ఆహారమే ఔషధం. ఎలాంటి ఔషధ ఆహారం పెరటితోటలో పెంచి, పోషించి ఆరోగ్యాన్ని పొందాలో చూద్దాం. కరివేపాకు, తమలపాకు, చెర్రీ టమోటా, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, గంగవాయిల్‌కూర, బచ్చలి, లెట్యూస్, తైవాన్ మింట్, బ్రకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, స్ట్రాబెర్రీ, ఆస్పరాగస్, ఉల్లి, పచ్చిమిర్చి, బీట్‌రూట్, క్యారెట్, కంద, బంగాళాదుంప, చిలగడదుంప, సొర, బీర, దొండకాయ, చిక్కుడు, కాకర, ముల్లంగి, మామడి, సపోటా, అరటి, బత్తాయి, బ్రెజిల్ ఆరెంజ్, లక్ష్మణఫలం లాంటి 70 రకాల ఆరోగ్యాన్నిచ్చే దేశ, విదేశీ మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలిచారు మేడ్చల్ జిల్లా రాజబొల్లారంలోని ఔత్సాహిక రైతు సీహెచ్‌వీ నరసింహరాజు.
200 గజాల్లో న్యూట్రీ గార్డెన్ పేరిట ఆయన ఆరోగ్యాన్నిచ్చే పంటలు సాగు చేస్తున్నారు. మన దేశంలో నవంబర్ నుంచి జనవరి వరకు మూడు నెలలు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చలిప్రదేశాల్లో మాత్రమే పెరిగే పంటలు పండించుకోవచ్చన్నారు.న్యూట్రీ గార్డెన్ ప్రవేశం వద్ద అందరినీ ఆకర్షించే విధంగా నరసింహరాజు లాంటినా, ఎల్లో ఫ్లవర్స్‌ను పెంచుతున్నారు. బ్రస్సెల్స్ స్ప్రౌట్. ప్రతి ఆకుపైనా క్యాబేజీ లాంటి చిన్నసైజు కాయ వస్తుంది. కొత్తిమీర మొక్కలా కనిపించే దీన్ని వేయించుకుని తింటారు. సెలరీ మొక్క అత్యంత ఆరోగ్యకరమైనది. అనారోగ్యానికి గురైన వారిని సెలరీ జ్యూస్ తాగమని విదేశాల్లో ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. పళ్లు తోముకునే పుల్లల సైజులో వీటి కాండాలను విదేశాల్లో అమ్ముతారు. వీటిని నేరుగా నమిలి తినవచ్చు. ఈ మొక్క లేత ఆకులను కూరగా వండుతారు. మొత్తం ఆకును, కాండాన్ని కూడా కూర చేసుకోవచ్చు. మోటుగా, ఎత్తుగా పెరుగుతుంది. అయితే.. మన దేశ ఉష్ణోగ్రతను అంతగా తట్టుకోలేదు. శీతాకాలంలో అయితే.. షేడ్ నెట్ వేసి సెలరీని పెంచుకోవచ్చు.
నీరో కేల్ రకం ఒకటి నరసింహరాజు కిచెన్ గార్డెన్‌లో ఉంది. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. న్యూట్రిషన్లు అందించడం దీనిది ఫస్ట్ గ్రేడ్ అంటారు. ఎగ్జోటిక్ ఆకుకూరల్లో దీనికి ఫస్ట్ రేటింగ్. దీన్ని తోటకూర మాదిరిగా కూరగా వండుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని రసంగా వాడొచ్చు. పచ్చడి చేసుకొని కూడా ఆహారంలో తీసుకోవచ్చు. ఇటాలియన్ బ్రకోలీ పువ్వు విడివిడిగా వస్తుంది. నీడలో ఉంటే పువ్వు అంత పెద్ద సైజు రాకపోవచ్చు. రాకెట్ లీవ్స్ అనే మరో రకాన్ని పెంచుతున్నారు. ఆర్నమెంటల్ కేల్ చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది. దీని లేత ఆకులను కూర వండుకోవచ్చు. ఈ ఎగ్జోటిక్ పంటలను మనం శీతాకాలంలో మాత్రమే పెంచుకోవచ్చు. నవంబర్ మొదటి వారంలో విత్తనం నాటుకుంటే మంచిది. ఇవి మొలవడానికి, ఆరోగ్యంగా పెరగడానికి పగలు 30, రాత్రి 20 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉండాలి. అందుకే నవంబర్ మొదటి వారం వీటికి అనుకూలం అంటారు నరసింహరాజు.
నవంబర్ మొదటి వారంలో వేసుకునే ఈ మొక్కల్లో కొన్ని రెండు నెలలకు మరికొన్ని మూడు నెలలకు ఇంకొన్ని నాలుగు నెలలకు కోతకు వస్తాయి. నీరో కేల్ ఏడాది పొడవునా వస్తుంది. చెర్రీ టమాట రకాన్ని నరసింహరాజు పెంచుతున్నారు. దీనిలో రెడ్, గ్రీన్ రంగులలో కాయలు ఉంటాయి. చెర్రీ టమాట చాలా సున్నితం అనుకుంటారు. అయితే.. ఇది చాలా మొండిజాతి. సూపర్ మార్కెట్‌లో కిలో చెర్రీ టమాటాలను రూ.150 నుంచి రూ.200 అమ్ముతారు. చెర్రీ టమాటాలు విత్తనాలు పడి మొలిచినా కూడా విపరీతంగా కాస్తుంది. ఒక్కొక్కటి నాలుగైదు మీటర్ల దూరం పాకి 20 నుంచి 30 కిలోల దిగుబడి కూడా ఇస్తుంది. క్యాబేజీ మాదిరిగా ఉండే చైనీస్ క్యాబేజి ఒకటి ఉంది. ఇది క్యాబేజీ కన్నా పొడవుగా తెల్లగా ఉంటుంది.ఐస్‌బెర్గ్ అనే మరో రకం మొక్క ఉంది. ఇది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. బర్గర్‌లో ఎక్కువగా దీన్ని వినియోగిస్తారు. ఐరోపా గార్డెనర్లు చాలా ఇష్టపడేది పాలకూర జాతికి చెందిన, చాలా రుచికరంగా ఉండే మరో జాతి మొక్క ఉంది. దీని కాండం ఎర్రరంగులో ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. పాలకూర కన్నా ఇది కొంచెంగా గట్టిగా ఉంటుంది. పార్సిలీ రకం మొక్క కొద్దిగా కారంగా ఉంటుంది. పప్పులో వేసుకుంటే మంచి రుచి ఇస్తుంది. దీన్నే చైనా కొత్తిమీర అని కూడా అంటారు. మంచి ఔషధ విలువలు దీనిలో ఉంటాయి. లీఫ్‌లెట్యూసీ రకంలో రెడ్, గ్రీన్ వెరైటీలను పెంచుతున్నారు. ఈ మొక్క కింది నుంచి లేత ఆకులను కోసుకుని వండుకుంటూ పై వరకు వాడుకోవచ్చు.. ఈ ఆకులు చిరుచేదుగా ఉంటాయి కానీ పచ్చి వాటిని కూడా డైరెక్ట్‌గా తినవచ్చు.
సక్రమమైన రక్త ప్రసరణకు బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్ చక్కగా పనిచేస్తాయి. ఐరోపా దేశాలవారు బీట్‌రూట్ లేత ఆకులను కూడా ఇష్టంగా తింటారు. సలాడ్స్‌లో కూడా బీట్‌రూట్ లేత ఆకులు వాడతారు. ఒక బెడ్ మీద క్యారట్‌ను నరసింహరాజు పెంచుతున్నారు. క్యారట్ దుంప ముదిరిన తర్వాత కూడా నెల నుంచి 45 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని తింటే శరీరానికి పీచుపదార్థం లభిస్తుంది. జీర్ణాశయానికి, జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. విషం లేని న్యూట్రిషన్ ఆహారంగా క్యారట్‌ను చెప్పుకోవచ్చు. మరో బెడ్ మీద పర్పుల్ లాంగ్ క్యారట్ సాగుచేశారు. దీని విత్తనం మన దగ్గర తయారవదు కానీ దీని మొక్క మనిషి ఎత్తు పెరుగుతుంది.
రెడ్ క్యాబేజిని కూడా తమ తోటలో పెంచుతున్నారు నరసింహరాజు. చాలా ఖరీదైన ఎడిబుల్ యాస్పరాగస్ లేదా శతావరిని కూడా తమ తోటలో పెంచుతున్నారు. దీన్ని పెళ్లిళ్లలో డెకరేషన్ కోసం వాడతారు. దీని వేళ్లను కూడా ఔషధంగా వినియోగిస్తారు. దీన్ని వండుకుని తినొచ్చు. దీని కాండాన్ని ఉప్పు కారం వేసుకొని, కొద్దిగా నూనె వేసి లైట్‌గా వేయించుకొని ఆహారంగా తీసుకోవచ్చు. పచ్చిగా కూడా దీన్ని తినవచ్చు. జామకాయ తిన్నట్లు ఉంటుంది. దాని కంటే కొంచెం తీపి తక్కువ ఉంటుంది.
క్రిస్పీగా, పెళుసుగా ఉండే పాక్చీ అనే ఆకుకూరను చైనీస్ నూడిల్స్‌లో తప్పకుండా వాడతారు. విత్తనం నాటిన రెండు నెలలకే వినియోగానికి వస్తుంది. కారప్పూసలా కరకరలాడుతుంది. లీఫ్ లెట్యూస్, పాక్సీ మాత్రమే మన దగ్గర విత్తనాలు వస్తాయి. చల్లని ప్రదేశాల్లో ఇవి బాగా వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న భూమిలో పండిన ఏ పంటలైనా ఆహారంగా తీసుకున్న మనుషులు, జంతువులకు మంచి ఆరోగ్యం లభిస్తుందంటారు నరసింహరాజు. మొక్కలు స్వయం పోషకాలు. అయితే.. కొద్దిగా నీరు అందిస్తే చాలు అవి చక్కగా పెరుగుతాయి.
Food Medicine From Kitchen Garden