సహజ సేద్యంతో అన్ని కాలాల్లోనూ ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున 90 శాతం సబ్సిడీ అందజేస్తామని ఆయన తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధం సేద్యం విధానానికి తానే శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మధ్యలో ఐదేళ్లు సేంద్రీయ సేద్యాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మళ్లీ సేంద్రీయ సేద్యానికి తాము ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

ప్రకృతి సేద్యం వైపు ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయని చంద్రబాబు తెలిపారు. సహజసిద్ధంగా పండిన ఆహారం వినియోగించేందుకు వినియోగదారులు ఎక్కువ మక్కువ చూపుతున్నారన్నారు. దీంతో ప్రకృతి సేద్యానికి, సహజసిద్ధ పంట ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ వచ్చిందని చెప్పారు.ప్రకృతి సిద్ధంగా పండించిన పంటను నిజమైనదా? కాదా అని ధ్రువీకరించే ఏజెన్సీలు ఇప్పుడు ఉన్నాయన్నారు. మనం తినే ప్రకృతిసిద్ధ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రైతు ఆ పంట పండించాడు లాంటి వివరాలన్నీ క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సహజ సిద్ధంగా పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందన్నారాయన. ఏ వినియోగదారుడైనా నిర్భయంగా ఆ ఆహారం తినే వీలు వచ్చిందన్నారు.

ఏపీలోని ప్రతిరైతు పళ్ల తోటలు, కూరగాయలు, ఆహార ధాన్యాలను సహజసిద్ధంగా పండించేందుకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు వరి, చెరకు లాంటి పంటలే ఎక్కువగా రైతులు వేసేవారన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు హార్టీ కల్చర్ సాగుచేస్తున్నట్లు తెలిపారు. పండ్లతోటలు, పూలు, కూరగాయలు, సెరికల్చర్‌ లాంటి పంటలు పండిస్తున్నారన్నారు. జీఎస్‌డీపీలో హార్టీకల్చర్‌ 18 శాతం, మరో 18 శాతం డైరీ వచ్చిందని వెల్లడించారు.నిజానికి రెండు దశాబ్దాలుగా మన దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ సేంద్రీయ వ్యవసాయం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు ‘వరల్డ్ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌’ సంస్థ 2022 ఫిబ్రవరిలో వార్షిక నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ సంస్థ ‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ మూవ్‌మెంట్‌’ ఇతర సంస్థలతో కలిసి ఈ నివేదిక విడుదల చేస్తుంది. సహజ పంటల దిగుబడి కూడా పెరుగుతోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా, దేశీయంగా కూడా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో పాటుగానే సహజ పంటలను కొనే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో సేంద్రీయ పంట ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి 74.9 మిలియన్ హెక్టార్లలో సేంద్రీయ సాగు విస్తరించింది. అందులో 74.9 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. ప్రపంచం మొత్తంలో అత్యధిక సంఖ్యలో సహజ వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్న దేశంగా భారత్‌ నిలిచింది. 2020 నాటికి 15.99 లక్షల మంది మన దేశంలోని రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. అత్యధిక సేంద్రీయ సాగు విస్తీర్ణం ఉన్న దేశాల జాబితాలో మన దేశం 9వ స్థానంలో ఉంది. కాగా.. పూర్తిస్థాయిలో రసాయన రహిత వ్యవవసాయం చేస్తున్న రాష్ట్రంగా సిక్కిం నిలిచింది.

 

మన దేశంలో జీవ ఎరువుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6వ పంచవర్ష ప్రణాళికలో ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తులను ప్రోత్సహించేదుకు 2001లోనే ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ (ఎన్‌పీఓపీ)’ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. తర్వాత 2004లో ‘నేషనల్‌ ప్రాజెక్ట్‌ ఆన్ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌’ పేరిట మరో కార్యక్రమం ప్రారంభించింది. ఆర్గానిక్‌ వ్యవసాయం విస్తీర్ణాన్ని పెంచేందుకు, సాంకేతిక అంశాల బదిలీ కోసం జాతీయ స్థాయిలో 2004లో ‘నేషనల్‌ ప్రాజెక్ట్‌ ఆన్ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ మొదలుపెట్టింది. మన దేశంలో ఆర్గానిక్ ఉత్పత్తులు పెంచేందుకు 2015 నుంచి ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన’ అమలులోకి వచ్చింది. 2020 నాటికి మన దేశంలో ఆర్గానిక్‌ ఆహారం డిమాండ్‌ విలువ రూ.87 కోట్లుగా ఉందని అసోచాం నివేదిక పేర్కొంది.