ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్టేట్ ఆర్గానిక్ పాలసీని రూపొందించాలని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేంద్రియ విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు (G.O.RT.No. 63) జారీ చేశారు.
సేంద్రియ వ్యవసాయం ఒక సంపూర్ణ ఉత్పత్తి నిర్వహణ వ్యవస్థ. అది జీవవైవిధ్యంతో సహా వ్యవసాయ-పర్యావరణ స్వస్థతను పెంచుతుంది. సింథటిక్ పదార్థాలను ఉపయోగించటానికి బదులు సేంద్రియ పద్ధతులను అనుసరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రైతులకు, పర్యావరణానికి మేలు చేస్తుంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న సాంకేతికత పరిజ్ఞానాన్ని పరిశీలించాలని, సేంద్రియ వ్యవసాయంలో అనుసరించవలసిన ప్రోటోకాల్స్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మరో 16 మంది సభ్యులుగా ఉంటారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మార్కెటింగ్ స్పెషల్ సెక్రటరీ, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ నైస్ చైర్మన్, హార్టికల్చర్ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, మత్స్యశాఖ కమిషనర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రతినిధి, ఐసీసీఓఏ (International Competence Center for Organic Agriculture)కు చెందిన మనోజ్ మీనన్, ఆర్గానిక్ ఉత్పత్తుల పరిజ్ఞానం కలిగిన మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధి ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ఈ కమిటీ ఏపీలో సేంద్రియ సాగు స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ ఆర్గానిక్ డ్రాఫ్ట్‌ పాలసీని రూపొందిస్తుంది. ఈ కమిటీ 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించవలసి ఉంటుంది. అంటే 2021 మార్చి 18కల్లా ఈ కమిటీ తన నివేదికను ఇస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ZBNF ప్రాజెక్టు అమలు అవుతోంది. దానికి కొనసాగింపుగా ప్రభుత్వం ఆర్గానిక్ సాగును మరింత ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆర్గానిక్ సాగు విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం పాలసీని రూపొందిస్తే, దానికి అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టేందుకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తుంది. అందులో భాగంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు రాయితీలతో పాటు వారి ఆహారోత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కూడా సమకూరతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్గానిక్ సాగుపై మరో ముందడుగు వేయడం ముదావహం.

ఆర్గానిక్ సాగు పాలసీ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు (PDF) కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

2021AGLC_RT63

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here