట్టి ద్రావణం, కుంకుడుకాయ రసం, వేపపిండి, వెల్లుల్లి వేసుకోవాలి. అయితే.. వెల్లుల్లి బదులు ఇంగువ కలుపుకోవచ్చని ప్రశాంత్ గుప్తా చెప్పారు. ఎందుకంటే వెల్లుల్లిలో, ఇంగువలోనూ సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి కలుపుకోవచ్చు. దేశీయ వెల్లుల్లిలో మంచి పవర్ ఉంటుంది. దాన్ని వాడుకుంటే మేలు. దేశీయ వెల్లుల్లి దొరకనప్పుడు ఇంగువతో తయారు చేసుకున్నా కూడా అదే ఫలితం వస్తుంది.ఇంగువ మార్కెట్‌లో రకాన్ని బట్టి కిలో రూ.350 నుంచి రూ. 28 వేల వరకు ధర ఉంటుంది. నూక్రా అనే ఇంగువకు భారీగా ధర ఉంటుంది. ఇలా పలు రకాల ఇంగువల నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఢిల్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో మిక్సింగ్ చేసి, రైతులకు అందిస్తున్నట్లు ప్రశాంత్ గుప్తా చెప్పారు. దీంట్లో గమ్‌ అరబిక్‌, విజిటబుల్ ఆయిల్‌, హింగ్‌, బేస్ పౌడర్‌ కలిపి తాము కొత్త ఫార్ములా రూపొందించినట్లు చెప్పారు. ఇలా తయారు చేసిన ఇంగువ ఎకరానికి 200 గ్రాములు సరిపోతుందని, దాని ఖరీదు రూ.300 ఉంటుందన్నారు.ఏదైనా పంటకు సమస్య ఉంటే.. తనకు ఫొటో పెడితే.. ఇంగువ అవసరమా? లేదా? అనేది తాను తెలియజేస్తానన్నారు ప్రశాంత్ గుప్తా. రసాయన ఎరువులతో కలిపి ఇంగువను వాడుకోవచ్చా? అనే ప్రశ్నకు ప్రశాంత్ గుప్తా జవాబు ఇలా ఉంది. రసాయన ఎరువు కోసం డబ్బు ఖర్చు చేస్తూ.. మళ్లీ ఇంగువ కోసం అధికంగా ఎందుకు ఖర్చు చేయాలన్నారు. ఇంగువ ద్రావణంతోనే ఫలితం తప్పకుండా వస్తుందన్నారు. ఇంగువ ద్రావణం వాడిన ఐదు రోజుల్లో దాని ప్రభావం మనకు కనిపిస్తుంది. ఇంగువ ద్రావణాన్ని సాధారణంగా సాయంత్రం వేళ స్ప్రే చేయాలి. మంచు కురిసే సమయంలో మాత్రం మధ్యాహ్నం పూట స్ప్రే చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుందన్నారు.

 

ఇతర వివరాల కోసం ప్రశాంత్ గుప్తాను.. 9030966647 లేదా 8897719719 నెంబర్లలో సంప్రదించవచ్చు.