ఉన్న ఊరిని, కన్నతల్లిని మర్చిపోకూడదంటారు పెద్దలు. అదే మాటకు కట్టుబడిన ఓ తండ్రీ కొడుకు కలిసి తమ గ్రామంలోని రైతుల ఆర్థిక స్థితినే మార్చేశారు. అప్పటి వరకు ఆ ఊరి రైతులు చేస్తున్న వ్యవసాయ విధానానికి కొంచెం మార్పులు చేశారు. సమీకృత సహజ సేద్యంతో ఒక్కో ఎకరం నుంచి ఏడాదికి 3 లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చేలా చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని ఘెల్‌ గ్రామానికి చెందిన అర్షదీప్ భాగా, అతని తండ్రి సర్బ్‌జిత్‌ భాగా ఈ అద్భుత ఫలితాలను తమ గ్రామ రైతులకు అందించారు. సహజసిద్ధ వ్యవసాయంలో సరికొత్తగా సమీకృత ఆర్గానిక్‌ వ్యవసాయం అనే విధానం ద్వారా సహచర రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఉద్యోగాలు, ఇతర వ్యాపకాలతో వారు విదేశంలో, ఇతర ప్రాంతంలో ఉన్నప్పటికీ తమ మూలాలను మర్చిపోలేదు. అందుకే తమ సొంతూరికి తిరిగి వచ్చేశారు. తమ గ్రామంలోని రైతుల ఆదాయం మరింత ఎక్కువ వచ్చేలా చేసేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు.సాంకేతిక నిపుణుడైన అర్షదీప్‌ 2016లో మాతృదేశానికి తిరిగి రాక ముందు ఆరేళ్ల పాటు అమెరికాలోని జార్జియాలో పరిశోధకుడిగా ఉన్నాడు. అర్షదీప్‌ తండ్రి సర్బ్‌జీత్‌.. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్కిటెక్ట్‌గా 41 ఏళ్లు సేవలందించారు. పూర్వకాలం నుంచీ రైతులు చేస్తున్న సహజసిద్ధ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడించి సమీకృత ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంతో ముందుకు వచ్చారు. తద్వారా వ్యవసాయాన్ని, పంటలను మెరుగుపరుచుకోవాలనుకునే రైతులకు మరింత అధిక ఆదాయం వచ్చేలా ఈ తండ్రీ కొడుకు ప్రోత్సహించారు.

ఈ క్రమంలోనే అర్షదీప్‌, సర్బ్‌ జీత్‌లు తమ గ్రామం ఘెల్‌లో 2019-2020లో ‘భాగా ఆర్గానిక్‌ ఫార్మ్‌’ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తండ్రి కొడుకు ఇరుగు పొరుగు రైతులతో సమీకృత ఆర్గానిక్‌ వ్యవసాయ విధానం గురించి తరచుగా చర్చించేవారు. వ్యవసాయంలో మితిమీరి వినియోగిస్తున్న రసాయనాలతో భూసారం, వ్యవసాయ భూములు ఎంతలా నాశనం అవుతున్నాయో రైతులకు అర్థమయ్యేలా వివరించి చెప్పేవారు. అప్పటికే ఆ గ్రామ రైతులు సరైన అవగాహన లేక ఎక్కువగా రసాయనాలు వాడేవారు. పంటలకు మితిమీరి నీటిని వాడేయడంతో భూగర్భ జల స్థాయిలు బాగా తగ్గిపోయాయి.నిజానికి పచ్చని భూములు కలిగిన ఘెల్‌ గ్రామంలో చక్కని ఆహార పంటలు పండించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ గ్రామ రైతులు పసుపు ఆవాల పంట మాత్రమే వేసేవారు. సరైన పంటల సాగు ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించడంపై సరైన అవగాహన లేక రైతులు ఎప్పుడూ ఇదే పంట పండించేవారు. దీంతో తరచూ భూసారం క్షీణిస్తోందని అర్షదీప్‌, ఆయన తండ్రికి అర్థం అయింది. అప్పటి వరకు రైతులు ఏక పంట విధానం మాత్రమే ఆచరించేవారు. గోధుమ మాత్రమే పండించే క్రమం నుంచి వారి దృష్టిని మళ్లించాలని నిర్ణయించుకున్నారు. ఐదెకరాల పొలాన్ని ఎకరం చొప్పున విడగొట్టి, ఒక్కో ఎకరంలో ఒక్కో రకం పంట సాగుచేసే విధానం గురించి రైతులకు నచ్చజెప్పారు. వివిధ రకాల పంటల ద్వారా కేవలం ఆహార అవసరాలు తీరడమే కాకుండా రైతులకు అదే భూమి నుంచి అత్యధిక ఆదాయం వచ్చేలా చేశారు అర్షదీప్‌, సర్బ్‌ జీత్‌. అలా రైతులు ఎకరం పొలంలో సమీకృత ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో కూరగాయలు, మూలికజాతి పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లతో పాటు పౌల్ట్రీ ద్వారా కోడిగుడ్ల ఉత్పత్తి కూడా చేసేలా చూశారు. సమీకృత ఆర్గానిక్‌ పంటల విధానం ద్వారా ఒక ఎకరం నుంచి సాలీనా రూ.2,90,000 ఆదాయం రైతులకు వస్తోంది.‘భారతదేశంలో ఎకరం భూమిలో సమీకృత ఆర్గానిక్‌ ఫార్మింగ్‌’ పేరుతో ఈ తండ్రి కొడుకు ఓ పుస్తకం రాశారు. దానిలో సమీకృత ఆర్గానిక్‌ వ్యవసాయంలో తమ అధ్యయనంలో తెలిసిన అనేక అంశాలను పొందుపరిచారు. సమీకృత ఆర్గానిక్‌ ఫాం ఎలా రూపొందించాలి? ఉన్నత పోషకాలున్న పంటలు ఎలా పండించాలి? రసాయన రహిత, సహజసిద్దమైన, తాజా కూరగాయల సాగులో తమ అనుభవాలను వారు ఆ పుస్తకంలో పొందుపొరిచారు. ఎవరైనా సొంతంగా ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతో ఉపయోగపడుతోంది. ఈ తండ్రీకొడుకు అర్షదీప్‌, సర్బ్‌జీత్‌ తమ మూలాలను మరిచిపోకుండా తమ గ్రామానికి తిరిగి వచ్చారు. ఇరుగుపొరుగు రైతుల జీవితాల్లో సమీకృత ఆర్గానిక్‌ వ్యవసాయ విధానం ద్వారా వెలుగులు నింపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here