సరోజ నాగేంద్రప్ప పాటిల్‌.. 63 ఏళ్ల ఈ మహిళ ఆర్గానిక్ పంటల విజేత ఇప్పుడు నెలకు 50 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నిట్టూరులో సేంద్రీయ విధానంలో బియ్యం, రాగి పంటలు పండిస్తున్నారు. ఆమె పండించే ఆరోగ్యకరమైన ఆర్గానిక్‌ ఉత్పత్తులను చక్కగా ప్యాకింగ్‌ చేసి విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. ‘తాడ్‌వనం’ సంస్థ బ్రాండ్‌ పేరుతో ఈ మహిళ తయారు చేస్తున్న ఉత్పత్తులకు స్థానికంగాను, దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉంది. ఆర్గానిక్‌ ఉత్పత్తులతో తాను లాభాలు ఆర్జించి ఆర్థికంగా చక్కని స్థితికి చేరడమే కాకుండా తమ ఊరిలోని అనేక మంది మహిళలు కూడా సేంద్రీయ పంటలు పండించేలా ప్రభావితం చేశారు. దాంతో పాటుగా తమ గ్రామంలోని పలువురు మహిళలకు తాడ్‌వనం సంస్థలో పార్ట్‌ టైం ఉపాధి కల్పించి వారికి కూడా ఆర్థికంగా చేయూతనిస్తున్నారు.

వాస్తవానికి సరోజ నాగేంద్రప్ప పాటిల్‌ ఆర్గానిక్‌ వ్యవసాయం ప్రారంభించడానికి ముందు నిట్టూరు పరిసర గ్రామాల రైతులు విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయారు. చేసిన అప్పులు తీర్చే దారీ తెన్నూ కనిపించక అనేక మంది రైతులు బలవంతంగా ఆత్మహత్యలు చేసుకునేవారు. ధైర్యాన్ని కోల్పోయి, బతుకు మీద ఆశలు చంపుకుంటున్న అలాంటి రైతుల జీవితాలను సరోజ చక్కని మార్పు తీసుకొచ్చారు. ఆర్గానిక్‌ విధానంలో సాగు చేయడం ఒక్కటే కాకుండా వారి పంటలకు తన సంస్థ తాడ్‌వనం ద్వారా చక్కని ధర వచ్చేలా చేశారు. రైతుల ఆర్గానిక్‌ పంటలకు మంచి ధర ఇచ్చి కొనడంతో పాటు తాను కూడా మరింత ఆదాయం పొందారు. ఇప్పుడు సరోజా నాగేంద్రప్ప తమ ప్రాంతంలో ఆర్గానిక్‌ ఉత్పత్తుల మోడల్‌గా పేరు తెచ్చుకున్నారు.

సరోజ నాగేంద్రప్ప 1987లో తొలిసారిగా ఓ డయరీఫాం ప్రారంభించారు. దాంతో పాటు కొబ్బరిపీచు ఉత్పత్తుల యూనిట్‌ మొదలుపెట్టారు. ఈ రెండు వ్యాపారాల ద్వారా తన కుటుంబం ఆర్థిక స్థితిని మళ్ళీ గాడిలో పెట్టారు. సరోజా నాగేంద్రప్ప ఈ ఔత్సాహికతే ఆమెను ఇంటిలో ఉండే డబ్బులు ఎలా సంపాదించొ వచ్చో పాఠాలు నేర్పింది. తాను నేర్చుకున్న ఆ పాఠాలతో ఆమె చుట్టుపక్కల మహిళలు, స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే వనరులను ఎంత సమర్ధంగా వినియోగించుకోవచ్చో, ఆర్గానిక్‌ విధానంలో క్రిమి కీటకాలను ఎలా నియంత్రించి పంటలు పండించవచ్చో వ్యవసాయశాఖ నిర్వహించే అవగాహన శిబిరాల ద్వారా రైతులకు బోధపడేలా చేశారు. ఇతర రైతులకు మార్గనిర్దేశం చేయాలనే సరోజ నాగేంద్రప్పలో ఉన్న ఉత్సాహమే ఆమెను మంచి లీడర్‌గా చేసింది. అదే సహజసిద్ధ పంటల్ని కొత్త కొత్త విధానాల్లో ఎలా పండించాలనే ఆలోచనలు వచ్చేలా చేసింది. తొలినాళ్లలో పెద్ద పెద్ద విజయాలేవీ సాధించలేకపోయినా.. సరోజ నాగేంద్రప్పలోని కృషి, నిర్విరామంగా ఆమె చేసిన ప్రయత్నాల కారణంగా కుటుంబానికి చెందిన 30 ఎకరాల నుంచి అంతకు ముందెప్పుడూ లేనంత స్థాయిలో అధిక ఉత్పత్తులు సాధించారు.

క్రిమికీటకాల నివారణ విషయంలో సరోజ నాగేంద్రప్ప మంచి అవగాహన ఉండడంతో వ్యవసాయశాఖ ఆమెను టీచర్‌గా చేర్చుకుంది. సరోజ పొలాన్ని సందర్శనా క్షేత్రంగా ఎంపిక చేసింది. హరిహార్‌ తాలూకా చుట్టుపక్కల సరోజ, ఇతరులు కలిసి ప్రతిరోజూ కనీసం 20 గ్రామాల్లో పర్యటించేది. ఆయా గ్రామాల రైతులు చేసే వ్యవసాయ విధానాలను అర్థం చేసుకునేందుకు చక్కని అవకాశంగా మారింది. ఆ పర్యటనలు తమకు ఎంతో వ్యవసాయం పట్ల మంచి విశ్వాసం కలిగేలా చేసిందంటారు. ఆ సమయంలోనే తనకు ఆర్గానిక్ వ్యవసాయం పట్ల అవగాహన కలిగిందని చెబుతారు. 2004లో తాడ్‌వనం పేరుతో సరోజ ఆర్గానిక్ ఉత్పత్తుల కన్షార్షియంను ప్రారంభించారు. అయితే.. అంతకు ముందు కూడా సరోజా, ఆమె భర్త నాగేంద్రప్పకు సేంద్రీయ విధానంలో పండించిన బియ్యం, రాగులు, గోధుమలు, చిరుధాన్యాలను విక్రయించిన అనుభవం ఉంది. సరోజ ఏర్పాటు చేసిన తాడ్‌వనం సంస్థ ద్వారా ఇప్పుడు ఆమె జీవితాన్నే మార్చేసింది. దూర దూర ప్రాంతాలకు కూడా ఆమె ప్రత్యేకత పాకిపోయింది.సరోజ నాగేంద్రప్ప కొన్నేళ్లుగా చెన్నై, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, ముంబైలలో పలు ప్రదర్శనల్లో తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఢిల్లీలో జరిగిన ఆర్గానిక్‌ పంటల ప్రదర్శనలో సరోజ నాగేంద్రప్ప ఉత్పత్తులను కొనుగోలు చేసిన మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మెచ్చుకున్నారని, చిన్న పల్లెటూరి నుంచి వచ్చి, వ్యవసాయ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తన కృషిని ఎంతో అభినందించినట్లు తెలిపారు. సరోజ కస్టమర్లలో ఇస్కాన్‌ సంస్థ ఒకటి. ఆర్గానిక్‌ విధానంలో వరి పంట పండించి, ఆ బియ్యంతో తయారుచేసే పాపడ్‌లను కొనుగోలు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారామె. అలసటంటే తెలియని సరోజ మార్కెట్లో లభించే ఇతర పిండిలకు ప్రత్యామ్నాయంగా ఎన్నో పోషకాలు ఉండే అరటిపిండిని ఆవిష్కరించారు. పచ్చి అరటికాయల నుంచి తయారు చేసే ఈ పిండి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందని చెప్పారు. అరటి పిండితో దోశలు, ఇడ్లీలు, ఉప్మా, పూరీ, వడ, వర్మిసెల్లీ చేసుకోవచ్చట.

భవిష్యత్‌ తరాల కోసం సరోజ స్థానిక ధాన్యం రకాల విత్తనాలు పండించి, నిల్వ చేస్తున్నారు. అలా ఆమె సుమారు 30 రకాల స్థానిక వరిధాన్యం రకాలు పండిస్తున్నారు. వాటిలో జొన్నలు, తెల్ల రాగులు ఇతర రకాల విత్తనాలు పండిస్తున్నారు. తమ ఉత్పత్తుల్లో వినియోగించే ఆర్గానిక్‌ వేరుసెనగ, మిర్చి పంటలు తమకే విక్రయించేలా కొందరు రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆయా రైతుల నుంచి కొనుగోలు చేసిన ఆర్గానిక్‌ ఉత్పత్తులతో తాడ్‌వనం సంస్థలో రకరకాల ఆహారపదార్థలు తయారు చేసి సరోజ నాగేంద్రప్ప విక్రయించి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నారు.

పూర్తి వివరాలు కోసం సరోజ నాగేంద్రప్ప పాటిల్‌ను 9900769719 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here